న్యూఢిల్లీ: డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ ఈ ఆర్థిక సంవత్సరం రెండవ క్వార్టర్ (జూలై-–సెప్టెంబర్) ఫలితాలను ప్రకటించింది. గత సెప్టెంబరుతో పోలిస్తే పన్ను తర్వాత నికర లాభం (పీఏటీ)లో 14.5 శాతం పెరిగింది.
బ్రాండెడ్ మార్కెట్లలో భారీ అమ్మకాలతో ఇది రూ. 1,437 కోట్లకు చేరింది. కంపెనీ ఆదాయం గతేడాది ఇదే క్వార్టర్లో రూ. 8,016 కోట్లు ఉండగా, ఈ క్వార్టర్లో రూ. 8,805 కోట్లకు పెరిగింది. బ్రాండెడ్ మార్కెట్లలో వృద్ధి, నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ (ఎన్ఆర్టీ) నుంచి భారీ ఆదాయం వల్లే రెండో క్వార్టర్లో వృద్ధి సాధ్యమైందని కంపెనీ తెలిపింది.
యూఎస్ లెనాలిడోమైడ్ అమ్మకాలు తగ్గినా, దీని వృద్ధి బాగుందని కంపెనీ కో–-చైర్మన్, ఎండీ జీవీ ప్రసాద్ తెలిపారు. ఈసారి నార్త్ అమెరికా మార్కెట్లో అమ్మకాలు 13 శాతం తగ్గి రూ. 3,241 కోట్లుగా నమోదయ్యాయి. యూరప్ నుంచి ఆదాయం రూ. 1,376 కోట్లకు పెరిగింది. భారతదేశ మార్కెట్ ఆదాయం 13 శాతం పెరిగి రూ. 1,578 కోట్లకు చేరుకుంది.
ఎమర్జింగ్ మార్కెట్స్ ఆదాయం 14 శాతం వృద్ధి చెంది రూ. 1,655 కోట్లుగా నమోదైంది. ఫార్మాస్యూటికల్ సర్వీసెస్ యాక్టివ్ ఇంగ్రిడియెంట్స్ ఆదాయం 12 శాతం పెరిగి రూ. 945 కోట్లుగా ఉంది. కంపెనీ షేర్లు శుక్రవారం 0.32 శాతం పెరిగి రూ. 1,284 వద్ద ముగిశాయి.
