దేశవ్యాప్త కులగణనకు ఆద్యుడు రాహుల్ గాంధీ..

దేశవ్యాప్త కులగణనకు ఆద్యుడు రాహుల్ గాంధీ..

దేశవ్యాప్త కులగణనకు ఆద్యుడు కాంగ్రెస్ లోక్​సభ పక్ష నాయకుడు రాహుల్ గాంధీ.  ఒకప్పుడు కులగణన చేయటం కుదరనే కుదరదు అని స్పష్టం చేసింది బీజేపీ ప్రభుత్వం.  దాంతో రాహుల్ గాంధీ అనునిత్యం పార్లమెంట్ లోపల,  బయట భారత్ జోడో యాత్రలో  సైతం కులగణన చేయాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ ఒత్తిడికి తలొగ్గి ఎట్టకేలకు 2025 ఏప్రిల్ 30న జనగణనతోపాటు కులగణన చేస్తామని మోదీ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇది నిజంగా శుభపరిణామం. కులగణన చేస్తామని 2024 లోక్​సభ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. 

జిత్ని ఆబాది ఉత్నా హక్(మా జనాభా ఎంతో మాకు అంత వాటా ) అని రాహుల్ గాంధీ.. మోదీ ప్రభుత్వానికి  పక్కలో బల్లెంలా మారి కులగణనవాదాన్ని బలపరిచారు.  నరేంద్ర మోదీ మాత్రం కులగణన చేస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టటాన్ని అర్బన్ నక్సలిజంతో పోల్చి బాహాటంగా విమర్శించారు. కులగణన హిందువుల మధ్య విభజన తెస్తుందని, రాహుల్ గాంధీ  నీ కులమేంది?  నీ మతమేంది?  చెప్పు అని బీజేపీ నాయకులు రాహుల్ గాంధీని అవమానపరిచారు.  కానీ, ఎంత అవమానపరిచినా కులగణనవాదాన్ని వీడకుండా రాహుల్ గాంధీ బలంగా వాదించారు.  

రాహుల్ గాంధీ దూరదృష్టిని అంచనా వేసి,  దేశంలో రాహుల్ గాంధీకి పెరుగుతున్న ఆదరణను చూసి కులగణనకు వ్యతిరేకంగా వెళితే బీజేపీకి త్వరలో జరిగే  బిహార్, గుజరాత్ ఇతర ఎన్నికల్లో   ఓటమి తప్పదని  గ్రహించి కులగణన చేస్తామని మోదీ ప్రభుత్వం ప్రకటించింది.   కులగణన చేపట్టాలనే నిర్ణయం బీజేపీ ఊహించనివిధంగా రాహుల్ గాంధీ ఖాతాలో చేరింది.   ఇది రాహుల్ గాంధీ విజయం అని దేశమంతా కీర్తిస్తోంది.  అదేవిధంగా శాస్త్రీయబద్ధంగా కులగణన చేసి యావత్  దేశానికి ఆదర్శవంతంగా నిలిచిన ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డికి ఖ్యాతి రావటం బీజేపీ నాయకత్వం జీర్ణించుకోలేకపోతుంది. 

తెలంగాణలో సమర్థవంతంగా కులగణన

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని మోదీకి 2024 పార్లమెంటు ఎన్నికల ముందు 2011 కులగణన లెక్కలు బయటపెట్టాలని లేఖ రాసినా మోదీ ప్రభుత్వం స్పందించలేదు. రేవంత్ రెడ్డి సర్కార్ చేసిన కులగణనను బీజేపీ నాయకత్వం ఉద్దేశపూర్వకంగా  తప్పుపడుతున్నది. రెండు దశల్లో చేపట్టిన సర్వేలో 97.10 శాతం జనాన్ని సమీకరించి  57 ప్రశ్నలతో  సమర్థవంతంగా సమాచారం సేకరించింది కాంగ్రెస్​ ప్రభుత్వం.  

95 వేల మంది ప్రభుత్వ సిబ్బంది 3కోట్ల 55లక్షలకు పైగా జనాభా ను కలిసి సేకరించి చేసిన శ్రమని రాష్ట్ర  బీజేపీ నాయకత్వం అవమానపర్చటం గర్హనీయం. తెలంగాణ కులగణనలో  బీసీలు 46.25 శాతం అని  లెక్కలు తేల్చారు. తరువాత బీసీ జాబితాలో  చేర్చిన ముస్లింల జనాభా10.8 శాతంగా లెక్కించారు.  ముస్లిం బీసీలను కలిపితే తెలంగాణలో మొత్తం బీసీల శాతం 56.33గా పేర్కొన్నారు. ఎస్సీలు17.43శాతమని ఎస్టీలు10.45శాతం మని ప్రకటించారు.

