- మొంథా తుఫాను బాధిత ఫ్యామిలీలకు రూ.12.99 కోట్లు రిలీజ్
- 15 జిల్లాల్లో పాక్షికంగా దెబ్బతిన్న 8,662 ఇండ్లకు తక్షణ సాయం
- నిధులు విడుదల చేస్తూ సర్కారు ఉత్తర్వులు
హైదరాబాద్, వెలుగు: మొంథా తుఫాను కారణంగా దెబ్బతిన్న ప్రతి ఇంటికి రూ.15 వేలు తక్షణ సాయం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 15 జిల్లాల్లో పాక్షికంగా దెబ్బతిన్న 8,662 ఇండ్లకు రూ.12.99 కోట్లు రిలీజ్ చేస్తూ డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అక్టోబర్ 27 నుంచి 30 వరకు రాష్ట్రంలోని 15 జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు జరిగిన నష్టంపై ప్రభుత్వం కలెక్టర్ల ద్వారా నివేదిక తెప్పించుకుంది.
దెబ్బతిన్న ఇండ్ల కుటుంబాలకు తక్షణ సాయం అందించేందుకు నిధులు విడుదల చేసింది. ఈ నిధులను నేరుగా బాధిత ఫ్యామిలీల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు. నష్టం జరిగిన ప్రతి ఫ్యామిలీకి ఇచ్చే రూ.15 వేలల్లో ఇంటి నిర్మాణ మరమ్మతుకు రూ.6,500, దుస్తులు, వంటసామగ్రి నష్టానికి వేర్వేరుగా రూ.2,500 చొప్పున, జీవనోపాధి నష్టానికి రూ.3,500 ఇస్తున్నట్టు పేర్కొన్నారు. వరదల్లో ఇల్లు మునిగి, జీవనోపాధి దెబ్బతిన్న కుటుంబాలను ‘పాక్షికంగా దెబ్బతిన్న ఇల్లు’ కేటగిరీ కింద పరిహారం ఇస్తున్నారు.
దెబ్బతిన్న ఇండ్లు జిల్లాల వారీగా..
జిల్లా కలెక్టర్లు ఇచ్చిన నివేదికల ప్రకారం..15 జిల్లాల్లో మొత్తం 8,662 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. వీరిలో అత్యధికంగా హన్మకొండ జిల్లాలో 4,691 ఇండ్లు (రూ.7.03 కోట్లు) వరంగల్‌లో 3,368 ఇండ్లు (రూ.5.05 కోట్లు) దెబ్బతిన్నాయి. నాగర్‌కర్నూల్‌లో 139 ఇండ్లు, వికారాబాద్‌లో 166, వనపర్తిలో 88, నల్గొండలో 51, సిద్దిపేటలో 44, సిరిసిల్లలో 19, యాదాద్రి భువనగిరిలో 17, కరీంనగర్‌లో 17, రంగారెడ్డిలో 15, మహబూబాబాద్‌లో 16, మహబూబ్‌నగర్‌లో 13, సూర్యాపేటలో 13, ములుగులో ఐదు ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి.
ఈ సహాయంతోపాటు, మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు ఎక్స్-గ్రేషియా ప్రకటించారు. పాలిచ్చే పశువులకు రూ.50 వేలు, చిన్న పశువులకు రూ.5 వేలు సహాయం ఇవ్వనున్నారు. దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులు, పాఠశాలలు వంటి నిర్మాణాల తాత్కాలిక పునరుద్ధరణ పనులను వెంటనే ఎస్డీఆర్ఎఫ్ నిబంధనల ప్రకారం చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు.
