
- పుల్వామాలో ఘటన.. జైషే మహమ్మద్ ఉగ్రవాదులుగా గుర్తింపు
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ లో మరో ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారు. గురువారం ఉదయం పుల్వామా జిల్లా అవంతిపొరా ప్రాంతంలోని నాదిర్ గ్రామంలో టెర్రరిస్టులున్నట్టు సమాచారం అందడంతో భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారని పేర్కొన్నారు. హతులను జైషే మహమ్మద్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కు చెందిన ఆసిఫ్ అహ్మద్ షేక్, అమీర్ నజీర్ వనీ, యావర్ అహ్మద్ భట్‌గా గుర్తించారు.
చనిపోవడానికి ముందు అమీర్ వీడియో కాల్
అమీర్ నజీర్ వనీ ఎన్ కౌంటర్ లో చనిపోవడానికి కొద్దిసేపటికి ముందే తల్లి, సోదరితో వీడియో కాల్‌లో మాట్లాడాడు. ఆర్మీ ఎదుట లొంగిపోవాలని వారిద్దరూ ఎంత బతిమిలాడినా వినలేదు. అయితే, ‘ఆర్మీని ముందుకు రానివ్వండి.. వారి సంగతి చూస్తా’ అని పొగరుగా సమాధానమిచ్చాడు. వాళ్లు ఎంత వేడుకున్నప్పటికీ లొంగిపోవడానికి ఇష్టపడలేదు.
ఇదే ఘటనలో మృతి చెందిన మరో ఉగ్రవాది ఆసిఫ్ అహ్మద్ షేక్ సోదరితోనూ నజీర్ మాట్లాడాడు. తన సోదరుడి గురించి ఆమె ఆరా తీస్తే తన దగ్గరే ఉన్నాడని బదులిచ్చాడు. అనంతరం కొద్దిసేపటికే ఎన్‌కౌంటర్ జరిగింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో కాల్ ఫుటేజీ వైరల్ గా మారింది.