ప్రజాస్వామ్యానికి భారతదేశం పుట్టినిల్లు : ద్రౌపది ముర్ము

 ప్రజాస్వామ్యానికి భారతదేశం పుట్టినిల్లు  : ద్రౌపది ముర్ము


74 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించిన  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రజాస్వామ్యానికి భారతదేశం పుట్టినిల్లు అని అన్నారు.  రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మన ప్రయాణం అద్భుతంగా ఉందని,  ఇది ఇతర దేశాలకు స్ఫూర్తినిచ్చిందని కొనియాడారు.  రాజ్యాంగాన్ని గౌరవించడం మన కర్తవ్యమని చెప్పిన ముర్ము రాజ్యాంగ రూపకర్త అంబేడ్కర్ కు దేశం రుణపడి ఉందని వెల్లడించారు. అన్నివేళలా  రాజ్యంగమే మనకు మార్గదర్శి అని తెలిపారు. విశ్వశాంతికి భారత్ కట్టుబడి ఉందని చెప్పారు. 

జీ20 సదస్సు నిర్వహణ మన ప్రతిష్ఠను పెంచుతుందని ద్రౌపది ముర్ము అభిప్రాయపడ్డారు. భారత అర్థిక వ్యవస్థ పటిష్ఠంగా ఉందన్న ఆమె భారత్ అత్యధిక వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా నిలిచిందన్నారు. ఆత్మనిర్భర్ భారత్ పథకానికి ప్రజల్లో మంచి స్పందన వచ్చిందని ముర్ము తెలిపారు.  దేశ ప్రగతికి పాటుపడుతున్న ప్రతి ఒక్క పౌరుడికి రాష్ట్రపతి  అభినందనలు తెలిపారు.

74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్వదేశంలో, విదేశాలలో ఉన్న ప్రతి భారతీయుడికి  ద్రౌపది ముర్ము హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.  గురువారం ఇండియా గేట్ వద్ద రాష్ట్రపతి ముర్ము రాష్ట్రపతి హోదాలో తొలిసారిగా జాతీయ జెండాను ఎగుర వేస్తారు.  భారత 74వ గణతంత్ర వేడుకలకు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్-సిసి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.