
- వద్దన్న నీళ్లే దిక్కు!.
- గండిపేట, హిమాయత్ సాగర్ నుంచి సిటీకి తాగునీళ్లు
- ఎండలు మండుతున్న కొద్దీ పెరుగుతున్న వాడకం
- గతంలో జంట జలాశయాల నీళ్లు అక్కర్లేదన్న సీఎం కేసీఆర్
- పోయిన సారి వర్షపు నీళ్లన్నీ మూసీ పాలు
- ఇప్పుడు ఈ రెండు చెరువుల నీళ్ల వాడకంతో తగ్గుతున్న ఖర్చు
హైదరాబాద్, వెలుగు: ఈ ఎండాకాలంలో హైదరాబాద్ నగరానికి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నీళ్లే అక్కరకు వస్తున్నాయి. జంట జలాశయాల నీళ్లు హైదరాబాద్ కు ఇక అవసరం ఉండబోదంటూ సీఎం కేసీఆర్ గతంలో ప్రకటించారు. గత రెండేండ్లుగా ఈ జలాశయాల నీటిని పెద్దగా వినియోగించలేదు కూడా. కానీ ఈసారి మార్చి నుంచే ఈ రెండు చెరువుల నుంచి నీళ్ల వినియోగాన్ని ప్రారంభించారు.
ఎండలు ముదురుతున్నకొద్దీ నీటి వినియోగాన్ని పెంచేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు. వీటి నుంచి గతేడాది వేసవిలో పెద్దగా నీటిని వాడలేదు. హిమాయత్ సాగర్ నుంచి అయితే నామ్ కే వాస్తేగా రోజూ 2 ఎంజీడీ(మిలియన్ గ్యాలన్ పర్ డే)లనే వాడారు. కానీ ఈసారి రెండు జలాశయాల నీటిని నాన్ స్టాప్ గా వాడుతున్నారు. ఎండలు దంచి కొడుతుండడంతో అవసరాన్ని బట్టి వినియోగాన్ని పెంచుతున్నారు. మరోవైపు నాగార్జున సాగర్ నీటిమట్టాలు తగ్గుతున్నాయి. సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, గతేడాది ఏప్రిల్ లో 546 అడుగుల నీరు ఉండేది. కానీ ఈ ఏడాది ఏప్రిల్ లో 528 అడుగుల నీరే ఉంది. అంటే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది18 అడుగుల నీటి మట్టం తగ్గింది. అత్యధికంగా నాగార్జున సాగర్ తో పాటు అక్కంపల్లి నుంచే 1,166 మిలియన్ లీటర్ల నీరు నగరానికి సరఫరా అవుతోంది. అయితే అక్కంపల్లిలో తగ్గకపోయినప్పటికీ సాగర్ లో నీటిమట్టాలు తగ్గాయి. మరింత తగ్గితే ఇక్కడి నుంచి నగరానికి తరలించే నీరు తగ్గనుంది. అదే జరిగితే జంట జలాశయాల నీరు చాలావరకు వినియోగించే అవకాశం ఉంది.
నిరుడు వర్షపు నీరంతా వృథా
జంట జలాశయాల నీరు అసలు అక్కరకే ఉండదని సీఎం కేసీఆర్ గతంలోనే ప్రకటించారు. అయితే,111 జీవోను ఎత్తి వేసేందుకే వీటి అవసరం లేదన్నట్లుగా చెప్తున్నారని ప్రతిపక్షాలు విమర్శించాయి. జంట జలాశయాలు వరదలను నివారించడంతోపాటు తాగునీటికీ ఉపయోగపడతాయని, వందలాది కిలోమీటర్ల దూరం నుంచి కృష్ణా, గోదావరి జలాలను నగరానికి తీసుకురావడం వల్ల కరెంట్ బిల్లుల ఖర్చులు వృథా చేయకుండా పక్కనే ఉన్న ఈ నీటిని వాడుకోవాలని అప్పట్లో పర్యావరణవేత్తలు, ఎక్స్ పర్ట్ లు ప్రభుత్వానికి సూచించారు. జంట జలాశయాలను కాపాడాలంటూ కోర్టులను ఆశ్రయించారు. ఇక లాస్ట్ ఇయర్ వర్షాకాలానికి ముందే రెండు జలాశయాలు నిండుకుండల్లా కనిపించాయి. వరద నీరంతా మూసీలోనే కలిసింది. దీనిపై అప్పట్లో ఎక్స్ పర్ట్స్ ఫైర్ అయ్యారు. సమ్మర్ లో నీటిని వాడకపోవడంతో వర్షపు నీరంతా వృథాగా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసారి ఆ తప్పును రిపీట్ చేయకుండా జలాశయాల నీటిని వాడుతున్నారు. ప్రస్తుతం ఉస్మాన్ సాగర్ నుంచి రోజూ14.3 ఎంజీడీ, హిమాయత్ సాగర్ నుంచి 10 ఎంజీడీల నీటిని వినియోగిస్తున్నారు. రానున్న రోజుల్లో వినియోగాన్ని పెంచనున్నట్లు చెబుతున్నారు.
