77 శాతం పెరిగిన డాక్టర్​ రెడ్డీస్​ లాభం

77 శాతం పెరిగిన డాక్టర్​ రెడ్డీస్​ లాభం

హైదరాబాద్​, వెలుగు : ఫార్మా కంపెనీ డాక్టర్​ రెడ్డీస్​ లేబొరేటరీస్​ లిమిటెడ్​ నికర లాభం డిసెంబర్​ 2022 క్వార్టర్లో 77 శాతం పెరిగి రూ. 1,247 కోట్లకు చేరింది. 2022 క్యూ 3 లో రెవెన్యూ కూడా 27 శాతం పెరిగి రూ. 6,770 కోట్లయింది. ఎనలిస్టుల అంచనాలకు మించిన ఫైనాన్షియల్​ రిజల్ట్స్​ను డాక్టర్​ రెడ్డీస్​ ప్రకటించింది.  తాజా క్వార్టర్లో కంపెనీ  రూ. 5,830 కోట్ల ఆదాయంపై రూ. 910 కోట్ల నికర లాభం ప్రకటిస్తుందని ఎనలిస్టులు ఇంతకు ముందు అంచనా వేశారు. తాజా క్యూ 3 లో గ్రాస్​ మార్జిన్​ 59.2 శాతానికి మెరుగుపడినట్లు డాక్టర్​ రెడ్డీస్​ సీఈఓ ఎరెజ్​ ఇజ్రేలీ మీడియాకు చెప్పారు. నార్త్​ అమెరికా, రష్యా మార్కెట్లలో గ్రోత్​ వల్లే మంచి పెర్​ఫార్మెన్స్​ సాధించగలిగినట్లు పేర్కొన్నారు. కొత్త ప్రొడక్టుల లాంఛ్​, ఫారెక్స్​ కదలికల వల్ల గ్రాస్​ ప్రాఫిట్​ మార్జిన్​ పెరిగిందని వివరించారు. గ్లోబల్​ జెనరిక్స్​, పీఎస్​ఏఐ బిజినెస్​ సెగ్మెంట్లలో గ్రాస్​ ప్రాఫిట్​ మార్జిన్లు వరసగా 64.6 శాతం, 18.2 శాతంగా ఉన్నాయని చెప్పారు. 

డాక్టర్​ రెడ్డీస్​ లేబొరేటరీస్​ లిమిటెడ్​ గ్లోబల్​ జెనరిక్స్​ సెగ్మెంట్​ రెవెన్యూ కిందటిసారి క్యూ 3 తో పోలిస్తే 33 శాతం ఎక్కువై రూ. 5,920 కోట్లకు చేరింది. సీక్వెన్షియల్​గా చూసినా ఇది 6 శాతం పెరిగింది. నార్త్​ అమెరికా మార్కెట్లో 64 శాతం గ్రోత్​, యూరోప్​ మార్కెట్లో 6 శాతం గ్రోత్,  ఇండియా మార్కెట్లో 10 శాతం గ్రోత్​, ఎమర్జింగ్​ మార్కెట్లలో 14 శాతం గ్రోత్​ సాధించినట్లు డాక్టర్​ రెడ్డీస్​ వెల్లడించింది. ఫార్మాస్యూటికల్​ సర్వీసెస్​ అండ్​ యాక్టివ్​ ఇన్​గ్రీడియెంట్స్​ (పీఎస్​ఏఐ) సెగ్మెంట్లో తాజా క్యూ 3 లో 7 శాతం గ్రోత్​ కనబరిచినట్లు పేర్కొంది. 

9 నెలల్లో.....

డిసెంబర్​ 2022 దాకా 9 నెలలకు కలిపి చూస్తే డాక్టర్​ రెడ్డీస్​ రెవెన్యూ రూ. 18,291 కోట్లకు పెరగ్గా, నికర లాభం రూ. 3,548 కోట్లకు చేరింది.  అంటే రెవెన్యూ 14 శాతం, నికర లాభం 56 శాతం పెరిగినట్లు.