దృశ్యం-3 క్లైమాక్స్​ రెడీ!

దృశ్యం-3 క్లైమాక్స్​ రెడీ!

ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యే లేదా మంత్రి కావాలనుకుంటాడు. ఇవేవీ కావంటే... పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయినా అయితే బాగుండు అనుకుంటాడు. కానీ, జీతు జోసెఫ్​ అలాకాదు. తండ్రి ఎమ్మెల్యే అయినా... తను మాత్రం సినిమా రంగంవైపే అడుగులు వేశాడు. సక్సెస్​ఫుల్  డైరెక్టర్​గా ఎదిగాడు. ఆయన​ తీసిన దృశ్యం మూవీ భారతీయ భాషల్లోనే కాదు, చైనీస్​లో రీమేక్ చేసేందుకు కూడా ప్రేరణ ఇచ్చింది. థ్రిల్లర్ సినిమాలకు కేరాఫ్​గా మారి, ‘క్రిమినల్ మైండ్’ అనే ట్రోల్స్​ను ఫేస్ చేసిన సక్సెస్​ఫుల్​ మలయాళీ డైరెక్టర్ జీతు జోసెఫ్ మాటల్లోనే తన సినిమా ప్రయాణం గురించి... 

‘మోహన్​లాల్​తో​ నేను చేసిన మరో మిస్టరీ థ్రిల్లర్ ‘ట్వల్త్ మ్యాన్’ ఈ ఏడాది మే 20న డిస్నీ హాట్​స్టార్​లో రిలీజ్ అయింది. పన్నెండు మందితో సాగే ఈ సస్పెన్స్ డ్రామాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. నిజానికి ఈ కథ నేను రాయలేదు. నేను బాలీవుడ్​లో తీసిన ‘ది బాడీ’ మూవీ ప్రొడ్యూసర్ సునిర్ ఖేటార్పల్ 2019లో ‘ట్వల్త్ మ్యాన్’ స్టోరీ ఐడియా ఇచ్చాడు. ఈ ఐడియాను రైటర్ కె.ఆర్. కృష్ణకుమార్​కి చెప్పి డెవలప్ చేయమన్నాం. అప్పుడు మలయాళం ‘దృశ్యం-–2’ షూటింగ్ చేస్తున్నాం. ఆ షూటింగ్ మధ్యలోనే ఈ కథను మోహన్​లాల్​కు చెప్పా. ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ, దాని స్క్రీన్ ప్లే రాయడానికి కుమార్​కు ఒకటిన్నర సంవత్సరం పట్టింది. అంటే 2021 జులైలో తెలుగు ‘దృశ్యం-–2’ షూటింగ్​ చేస్తున్న టైంకి స్క్రిప్ట్ నా చేతికి వచ్చింది. అయితే, ఆసిఫ్ అలీతో చేస్తున్న ‘కూమన్- ది నైట్ రైడర్’ సినిమా పూర్తి చేశాక 2022లో ఈ సినిమా చేయాలనుకున్నా. ‘కూమన్’ మూవీని చాలా లొకేషన్స్​లో షూట్ చేయాలి. కానీ, కొవిడ్ సెకండ్ వేవ్ వల్ల ‘కూమన్’ షూటింగ్​ వాయిదా పడింది. ఈ మధ్యలో ‘ట్వల్త్ మ్యాన్’ పట్టాలెక్కింది. మోహన్​లాల్​ తో చేస్తున్న ‘రామ్’ మూవీతో పాటు, ‘కూమన్’... ఈ రెండు ప్రాజెక్టులు నేను పూర్తి చేయాలి.

మోహన్​లాల్​తో వరుసగా సక్సెస్​ఫుల్ మూవీస్ చేస్తుండటంతో అందరూ నన్ను మోహన్​లాల్​కు ‘లక్కీ చామ్’ అంటున్నారు. కానీ, మోహన్​లాల్​​తో నేను సినిమా తీయడానికి ముందే ఆయన లెజెండరీ యాక్టర్. కాబట్టి, ఆయనే నాకు లక్కీ చామ్. కథ చెప్తే, అందులో లీనమైపోయి, ఆ పాత్రకు ప్రాణం పోస్తారు.

థ్రిల్లర్స్ మీద ఇంట్రెస్ట్

చిన్నప్పుడు ‘అగాథ క్రిస్టీ’ రాసిన కథలు, డిటెక్టివ్ నవలలు బాగా చదివేవాడిని. షెర్లాక్ హోమ్స్ లాంటి డిటెక్టివ్, మిస్టరీ నవలల ప్రభావం నా మీద బాగా ఉంది. వాటిని కొనుక్కొని మరీ చాలా ఆసక్తిగా చదివేవాడిని. అలా నాకు థ్రిల్లర్స్ మీద ఇష్టం పెరిగింది. 2007లో రిలీజైన నా మొదటి సినిమా కూడా ఇన్వెస్టిగేటివ్ మూవీ. పేరు ‘డిటెక్టివ్’. రెండో సినిమా ‘మమ్మీ అండ్ మి’ ఫ్యామిలీ మూవీ. ఆ తర్వాత వచ్చిన ‘మై బాస్’ కామెడీ. కానీ, వరుసగా ‘మెమరీస్’, ‘దృశ్యం’ వంటి థ్రిల్లర్ మూవీస్ తీశాక థ్రిల్లర్ డైరెక్టర్ అనే ట్యాగ్ వేశారు. కానీ, నాకు వేరే జానర్స్ కూడా ఇష్టమే.

థ్రిల్లర్స్​నే​ అడుగుతున్నారు  

నేను కామెడీ మూవీస్ చేస్తానని ప్రొడ్యూసర్స్​కు చెప్తున్నా, కానీ, థ్రిల్లర్సే కావాలని అడుగుతున్నారు. నిజం చెప్పాలంటే, ఆ ట్యాగ్ నాకు సంతోషాన్ని ఇవ్వడం లేదు. నేను ఒక స్టోరీ టెల్లర్​ను. నాకు రకరకాల కథలు చెప్పాలని ఉంటుంది. కానీ, ఇంకా రెండు థ్రిల్లర్​ మూవీస్ తీయాల్సి ఉంది. ఆ తర్వాత ఒక ఫ్యామిలీ, ఇంకొకటి పిల్లల మూవీ తీయాలి అనుకుంటున్నా. మలయాళీ డైరెక్టర్ పద్మరాజన్ నాకు స్పూర్తి. అన్ని జానర్స్​లో సినిమాలు తీశారాయన. అవి చాలా నేచురల్​గా ఉంటాయి. ఆయన్ను గురువుగా భావిస్తా. ఆయనలా అన్ని రకాల సినిమాలు తీయాలనేది నా డ్రీమ్.

చదివింది వేరు

నా వైఫ్ పేరు లింటా. ఆమె కాస్ట్యూమ్ డిజైనర్. నాకు ఇద్దరు కూతుళ్లు. ఖాళీగా ఉంటే ఎక్కువ నా ఫ్యామిలీతోనే గడుపుతుంటా. లేదంటే పుస్తకాలు చదువుతా. కేరళలోని మువట్టుపుజ తాలూకాలో ఉన్న ముథోలపురంలో ఒక సిరో-మలబార్ కేథలిక్ ఫ్యామిలీలో పుట్టా. అక్కడే ఫాతిమా మాతా ఇంగ్లీష్ మీడియం స్కూల్​లో చదువుకున్నా. అమ్మ పేరు లీలమ్మ. నాన్న వీవీ జోసెఫ్, 1980లో  ‘మువట్టుపుజ’ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పని చేశారు. చిన్నప్పటి నుంచే సినిమాల్లోకి వెళ్లాలని కలలు కంటుండేవాడిని. ప్లాన్ ప్రకారం ప్లస్ టూ తర్వాత ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎఫ్​టీటీఐ)లో చేరితే, ఈజీగా ఇండస్ట్రీలో అడుగుపెట్టొచ్చు అనుకున్నా. అనుకున్నట్టే ఎఫ్​టీటీఐలో చేరతానని పట్టుబట్టా. కానీ, మా నాన్నకు సినిమాలు అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఆయన నన్ను ఇంజినీర్​గా చూడాలి అనుకున్నారు. కానీ, అది కూడా కుదరలేదు. దాంతో మువట్టుపుజలో ఉన్న నిర్మల కాలేజీలో చేర్పించారు. అక్కడే ఎకనామిక్స్​లో డిగ్రీ పూర్తి చేశా. 

