
వైద్యుడు అంటే ఓ భరోసా. డాక్టర్ అంటే మన ప్రాణాలను కాపాడే దేవుడు. కానీ, ఆ దేవుడు మత్తులో మునిగితే.. రోగి మదిలో ఉండే విశ్వాసం తగ్గిపోతుంది. ఇటీవలి కాలంలో డ్రగ్స్‌కు బానిసలవుతున్న యువ వైద్యుల వార్తలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. వైద్యరంగం అనేది సేవాధర్మంతో కూడుకున్న పరమ పవిత్రమైన రంగం. అయితే, అత్యధిక ఒత్తిడిలో పనిచేసే ఈ వృత్తిలో కొందరు వైద్యులు.. ఒత్తిడిని అధిగమించేందుకు మత్తు పదార్థాలను ఆసరాగా తీసుకుంటున్నారు.
ప్రస్తుతం ఇది వారి వ్యక్తిగత సమస్య మాత్రమే కాదు. ఈ సమస్య దేశ ప్రజారోగ్య వ్యవస్థపై ముప్పుగా మారుతోంది. దేశంలో 2022 నాటి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) రిపోర్ట్ ప్రకారం 1.8 లక్షల మందిపై డ్రగ్స్ కేసులు నమోదు అయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిధులతో నిర్వహించిన అధ్యయనంలో మెడికల్ కాలేజీల్లో 12% వరకు విద్యార్థులు మత్తు పదార్థాలకి బానిసలైన్నట్టు తేలింది. పంజాబ్, మహారాష్ట్ర, కేరళ, తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో కొన్ని హాస్పిటళ్లలో పని చేస్తున్న వైద్యులు డ్రగ్స్‌కి బానిసలై ఉండటం వెలుగులోకి వచ్చింది. 2023లో 14% మంది మత్తుకు అలవాటు పడగా 38% మానసిక ఒత్తిడిలో ఉన్నారు.
తీవ్రమైన పని ఒత్తిడి వైద్యులను కుంగదీస్తోంది. 12–16 గంటల పని, సర్జరీల సమయంలో మానసిక ఒత్తిడి, వైద్య తప్పిద భయం. సహచరుల నుంచి పోటీ. మెడికల్ విద్య, ఇంటర్న్‌షిప్, నైట్ డ్యూటీలు వైద్యులపై ప్రభావం చూపుతున్నాయి. మరోవైపు నిరంతర పరీక్షలు వైద్య విద్యార్థులపై తీవ్ర మానసిక ఒత్తిడిని కలిగిస్తున్నాయి. కాగా, వైద్యులు సొంతంగా రాసుకునే ప్రిస్క్రిప్షన్ ద్వారా నిషేధిత మందులను సులభంగా పొందగలుగుతున్నారు.
మానసిక ఆరోగ్య సమస్యలు కూడా వారిని వెంటాడుతున్నాయి. డిప్రెషన్, యాంగ్జయిటీ, బర్నౌట్ సిండ్రోమ్.. కొన్ని సందర్భాల్లో పీటీఎస్డీ కూడా సమస్యగా మారుతుంది. చాలామంది మానసిక చికిత్స తీసుకోవడాన్ని పరువు నష్టం అనుకుంటున్నారు. స్నేహితుల బలవంతం లేదా గ్రూప్ కల్చర్ వల్ల తొలిసారి డ్రగ్స్ ట్రై చేయడం, ఆ తర్వాత రెగ్యులర్ గా అలవాటు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. డాక్టర్ల వైవాహిక జీవితం చాలాసార్లు వృత్తిపరమైన ఒత్తిడికి విఫలమవుతోంది. విడాకులు, కుటుంబ సమస్యలు మత్తులోకి నెట్టుతున్నాయి.
నియంత్రణ లోపాలు
ఫార్మసీ యాక్సెస్‌పై నిఘా లేకపోవడం, డాక్టర్లు సొంతంగా రాసుకున్న రసీదుతో నిషేధిత మందులు పొందుతున్నారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ – 1985, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఇప్పుడు నేషనల్ మెడికల్ కమిషన్, ఎటువంటి వైద్యుడైనా డ్రగ్ అడిక్షన్ నిరూపితమైతే వారి లైసెన్స్ సస్పెండ్ చేసే అధికారం కలిగి ఉంది. కానీ ఈ చట్టాల అమలు చాలా స్లోగా ఉంది. పేషెంట్లకు నష్టమయ్యే ప్రమాదం, మత్తులో ఉన్న వైద్యుడు శస్త్రచికిత్సలు, చికిత్సలు చేయడం వల్ల పేషెంట్ ప్రాణానికి ప్రమాదం.
వ్యవస్థ విచ్ఛిన్నత , డ్రగ్ మాఫియాలతో సంబంధాల ద్వారా హాస్పిటళ్లలో అక్రమాలు పెరగొచ్చు. మెడికల్ కౌన్సిల్ ఉదాసీనత. అలాంటి కేసులు తెలిసినా డిసిప్లినరీ చర్యలు తీసుకోవడంలో ఆలస్యం జరుగుతోంది. రిహాబిలిటేషన్ సెంటర్ల కొరత ఉంది. డాక్టర్లకు ప్రత్యేకంగా ఉండాల్సిన మానసిక చికిత్స కేంద్రాలు లేవు.
వ్యక్తిగత సమస్య కాదు
ఒక వైద్యుడిగా మానవ జీవితం విలువ తెలిసినవారు మత్తుకు బానిసగా కాకుండా సమాజానికి మార్గదర్శిగా నిలవాలి. ఇదే వైద్య వృత్తికి అసలైన గౌరవం. డ్రగ్స్‌తో తన జీవితాన్ని పాడుచేసుకోవడమే కాదు, నమ్మిన ప్రజల జీవితాన్ని కూడా నాశనం చేయడమే అవుతుంది. వ్యసనపరుడిగా కాక వైద్యుడిగా నిలబడాలి. వైద్యుల మత్తు వ్యసనం మన దేశ ఆరోగ్య వ్యవస్థను లోపలినుంచి డొల్ల చేస్తోంది. ఇది వ్యక్తిగత సమస్య కాదు.
ఇది ఆరోగ్య భద్రత, ప్రజల విశ్వాసం, వైద్య సేవల మౌలికతను ప్రశ్నించే సమస్య. ఇటువంటి పరిస్థితుల్లో రెండు పరిష్కారాలు అవసరం. కఠినమైన చట్టపరమైన చర్యలు, అలాగే మానవీయ సహాయం. మత్తు వైద్యులకు మేలైన మార్గం చూపించి, దేశాన్ని మరింత ఆరోగ్యంగా మార్చేందుకు అందరం కృషి చేయాలి. ఒకే వ్యక్తి తప్పును మొత్తం వృత్తిపై ముద్ర వేయకుండా సమస్యను పరిష్కరించే దిశగా చర్చలు జరగాలి.
పరిష్కార మార్గాలు
వైద్యులు మన ఆరోగ్య కాపలాదారులు. వారు బలహీనపడితే సమాజం బలహీనమవుతుంది. మత్తుపదార్థాల బానిసత్వం నుంచి వారిని బయటపడేయడం ప్రభుత్వంతోపాటు అందరి బాధ్యత. ప్రభుత్వం, మెడికల్ సంస్థలు, సమాజం కలిసికట్టుగా పని చేసి ఈ వైద్యరంగాన్ని సంరక్షించాలి. మెడికల్ కాలేజీల్లో వైద్యులకు కౌన్సెలింగ్, మానసిక సహాయం అందించే ప్రత్యేక చొరవ చూపాలి. AI ఆధారిత మందుల వినియోగ నిఘా వ్యవస్థలు బలపడాలి.
రహస్య డ్రగ్ టెస్టింగ్ కార్యక్రమాలు తరచూ నిర్వహించాలి. ఒత్తిడి నిర్వహణ శిక్షణ తప్పనిసరి చేయాలి. ప్రతి వైద్యునికి సంవత్సరానికి ఒకసారి మానసిక పరీక్షలు, "Doctors for Doctors" హెల్ప్‌లైన్ ఉండాలి. వైద్యులు రాసే ప్రిస్క్రిప్షన్లను ట్రాక్ చేయడం, ఫార్మసీలలో లాగ్‌బుక్ నిర్వహణ తప్పనిసరి. పరీక్షలు, శిక్షణల్లో హ్యూమన్ ఎలిమెంట్ పెంచాలి. విద్యార్థులు ‘సేవా’ భావనలో నిలవాలి. డిజిటల్ హెల్త్ మానిటరింగ్ ద్వారా మానసిక సమస్యల గుర్తింపు ముందుగానే జరగాలి. మత్తులో ఉన్న వైద్యుల వ్యవహారాలను మీడియా సామాజిక బాధ్యతతో చూపాలి. ఎందుకంటే వైద్యుల ఆరోగ్యమే దేశ ఆరోగ్యానికి పునాది.
- డాక్టర్. బి. కేశవులు
సీనియర్ మానసిక వైద్య నిపుణుడు