సూర్యాపేట, వెలుగు: దేశ భవిష్యత్తును నిర్మించాల్సిన యువత, ఆల్కహాల్, మాదకద్రవ్యాల వలలో పడటం ఆందోళనకరమని, వాటి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ ఉద్యమంలా ముందుకు సాగాలని డ్రగ్ డీ-అడిక్షన్ సెంటర్ ఇన్చార్జి మిడతపల్లి గణపతి పిలుపునిచ్చారు. సోమవారం సూర్యాపేట జడ్పీహెచ్ఎస్లో నషా ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా హోలీ క్రాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాదకద్రవ్య నిర్మూలన అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా గణపతి విద్యార్థులకు మాదకద్రవ్యాల ప్రమాదాలపై అవగాహన కల్పించారు. అనంతరం మాదకద్రవ్య రహిత సమాజం కోసం పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో డ్రగ్ డీ-అడిక్షన్ సెంటర్ కో-ఆర్డినేటర్లు నల్లగట్టు ఉపేందర్, కంది కావేరి, హోలీ క్రాస్ ప్రతినిధులు ఎరకలి జ్యోతి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గోలి పద్మ, తదితరులు పాల్గొన్నారు.
