హైదరాబాద్, వెలుగు: డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ లిమిటెడ్ నికర లాభం క్యూ 4 లో భారీగా పెరిగి రూ.959 కోట్లకు చేరింది. అమెరికా మార్కెట్లో కొత్త ప్రొడక్టుల లాంఛ్, బ్రాండ్ డీల్స్ వల్లే లాభం ఎక్కువైనప్పటికీ, ఎనలిస్టుల అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది. అంతకు ముందు ఏడాది అంటే మార్చి 2022 క్వార్టర్లో డాక్టర్ రెడ్డీస్‌కు రూ. 87.5 కోట్ల నికర లాభం వచ్చింది. ఆ క్వార్టర్లో అసాధారణమైన ఇంపెయిర్మెంట్ ఛార్జీల వల్ల కంపెనీ లాభం బాగా తగ్గిపోయింది. 9 డెర్మటాలజీ బ్రాండ్స్‌ను ఎరిస్ లైఫ్సైన్సెస్కు అమ్మడం ద్వారా రూ. 275 కోట్లు లభించిందని డాక్టర్ రెడ్డీస్ తెలిపింది.
రెవెన్యూ కూడా తాజా క్యూ 4 లో 15.81 శాతం పెరిగి రూ. 6,296.80 కోట్లయింది. క్యూ3లో ఇది రూ.6,770 కోట్లు. రెవ్లిమిడ్ జెనరిక్తోపాటు, ఇతర కొత్త ప్రొడక్టులను అమెరికా మార్కెట్లో లాంఛ్చేయడం వల్ల అక్కడ అమ్మకాలు ఊపందుకున్నాయని కంపెనీ పేర్కొంది. డొమెస్టిక్ ఫార్ములేషన్ బిజినెస్ కూడా రెండంకెల గ్రోత్ సాధించిందని వివరించింది. సెక్వెన్షియల్గా చూస్తే మాత్రం డాక్టర్ రెడ్డీస్ రెవెన్యూ తగ్గింది. డాక్టర్ రెడ్డీస్ షేర్లు ఎన్ఎస్ఈలో 1.34 శాతం నష్టపోయి రూ. 4,867.30 వద్ద క్లోజయయ్యాయి. డైరెక్టర్ల బోర్డు రూ.40 చొప్పున డివిడెండ్‌ను రికమెండ్ చేసింది.
