
- లైసెన్స్ రెన్యువల్‌కు రూ.20 వేల నుంచి రూ.లక్ష
- ప్రైవేట్ వ్యక్తులతో దందా
- కరీంనగర్ జిల్లాలో 800 వరకు మెడికల్ షాపులు
కరీంనగర్, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్ల అక్రమ సంపాదనకు అడ్డూఅదుపు లేకుండాపోతోంది. ఒక్క కరీంనగర్ జిల్లాలోనే మెడికల్ షాపులు, మెడికల్ ఏజెన్సీల నుంచి లైసెన్స్ రెన్యువల్ పేరిట ఏటా వీరు రూ.3 కోట్లు వెనకేస్తున్నట్లు తెలిసింది. కరీంనగర్‌లోని విజేత హాస్పిటల్ మెడికల్ షాపు నిర్వాహకుల నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ మంగళవారం డ్రగ్ కంట్రోల్ అసిస్టెంట్ డైరెక్టర్ మరియాల శ్రీనివాస్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ కార్తీక్ భరద్వాజ్‌తోపాటు వారి మధ్యవర్తి రాము ఏసీబీ ఆఫీసర్లకు చిక్కిన విషయం తెలిసిందే. ఈ ఏసీబీ ట్రాప్ వెనక మెడికల్ మాఫియాలో ఆధిపత్య పోరుతోపాటు ఇటీవల నకిలీ మందుల విక్రయం కేసులో జైలుపాలైన ఓ ఏజెన్సీ నిర్వాహకుడి పాత్ర ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
దళారులతో దందా..
జిల్లావ్యాప్తంగా సుమారు 400కుపైగా హాస్పిటళ్లు, 800 మెడికల్ షాపులు ఉన్నాయి. వీటి నిర్వహణపై డ్రగ్ కంట్రోల్ అథారిటీ ఆఫీసర్లు నిత్యం తనిఖీలు నిర్వహించాల్సి ఉంటుంది. నకిలీ, కాలం చెల్లిన మందులు ఏమైనా అమ్ముతున్నారా? లైసెన్స్ తీసుకున్న ఫార్మసిస్టులే షాపులు నడుపుతున్నారా ? ఆప్రాన్ వేసుకున్నారా ? లేదంటే అర్హత లేని వ్యక్తులు మందులు ఇస్తున్నారా? బిల్లులు ఇస్తున్నారా ? లేదా ?, ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఎవరైనా అమ్ముతున్నారా? శాంపిల్స్ మందులేమైనా విక్రయిస్తున్నారా? షాపులో మందులకు తగినంత ఉష్ణోగ్రత ఉండేందుకు ఏసీ, ఫ్రిజ్ వాడుతున్నారా లేదా అనే అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. వీటిల్లో ఏది పాటించకున్నా డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్లు చర్యలు తీసుకునే అవకాశముంది.
ఈ క్రమంలోనే మెడికల్ షాపులు, మెడికల్ ఏజెన్సీల్లో తనిఖీలకు వెళ్లడం, వివిధ లోపాలు గుర్తించి జిల్లాలో సదరు డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్లు పెద్దఎత్తున వసూళ్లకు పాల్పడినట్లు తెలిసింది. అంతేగాక సంవత్సరానికోసారి తనిఖీలు నిర్వహించి, చేసే షాపు రెన్యువల్‌కు షాపు స్థాయిని బట్టి ఏటా రూ.20 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేసినట్లు సమాచారం. ఇందుకోసం చేతికి మట్టి అంటకుండా రాములాంటి మరో నలుగురు దళారులను నియమించుకున్నట్లు తెలిసింది. 99 శాతం మంది మెడికల్ షాపు నిర్వాహకులు వీళ్లతో వైరం ఎందుకుని అడిగినంత ఇచ్చి రెన్యువల్ చేయించుకోవడం
వారికి కలిసివచ్చింది.
డిప్యూటీ డైరెక్టర్ గా విధుల్లో చేరకముందే..
మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన డ్రగ్ కంట్రోల్ అసిస్టెంట్ డైరెక్టర్ మరియాల శ్రీనివాస్ ఉమ్మడి కరీంనగర్ ఏడీగా రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నాడు. ఇటీవల ఆయనకు డిప్యూటీ డైరెక్టర్ గా పదోన్నతి లభించినట్లు తెలిసింది. ఆయన విధుల్లో చేరేలోపే ఏసీబీ ట్రాప్ కావడం గమనార్హం.