ఫస్ట్ ఛాన్స్

డిగ్రీలో చేరినా సినిమాలపై  ప్రేమ తగ్గలేదు. ఇలాగైతే లాభంలేదని, కొన్ని రోజులు ఇండస్ట్రీలో తిరిగి, చివరికి డైరెక్టర్ జయరాజ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్​గా చేరిపోయా. తర్వాత కొన్నాళ్లకు దిలీప్​తో సినిమా చేసే అవకాశం వచ్చింది. కానీ, ఆ సినిమా పట్టాలు ఎక్కలేదు. దాంతో ఎక్కడ మొదలుపెట్టానో మళ్లీ అక్కడికే చేరుకున్నా. తర్వాత ‘డిటెక్టివ్’ కథ రాసుకున్నా. ఆ కథ తీసుకొని ఇండస్ట్రీలో చాలామంది ప్రొడ్యూసర్స్ దగ్గరకు వెళ్లా. కానీ, ఎవ్వరూ అవకాశం ఇవ్వలేదు. చివరికి నా కష్టాలు చూడలేక మా అమ్మే ప్రొడ్యూస్ చేస్తా అని చెప్పింది. అలా సురేశ్ గోపీ లీడ్ రోల్​లో సినిమా మొదలుపెట్టాం. నెల రోజుల తర్వాత ప్రొడ్యూసర్ మహి ఈ ప్రాజెక్టులోకి వచ్చి, ఈ సినిమాను నిర్మించారు. 2007లో విడుదలైన ‘డిటెక్టివ్’ మంచి విజయం సాధించింది.

దృశ్యం ఎప్పుడో  పుట్టింది

దృశ్యం కథ గురించిన ఆలోచన 2000 సంవత్సరంలో వచ్చింది. అప్పటికి నేను ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టలేదు. దృశ్యం సిరీస్​లో మొత్తం మూడు కథలు రాసుకున్నా. ఇదొక సైకలాజికల్ డ్రామా. కాబట్టి, వీటికోసం పుస్తకాలు చదివా చాలామంది సైకాలజిస్టులతో మాట్లాడా. ఈ కథ కోసం కొన్నేండ్ల టైం కేటాయించా. మనసులోనే కొన్ని సీన్స్ అనుకోవడం, కొన్నింటిని డిలీట్ చేయడం చేసేవాడిని. ఆ తర్వాతే వాటిని పేపర్ మీద పెట్టేవాడిని. నేను ఒక లేజీ రైటర్​ని. నా మనసులో విజువలైజ్ చేసుకునేంత వరకు దాన్ని రాయను. పేర్లు, అంకెలు గుర్తుంచుకోలేను. కానీ, కథలు మాత్రం బాగా గుర్తుపెట్టుకుంటా. బ్యాడ్మింటన్ ఆడుతున్నప్పుడు, ఎక్కడికైనా ట్రావెల్ చేసినప్పుడు నాకు ఐడియాలు వస్తుంటాయి. కొన్నిసార్లు మనసులో డైలాగ్స్ గొణుక్కుంటుంటే నా కూతురు చూసి నవ్వుతుంటుంది.
మమ్ముట్టికి చెప్పాను కానీ..
దృశ్యం కథను ముందుగా మమ్ముట్టికి చెప్పా. ఆ టైంలో ఆయన చాలా బిజీగా ఉన్నారు. ఆయన ఫ్రీ కావాలంటే దాదాపు రెండేళ్లు ఎదురు చూడాల్సిన పరిస్థితి. దాంతో ఆయనే ఆ కథతో మోహన్​లాల్​ను కలవమన్నారు. ఒకవేళ ఆయన చేసి ఉంటే, ఆ రోల్ లో మమ్ముట్టిని తప్ప ఇంకెవరినీ ఊహించుకోలేం అనేవాళ్లేమో. మలయాళంలో మోహన్​లాల్, తమిళంలో కమల్ హాసన్, తెలుగులో వెంకటేష్ అద్భుతంగా నటించారు. అందరూ తమదైన స్టైల్​లో క్యారెక్టర్​ను ఓన్ చేసుకుని, ప్రాణం పోశారు.  దృశ్యం విడుదలకు ముందు ఈ సినిమాలో ఎలాంటి ట్విస్టులూ ఉండవని ప్రేక్షకులకు అబద్ధం చెప్పా. ఎక్స్​పెక్టేషన్స్​తో ఉండే బరువు నుంచి సినిమాను కాపాడటానికే అలా చేశా. ఫైనల్లీ 50 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన మొదటి మలయాళీ మూవీగా దృశ్యం రికార్డు సృష్టించింది.

