
- డిఆర్డీవోకు రాజ్ నాథ్ అభినందనలు
న్యూఢిల్లీ: డ్రోన్ సాయంతో క్షిపణి పరీక్షను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) విజయవంతంగా నిర్వహించింది. ఏపీలోని కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పాలకొలనులో శుక్రవారం ఈ పరీక్ష నిర్వహించారు. యూఏవీ లాంచ్డ్ ప్రెసిషన్ గైడెడ్ మిసైల్ గా పిలిచే (యూఎల్ పీజీఎం) వీ3 మిసైల్.. లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది.
‘న్యూస్పేస్ రీసెర్చ్ టెక్నాలజీస్’ (బెంగళూరు) అనే ఇండియన్ స్టార్టప్ కంపెనీ దేశీయంగా అభివృద్ధి చేసిన మానవరహిత ఏరియల్ వెహికల్(డ్రోన్) తో యూఎల్ పీజీఎం వీ3 మిసైల్‌ను పరీక్షించారు. యూఎల్ పీజీఎం వీ2 మిసైల్‌ను అప్ గ్రేడ్ చేసి యూఎల్ పీజీఎం వీ3 ని డీఆర్డీవో సైంటిస్టులు అభివృద్ధి చేశారు. సుదూరంలోని లక్ష్యాలను గుర్తించి ఛేదించగల హై డెఫినిషన్ డ్యుయెల్ చానెల్ సీకర్‌తో పాటు త్రీ మాడ్యులర్ వార్ హెడ్ ఆప్షన్లతో ఈ క్షిపణిని డెవలప్ చేశారు.
యాంటీ బంకర్ అప్లికేషన్ వార్ హెడ్ కూడా ఈ మిసైల్ సొంతం. యూఎల్ పీజీఎం సిస్టమ్స్‌తో అభివృద్ధి చేసిన క్షిపణులు తేలికగా ఉంటాయి. అత్యంత కచ్చితత్వంతో టార్గెట్‌ను ఛేదిస్తాయి. డ్రోన్లతోనే కాకుండా వివిధ ఏరియల్ ప్లాట్ ఫాంలతోనూ వీటిని ప్రయోగించవచ్చు.
కాగా, ‘‘డ్రోన్ ద్వారా మిసైల్ పరీక్షతో భారత రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం అయింది. యూఎల్ పీజీఎం వీ3 క్షిపణి వ్యవస్థ అభివృద్ధిలో పాలు పంచుకున్న డీఆర్డీవో సైంటిస్టులతో పాటు స్టార్టప్ సంస్థల సిబ్బందికి అభినందనలు” అంటూ రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేశారు.