సెలవులో ఉన్నప్పుడు ఫోన్లు కుదరవ్​..

సెలవులో ఉన్నప్పుడు ఫోన్లు కుదరవ్​..

న్యూఢిల్లీ: సెలవులో ఉన్నప్పుడు కూడా ఆఫీసు నుంచి కాల్స్ వస్తే ఉద్యోగులకు చిరాకు కలగడం సహజం. మెసేజ్​లు, ఈ–మెయిల్స్​ వచ్చినా ఇబ్బందిగానే అనిపిస్తుంది. ఇండియన్ ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌ఫారమ్ డ్రీమ్ 11 ఈ సమస్యను పరిష్కరించడానికి "డ్రీమ్ 11 అన్‌‌‌‌ప్లగ్" అనే ఆసక్తికరమైన విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది.  ఈ విధానం ప్రకారం కంపెనీ సిబ్బంది ఆఫీసు పని, సంబంధిత ఈ–మెయిల్స్​, వాట్సాప్ మెసేజెలు​ లేదా కాల్స్​కు ఒక వారం పాటు దూరంగా ఉండవచ్చని లింక్డ్‌‌‌‌ ఇన్ పోస్ట్‌‌‌‌ ద్వారా డ్రీమ్​11 వెల్లడించింది.

సెలవులో ఉన్న ఉద్యోగులకు అంతరాయం కలగకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నామని వెల్లడించింది. మనకు ఇష్టమైన వారితో ఎక్కువ సమయం గడిపితే మరింత సంతోషంగా ఉంటామని, మరింత బాగా పనిచేయగలుగుతామని పేర్కొంది. ఈ విషయమై డ్రీమ్ 11 ఫౌండర్​ హర్ష్ జైన్  భవిత్ సేథ్ మాట్లాడుతూ, "అన్​ప్లగ్​"లో ఉన్న ఉద్యోగిని ఎవరైనా సహోద్యోగి సంప్రదిస్తే రూ. లక్ష జరిమానా చెల్లించవలసి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ స్పోర్ట్స్ టెక్నాలజీ యునికార్న్‌‌‌‌లో పనిచేసే టాప్ బాస్‌‌‌‌ల నుండి మొదలుకొని కొత్త ఉద్యోగుల వరకు, ప్రతి ఒక్కరూ ఏడాదికి ఒక వారం పాటు ‘అన్​ప్లగ్​’ సదుపాయం పొందవచ్చు.  2008లో ఏర్పడ్డ డ్రీమ్ 11 కి ప్రస్తుతం 15 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. 2020 లో  ఇది ఇండియన్ ప్రీమియర్ లీగ్ కి టైటిల్ స్పాన్సర్‌‌‌‌గానూ మారింది.