మొత్తం ఓసిల జనాభా 13.31శాతంగా  తేల్చారు.  ఓసీ ముస్లింలు 2.48 శాతం.  ఓసీలు,  ఓసీ ముస్లింలతో కలిపి తెలంగాణలో మొత్తం ఓసీల జనాభా15.79 శాతంగా స్పష్టం చేయడం జరిగింది. రేవంత్ సర్కార్ చేసిన కులగణనలో శాస్త్రీయత స్పష్టంగా ఉన్నది. 

ఓబీసీలకు 27శాతం రిజర్వేషన్లు

గుజరాత్, కేరళ, కర్నాటక, ఆంధ్ర వంటి మొత్తం ఏడు రాష్ట్రాల్లో బీసీ కమిషన్లు చెప్పినవిధంగా ముస్లింలలో ఉన్న దోబి, మంగలి, కటిక, ఇతర పారిశుద్ధ్య కులాలను బీసీ జాబితాలో చేర్చినట్లు తెలంగాణలో కూడా 10.8 శాతంగా వారి జనాభాను లెక్కించారు. గుజరాత్​లో ముస్లింలను ఓబీసీ జాబితాలో చేర్చిన బీజేపీ తెలంగాణలో అదేవిధంగా ముస్లింలను బీసీల జాబితాలో కాంగ్రెస్ ప్రభుత్వం చేర్చితే  తప్పుపట్టడం శోచనీయం.  దేశంలో ఓబీసీలకు27 శాతం రిజర్వేషన్లు కల్పించటానికి1989–-1990లో మాజీ ప్రధాని వీపీ సింగ్ ప్రయత్నించారు.  

బీజేపీ మండల్ కమండల్ పేరుతో యాత్రలు చేసి వీపీ సింగ్ ప్రభుత్వానికి  మద్దతును ఉపసంహరించుకుంది. బీసీలకి 27 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని  చూసిన వీపీ సింగ్ ప్రభుత్వాన్ని పడగొట్టిన  సంస్కృతి  వారిది. ఆ తరవాత ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం పీవీ నరసింహారావు ప్రధానిగా దేశవ్యాప్తంగా ఓబీసీలకి 27శాతం రిజర్వేషన్లు అమలు చేసింది. 

2006వ సంవత్సరంలో ఐఐటి, ఐఐఎం, ఎన్.ఐ.టి వంటి ఇతర కేంద్ర అత్యున్నతమైన విద్యాసంస్థల్లో,  కేంద్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఓబీసీలకి 27 శాతం రిజర్వేషన్లు అమలు చేసింది.  యూపీఏ చైర్​పర్సన్ సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్న సంగతి బీజేపీ మర్చిపోవడం పట్ల ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. 

కర్నాటక, బిహార్​లో కులగణన

కులగణన మొదట కర్ణాటకలో 2015లో కాంగ్రెస్ సీఎం సిద్దరామయ్య ఆధ్వర్యంలో జరిగినా పరిపూర్ణం కాలేదు.  అందుకే  మే2 న ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్  వర్కింగ్ కమిటీ సమావేశంలో తెలంగాణ కులగణన దేశానికి ఆదర్శం అని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానించింది.  బిహార్​లో కులగణన అప్పటి ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలైన జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం సీఎం నితీష్ కుమార్,  ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ సమక్షంలో 2022లో  ప్రారంభమై 2023లో నివేదిక వచ్చింది. 

దీన్ని కూడా బీజేపీ తమ ఖాతాలో వేసుకోవడం విచిత్రం. ఈ దేశంలో తొలి బీసీ కమిషన్ వేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే.  బీసీలకి ముమ్మాటికి న్యాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వాలే.  లంబాడీలను 1975లో ఎస్టీ జాబితాలో చేర్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే.  సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఎస్సీ వర్గీకరణను అమలుచేసిన తొలి ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం. 

42శాతం విద్య ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల్లో  బీసీలకు రిజర్వేషన్ల అమలు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది కాంగ్రెస్  సర్కార్.  నిజంగా బీజేపీకి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే రాహుల్ గాంధీ చెప్పినట్లు 50శాతం  రిజర్వేషన్లు పరిమితిని ఎత్తివేసి శాస్త్రీయంగా జనగణనతోపాటు కులగణన చేసి ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్లు అమలుచేయాలి.

- కోటూరి మానవతారాయ్,
టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి