పదవి నుంచి ఎస్‌ఈసీఐ చైర్మన్‌ తొలగింపు

పదవి నుంచి ఎస్‌ఈసీఐ చైర్మన్‌ తొలగింపు

న్యూఢిల్లీ: ప్రభుత్వం సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఈసీఐ)చైర్మన్ ఆర్.పీ. గుప్తాను బాధ్యతల నుంచి ఈ నెల 10 న ప్రభుత్వం తొలగించింది.  క్యాబినెట్ అపాయింట్‌మెంట్స్ కమిటీ జారీ చేసిన ఆర్డర్‌లో ఎలాంటి కారణం చెప్పలేదు.  కానీ గత ఎనిమిది నెలలుగా ఎస్‌ఈసీఐ పలు వివాదాల్లో చిక్కుకోవడం, కొన్ని అక్రమాల సూచనలు కనిపించడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

అదానీ గ్రూప్ ఆంధ్రప్రదేశ్‌లో సోలార్ ఎనర్జీ ప్రాజెక్టుల కోసం పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ (పీపీఏ) పొందడానికి సుమారు 250 మిలియన్ డాలర్ల లంచం ఇచ్చినట్లు యూఎస్‌ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ గత ఏడాది నవంబర్‌లో ఆరోపించింది. ఈ ఆరోపణలో  ఎస్‌ఈసీఐ పేరు కూడా వచ్చింది.మరో సమస్య గత ఏడాది అక్టోబర్‌లో బయటపడింది. అనిల్ అంబానీ యాజమాన్యంలోని రిలయన్స్ పవర్, ఎస్‌ఈసీఐ ఫ్లోట్ చేసిన టెండర్ కోసం చెల్లని బ్యాంక్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసింది.  అయినప్పటికీ ఈ కేంద్ర సంస్థ దాన్ని బిడ్డింగ్‌లో పార్టిసిపేట్ చేయడానికి అనుమతించింది.