
- ప్రభుత్వ స్కూళ్లపై పేరెంట్స్కు నమ్మకం పెంపొందిస్తం
- నిబంధనలకు విరుద్ధంగా నడిచే ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు
- విద్యారంగంలో సంస్కరణలపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ
- ప్రైవేట్ బడుల్లో ఫీజుల నియంత్రణపై 5 గంటల సుదీర్ఘ చర్చ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రైవేట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి సంకల్పమని, దానికోసం ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. సర్కార్ బడులపై పేరెంట్స్ నమ్మకాన్ని పెంచి, వాటికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. గత పదేండ్లలో రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన విద్యావ్యవస్థ ముఖచిత్రాన్ని మార్చాలన్నదే ప్రజాప్రభుత్వం లక్ష్యమని చెప్పారు. ఇది ప్రజల కోసం పని చేసే ప్రభుత్వమని, మాటల్లో కాదు చేతల్లో మార్పును చూపిస్తామని ఆయన వెల్లడించారు.
ప్రైవేట్ బడులలో ఫీజుల నియంత్రణపై త్వరలోనే అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే ప్రైవేట్ విద్యాసంస్థలపై కఠినంగా వ్యవహరించాలని, విద్యార్థుల భద్రత అంశంలో రాజీ పడొద్దని స్పష్టం చేశారు. వచ్చే విద్యాసంవత్సరంలో ప్రయోగాత్మకంగా వెయ్యి ప్లే స్కూల్స్ ను ప్రారంభించబోతున్నట్లుగా చెప్పారు. సోమవారం ‘విద్యారంగంలో సంస్కరణలు’ అనే అంశంపై నియమించిన మంత్రివర్గ ఉప సంఘం సచివాలయంలో సమావేశమైంది. ఈ సందర్భంగా పేరెంట్స్, మేనేజ్మెంట్లు, విద్యాశాఖ అధికారులతో సుమారు 5 గంటల పాటు సుదీర్ఘంగా భేటీ అయింది.
ఈ సమావేశంలో ప్రైవేట్ బడుల్లో ఫీజుల నియంత్రణపై ప్రధానంగా చర్చించారు. దీంతో పాటు రాబోయే రోజుల్లో తెలంగాణ విద్యా వ్యవస్థ దేశంలోనే ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా ఉండేందుకు తీసుకోవాల్సిన కార్యాచరణపై మంత్రివర్గ ఉప సంఘం చర్చించింది. ఇతర రాష్ట్రాల అధికారులు మన దగ్గరికొచ్చి అధ్యయనం చేసేలా మార్పు తీసుకురావాలని సంబంధిత యంత్రాంగానికి సూచించింది.
స్టూడెంట్లను నిపుణులుగా తీర్చిదిద్దేలా కరిక్యులమ్
చిన్నతనం నుంచే ఏఐ లాంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్ లో స్టూడెంట్లను నిపుణులుగా తీర్చిదిద్దేలా కరిక్యులమ్ లో మార్పులు చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. సర్కార్ బడుల్లో పనిచేసే టీచర్లకు కావాల్సిన శిక్షణపై సమావేశంలో చర్చించామన్నారు. ఇప్పటికే డీఈఓలకు మూడ్రోజుల పాటు ప్రత్యేక క్యాంప్ నిర్వహించామని, సత్ఫలితాలొచ్చాయని తెలిపారు. డీఈఓ, ఎంఈఓలు క్షేత్రస్థాయిలో నిరంతరం తనిఖీలు నిర్వహించి లోపాలను సరి చేయాలని సూచించారు. తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలిచ్చే విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్(ఆర్టీఈ)ను తప్పనిసరిగా అమలు చేస్తామని, ఇందుకోసం ఎంత బడ్జెట్ అయినా కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
రాష్ట్రంలోని అన్ని సర్కారు వర్సిటీల్లో కామన్ డిటెన్షన్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు ప్రారంభించామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఒకే రకమైన ఎగ్జామ్ ఫీజును కూడా రూపొందిస్తామన్నారు. సమావేశంలో సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, విద్యాశాఖ ఉన్నతాధికారులు యోగితా రాణా, దేవసేన, హరిత, నర్సింహా రెడ్డి, కృష్ణ ఆదిత్య, హెచ్ఎస్పీఏ నుంచి వెంకట సాయినాథ్, ట్రస్మా ప్రతినిధులు ఎస్ఎన్ రెడ్డి, మధుసూదన్, ఇస్మా ప్రతినిధులు సునీల్ కుమార్, వైసీ చౌదరి, ముస్లిం మైనార్టీ అసోసియేషన్ నుంచి అన్వర్ అహ్మద్, క్రిస్టియన్ అసోసియేషన్ తరఫున బాలశౌరి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.