రోహిణి కోర్టు బాంబు పేలుడు కేసులో డీఆర్డీఓ సైంటిస్ట్ అరెస్ట్

రోహిణి కోర్టు బాంబు పేలుడు కేసులో డీఆర్డీఓ సైంటిస్ట్ అరెస్ట్

ఢిల్లీ : రోహిణి కోర్టులో ఇటీవల జరిగిన బాంబు పేలుకు కేసుకు సంబంధించి ఢిల్లీ స్పెషల్ పోలీస్ సెల్ ఓ డీఆర్డీఓ సైంటిస్టును అరెస్ట్ చేశారు. పాతకక్షల నేపథ్యంలో నిందితుడు తన ఇంటి పొరుగున ఉండే ఓ లాయర్ ను హతమార్చేందుకు పేలుడుకు పాల్పడినట్లు తెలుస్తోంది. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా పేలుడుకు పాల్పడిన నిందితున్ని పోలీసులు గుర్తించారు. ఘటన జరిగిన రోజున కోర్టు ఆవరణలో ఉన్న వెయ్యి వాహనాలతో పాటు 100 సీసీ టీటీ కెమెరాల ఫుటేజ్ తో పాటు ఆ రోజు కోర్టులో విచారణ జరిగిన కేసుల వివరాలను సైతం పరిశీలించినట్లు ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేశ్ ఆస్థానా తెలిపారు. పేలుడుకు అమోనియం నైట్రైట్ ను ఉపయోగించినట్లు గుర్తించారు. పేలుడు పదార్థం కలిగిన టిఫిన్ బాక్స్ ఉన్న ల్యాప్ టాప్ బ్యాగుపై ఉన్న కంపెనీ లోగో ఆధారంగా నిందితున్ని పట్టుకున్నారు. 
కోర్టు కేసులతో తనను మానసికంగా ఇబ్బందికి గురిచేసినందునే లాయర్ ను హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు నిందితుడు అంగీకరించినట్లు సమాచారం. సైంటిస్టు కావడంతో పేలుడు పదార్థాల తయారీకి అవసరమైన పరిజ్ఞానం ఉన్నట్లు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే సదరు న్యాయవాది నిందితునిపై 10 కేసులు నమోదుచేశాడని, అవన్నీ దర్యాప్తులో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. డిసెంబర్ 9న రోహిణి కోర్టు రూం నెంబర్ 102 లో జరిగిన పేలుడులో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. భారీ శబ్దం రావడంతో కోర్టు హాల్ లో ఉన్న వారంతా భయంతో పరుగులు తీశారు. అంతకు ముందు సెప్టెంబర్ లోనూ రోహిణి కోర్టులో ఓ గ్యాంగ్ స్టర్ పై కొందరు కాల్పులు జరిగాయి. రెండు నెలల వ్యవధిలో రెండు ఘటనలు జరగడంతో కోర్టులో భద్రతా చర్యలపై విమర్శలు వెల్లువెత్తాయి.