ఫస్ట్ తెలుగు మూవీ

దృశ్యం మలయాళం సీక్వైల్ షూటింగ్ పూర్తి చేశాక, సురేష్​​బాబు నాకు ఫోన్ చేసి, మూవీ స్క్రిప్ట్ గురించి అడిగారు. నేను ఆయనకు ఇంగ్లీష్ ట్రాన్స్​లేషన్ పంపించా. స్క్రిప్ట్ నచ్చింది, మూవీ చూడాలన్నారు. డబ్బింగ్ పూర్తయింది. మ్యూజిక్, బ్యాక్​గ్రౌండ్ మ్యూజిక్ లేకుండానే ప్రివ్యూ చూపించా. ఆయనకు మూవీ బాగా నచ్చింది. వెంటనే తెలుగు రీమేక్ పనులు మొదలుపెట్టాం. దృశ్యం-–2 తో తెలుగులో మొదటిసారి సినిమాను డైరెక్ట్ చేశా. మోహన్​లాల్, వెంకటేష్​... ఇద్దరి ప్రజెంటేషన్ స్టైల్ డిఫరెంట్​గా ఉంటుంది, కానీ, అద్భుతంగా చేశారు. దృశ్యం-–3కి క్లైమాక్స్ రెడీ చేశా. కానీ, అది చేస్తానో? లేదో? చూడాలి.  

చాలామంది అడిగారు  

‘చివర్లో జార్జ్ కుట్టీ సీన్​లో సీసీ కెమెరాలు ఉండాలి కదా?’ అని చాలామంది నన్ను అడిగారు. అయితే ‘మీరే ఫోరెన్సిక్ ఆఫీస్​కు వెళ్లి చూసి రండి. తెలుస్తుంది’ అని వాళ్లకు చెప్పా. నేను షూటింగ్​కు ముందే ఫోరెన్సిక్ ఆఫీస్​కు వెళ్లొచ్చా. అక్కడ కెమెరాలు లేవు. వాళ్లు చూసొచ్చాక గానీ, దాన్ని నమ్మలేదు. ఆ తర్వాతే అక్కడ కెమెరాలు పెట్టాలని వాళ్లను అడగటం మొదలుపెట్టారు! చాలామంది ‘సినిమాకు లాజిక్ అవసరం లేదు. ప్రేక్షకులు పట్టించుకోరు’ అంటారు. కానీ, అది కరెక్ట్ కాదు. అలాంటి ప్రాబ్లమ్స్ నా మూవీస్​లో వర్కవుట్ కావు. అందుకు నేను చాలా హోం వర్క్ చేస్తా. ఫోరెన్సిక్, పోలీస్ డిపార్ట్​మెంట్స్​లో నాకు ఉన్న కనెక్షన్స్​ను దీనికోసం వాడుకుంటా. ఫార్వర్డ్ ఫ్యామిలీ అయితే, అది కూడా ప్రాబ్లమ్ అవుతుందని, కేరళలో ఉన్న ఒక మారుమూల గ్రామంలో ఉండే ఫ్యామిలీ కథగా దృశ్యం మూవీని తీశా’ అని తన కలను ఎలా నిజం చేసుకున్నాడో వివరించాడు జీతు జోసెఫ్​.

ట్రోల్స్ పట్టించుకోను

2012లో వచ్చిన 'ఎల్ క్యూర్పో' అనే స్పానిష్ మూవీని హిందీలో ‘ది బాడీ’ పేరుతో రీమేక్ చేశా. 2019లో రిషీ కపూర్, ఇమ్రాన్ హష్మీ కలిసి చేసిన ఈ సినిమా బాలీవుడ్​లో హిట్ అయింది. ‘మిస్టర్ అండ్ మిస్ రౌడీ’, తమిళంలో కార్తితో తీసిన ‘తంబీ’ మూవీస్ నాకు మంచి పేరు తీసుకొచ్చాయి. వరుసగా థ్రిల్లర్ మూవీస్ చేశాక ‘‘సినిమాల్లోకి రాకపోయి ఉంటే, క్రిమినల్ అయ్యేవాడివి. క్రిమినల్ మైండ్’’ అని సోషల్ మీడియాలో ట్రోల్స్ బాగా వచ్చాయి. ఒకవేళ సినిమాల్లోకి రాకపోయి ఉంటే క్రిమినల్​నే అయి ఉండేవాడినేమో! ఈ మాట సరదాగా అంటున్నా. నిజానికి నేను సోషల్ మీడియా ట్రోల్స్ పట్టించుకోను. ఎందుకంటే, వాటికంటే నాకు నా పనే ముఖ్యం.

:::గుణ