
న్యూఢిల్లీ : దేశంలోని అతి పెద్ద బిస్కెట్ తయారీదారైన పార్లె ప్రొడక్ట్స్ 10 వేల ఉద్యోగాలకు కోత పెడుతోంది. ఆర్థిక వ్యవస్థ నెమ్మదించడంతో బిస్కెట్ల వినియోగం తగ్గిందని, ఫలితంగా ఉద్యోగాల కోత అనివార్యమవుతోందని కంపెనీ తెలిపింది. కిలోకు రూ. 100 లోపుండే బిస్కెట్లపై గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్‌టీ)ని తగ్గించమని ప్రభుత్వాన్ని కోరామని పార్లే పేర్కొంది. జీఎస్‌టీ తగ్గింపుకు ప్రభుత్వం అంగీకరించకపోతే, పది వేల మంది ఉద్యోగులపై వేటు తప్పకపోవచ్చని పేర్కొంది. అమ్మకాలు తగ్గుతుండటంతో తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్న నేపథ్యంలో ఈ చర్య తీసుకోనున్నట్లు పార్లే ప్రొడక్ట్స్ కేటగిరీ హెడ్ మాయాంక్ షా చెప్పారు. అందరికీ తెలిసిన పార్లే జీ, మోనాకో, మేరీ బ్రాండ్ బిస్కెట్లు తయారు చేసే పార్లే టర్నోవర్ రూ. 10 వేల కోట్లు. పది యూనిట్లున్న ఈ కంపెనీలో లక్ష మంది ఉద్యోగులున్నారు. పార్లే ప్రొడక్ట్స్ కోసం మరో 125 థర్డ్ పార్టీ మాన్యుఫాక్చరింగ్ యూనిట్లు పనిచేస్తున్నాయి. పార్లే తన అమ్మకాలలో సగం కంటే ఎక్కువ గ్రామాల నుంచే సాధిస్తోంది. కిలోకు రూ. 100 కంటే తక్కువ ధర బిస్కెట్ల మీద మునుపటి పన్ను విధానం (ఎక్సైజ్) కింద12 శాతం పన్ను ఉండేది. దాంతో జీఎస్‌టీ కూడా ఇదే విధంగా ప్రీమియం బిస్కెట్లపై 12 శాతమే ఉంటుందని, తక్కువ ధర బిస్కెట్లపై 5 శాతం ఉంటుందని పరిశ్రమ వర్గాలు భావించాయి. కానీ, రెండేళ్ల కిందట జీఎస్‌టీ అమలులోకి తెచ్చినప్పుడు అన్ని రకాల బిస్కెట్లపై 18 శాతం పన్ను విధించారు.
ఫలితంగా అన్ని కంపెనీలు తమ బిస్కెట్ల రేట్లు పెంచాయి. దాంతో వాటి అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. ఈ క్రమంలో పార్లే కూడా తన ప్రొడక్ట్స్ ధరలను 5 శాతం పెంచింది. పర్యవసానంగా అమ్మకాలు తగ్గిపోయాయని మాయాంక్ షా తెలిపారు. కిందటి వారంలో మరో ప్రముఖ బిస్కెట్ తయారీ కంపెనీ బ్రిటానియా మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ బెర్రీ కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. రూ. 5 విలువైన బిస్కెట్ కొనడానికి కూడా వినియోగదారులు ఆలోచిస్తున్నారని ఆయన అన్నారు. అంటే ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన ఇబ్బందులలో ఉన్నట్లేనని వ్యాఖ్యానించారు. మా కంపెనీ 6 శాతమే వృద్ధి సాధించింది. మిగిలిన కంపెనీలు ఇంకా నెమ్మదిగా ఎదుగుతున్నాయని బెర్రీ పేర్కొన్నారు. నుస్లీ వాడియా ప్రమోట్ చేసిన ఈ కంపెనీ నికర లాభం మొదటి క్వార్టర్‌లో 3.5 శాతం తగ్గి రూ. 249 కోట్లకు పరిమితమైంది. వినియోగదారుల కొనుగోళ్లు తగ్గడంతో గత రెండు క్వార్టర్లుగా రిటైలర్లు కూడా తమ వద్ద నుంచి కొనడం తగ్గించినట్లు పార్లే ప్రొడక్ట్స్ షా వెల్లడించారు. బిస్కెట్లపై జీఎస్‌టీ పెంపే దానికి కారణమని, ప్రభుత్వం కూడా ఎలాంటి ఉద్దీపనలూ ప్రకటించలేదని పేర్కొన్నారు. లో ఇన్‌కం గ్రూప్‌ల కోసం టార్గెట్ చేసే బిస్కెట్ బ్రాండ్స్ చాలా తమ వద్ద ఉన్నాయని, మళ్లీ వాటి వినియోగం పెరగడానికి ప్రభుత్వం జీఎస్‌టీ తగ్గిస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు. తక్కువ ధరకే అమ్మే బిస్కట్లపై ఈ కంపెనీల మార్జిన్లూ తక్కువగానే ఉంటున్నాయి.
ఎఫ్‌ఎంసీజీ వృద్ధి కొంతే.. నీల్సన్ రిపోర్ట్
దేశంలో ఎఫ్‌ఎంసీజీ (ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్) ఉత్పత్తుల వృద్ధిపై అంతకు ముందు అంచనాలను 9–10 శాతానికి మార్కెట్ రీసెర్చ్ సంస్థ నీల్సన్ కుదించింది. ఫుడ్, నాన్–ఫుడ్ కేటగిరీలు రెండింటిలోనూ వృద్ధి తగ్గుతున్నట్లు పేర్కొంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలలో వినియోగం బాగా ప్రభావితమైనట్లు తెలిపింది. సాల్టీ శ్నాక్స్, బిస్కెట్లు, మసాలా దినుసులు, సోప్స్, ప్యాకేజ్డ్ టీ వంటి ఉత్పత్తుల వినియోగం అధికంగా ప్రభావితమవుతున్నట్లు కూడా నీల్సన్ వెల్లడించింది. గత నాలుగు క్వార్టర్లలో ఎఫ్‌ఎంసీజీ వృద్ధి తగ్గుముఖం పట్టిందని పరిశ్రమ వర్గాలూ అంగీకరిస్తున్నాయి. జూలై–సెప్టెంబర్ 2018 క్వార్టర్ నుంచీ అమ్మకాలు తగ్గుతూనే ఉన్నాయని చెబుతున్నాయి. విలువ పరంగానే కాకుండా, పరిమాణపరంగానూ సేల్స్ తగ్గినట్లు పేర్కొంటున్నాయి. పట్టణ, గ్రామ ప్రాంతాలలోని ప్రజలు రోజూ కొనే తక్కువ ధరల ఉత్పత్తులను కొనకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని వాపోతున్నాయి.