దగ్గరి నీటిని ఎక్కువ వాడుకోవాలె
ఎండల తీవ్రత కారణంగా జలమండలి పరిధిలో ప్రస్తుతం రోజూ 555 ఎంజీడీ(2,472 మిలియన్ లీటర్లు) డిమాండ్ ఉంది. ఇందులో కృష్ణా జలాలు1,166 మిలియన్ లీటర్లు, గోదావరి నుంచి 767, మంజీరా నుంచి 176, సింగూరు నుంచి 256, ఉస్మాన్ సాగర్ నుంచి 65, హిమాయత్ సాగర్ నుంచి 42 మిలియన్ లీటర్లను తరలిస్తున్నారు. అయితే సిటీ పక్కనే ఉన్న జంట జలాశయాల నీటిని మరింత వినియోగించి దూర ప్రాంతాల నుంచి తగ్గిస్తే విద్యుత్ బిల్లుల భారం ఉండదని ఎక్స్ పర్ట్స్ అంటున్నారు.
గతేడాది వాడుకోకనే తిప్పలు
జంట జలాశయాల గేట్లు ఎన్నడూ లేని విధంగా గతేడాది అత్యధికంగా ఎక్కువ రోజులు ఓపెన్ చేశారు. వర్షాకాలానికి ముందే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు ఫుల్ గా ఉండటంతో వర్షాలు మొదలైనప్పటి నుంచి గేట్లు ఓపెన్ చేయక తప్పలేదు. ఒక్కో సందర్భంలో ఇన్ ఫ్లో తగ్గకపోవడంతో ఏం జరుగుతుందోనని అధికారులు టెన్షన్ పడ్డ రోజులూ ఉన్నాయి. ఉస్మాన్ సాగర్ గేట్లను 2010లో 40 రోజుల పాటు ఓపెన్ చేసి 0.612 టీఎంసీల నీటిని మూసీలోకి వదలగా, గతేడాది 76 రోజులపాటు గేట్లను ఎత్తి 5.877 టీఎంసీల నీటిని వదిలారు. 2020 వరదల సమయంలోనూ గేట్లు ఎత్తే అవసరం రాలేదు. ఉస్మాన్ సాగర్ కు15 గేట్లు ఉండగా, ఎన్నడూ లేని విధంగా గతేడాది అక్టోబర్ లో 12 గేట్లను ఓపెన్ చేశారు.
భారీగా కరెంట్ బిల్లుల భారం
హైదరాబాద్ శివారులోనే ఉన్న జంట జలాశయాల నుంచి నీటిని సరఫరా చేయకుండా 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్లంపల్లి నుంచి గోదావరి జలాలను,180 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోదండాపూర్ నుంచి కృష్ణా వాటర్ ను నగరానికి తీసుకొస్తున్నారు. ఈ జలాల తరలింపుతో పాటు నగరం నలుమూలలా సరఫరా కోసం జలమండలి 200 మెగావాట్ల విద్యుత్‌ను వినియోగిస్తోంది. ఇందుకు నెలకు రూ.70 కోట్ల మేర బిల్లులు చెల్లిస్తోంది. అంటే రోజూ రూ.2 కోట్లకుపైగా ఖర్చు చేస్తోంది. కృష్ణా, గోదావరి నీటిని తరలిస్తున్నప్పటి నుంచి జలమండలిపై విద్యుత్ భారం చాలా పెరిగింది. కరోనా తర్వాత పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఫండ్స్ లేకపోవడంతో కరెంట్ బిల్లులను సైతం చెల్లించలేకపోతోంది. ఇప్పటికే రూ.3,200 కోట్ల బకాయిలు పడింది. అదేగనక హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నీటిని వినియోగిస్తే ఇందులో 10 శాతం కూడా ఖర్చు అవ్వదు. కానీ దీన్ని పట్టించుకోకుండా వందలాది కిలోమీటర్ల నుంచి నీటిని తీసుకొచ్చి ప్రజాధనాన్ని పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నారు.
దగ్గరి నీళ్లు ఎందుకొద్దంటున్నరో తెలియట్లే
ఖర్చు లేకుండా దగ్గరి నుంచి సరఫరా చేసే నీటిని వదిలిపెట్టి దూర ప్రాంతాల నుంచి నీటిని ఎందుకు తెస్తున్నారో అర్థం కావడం లేదు. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాల అవసరం లేదని చూపించడానికే ఇలా చేస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ వీటి అవసరం ఎప్పటికీ ఉంటుంది. వరదలతో పాటు తాగునీటి అవసరాలకు కూడా ఇవి ఎంతో ఉపయోగపడతాయి. ఈసారి నాగర్జున సాగర్, శ్రీశైలంలలో నీరు తగ్గుతుంది. ఈ సమ్మర్ లో జంట జలాశయాల నీటిని వాడితే వర్షాలు కురిసిన సమయంలో మళ్లీ ఫుల్ అవుతాయి. గతేడాది పెద్దగా వాడకపోవడంతో వరద నీరంతా మూసీలో వృథాగా పోయింది. జలాశయాలను కాలుష్యం నుంచి కాపాడాలె.
- దొంతి నర్సింహారెడ్డి, పర్యావరణవేత్త