గ్రేటర్‌‌‌‌లో విస్తరిస్తున్న డ్రగ్స్‌‌, గంజాయి దందా

గ్రేటర్‌‌‌‌లో విస్తరిస్తున్న డ్రగ్స్‌‌, గంజాయి దందా

కొకైన్.. హెరాయిన్.. హాష్ ఆయిల్

గ్రేటర్‌‌‌‌లో విస్తరిస్తున్న డ్రగ్స్‌‌, గంజాయి దందా

హైదరాబాద్,వెలుగు : సిటీలో డ్రగ్స్‌‌ మాఫియా విస్తరిస్తోంది. అడ్డా కూలీల దగ్గర్నుంచి హై ప్రొఫైల్ వ్యక్తుల వరకు గంజాయి, డ్రగ్స్‌‌కు బానిసలవుతున్నారు. మత్తు మాఫియా ట్రాప్​లో పడి సప్లయర్స్‌‌గా మారుతున్నారు. ఈ నెట్‌‌వర్క్‌‌లో గోవా, బెంగళూర్‌‌‌‌,ముంబయి నుంచి సప్లయ్ అవుతున్న డ్రగ్స్‌‌ను గుర్తించడం పోలీసులకు సవాల్‌‌గా మారింది. ఈ క్రమంలోనే ప్రాణాంతకమైన హెరాయిన్‌‌, కొకైన్‌‌, చరాస్‌‌కు సిటీలో డిమాండ్‌‌ భారీగా పెరిగిపోయింది. మరోవైపు వైజాగ్‌‌, ఒరిస్సాలోని ఏజెన్సీ ఏరియాల నుంచి ప్రతి ఏటా క్వింటాళ్ల కొద్దీ గంజాయి, వందల లీటర్లలో హాష్‌‌ ఆయిల్‌‌ సిటీకి సప్లయ్ అవుతోంది. సిటీ శివారు ప్రాంతాలు సైతం గంజాయి, హాష్ ఆయిల్‌‌ తయారీ కేంద్రాలుగా మారాయి.   హైదరాబాద్ నార్కొటిక్స్ ఎన్ ఫోర్స్ మెంట్​ వింగ్ అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాలను పట్టుకుంటున్నప్పటికీ..  గంజాయి, డ్రగ్స్ దందా ఆగట్లేదు. దీంతో రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయిని అరికట్టేందుకు కొత్తగా ఏర్పాటు కానున్న టీఎస్ఏఎన్ బీ(తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో) ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి.

వాట్సాప్ , ఇన్​స్టా, ఫేస్​బుక్ నుంచి ఆర్డర్లు ..

డ్రగ్స్ ముఠాలపై పోలీసులు ఎంత నిఘా పెట్టినా సప్లయ్​కు మాత్రం అడ్డుకట్ట పడడం లేదు. గోవాలో టూరిస్టులను టార్గెట్ చేసిన డ్రగ్స్‌‌ ముఠాలు యువతను మత్తుకు బానిసలు చేస్తున్నాయి. ఆ తర్వాత మెట్రో సిటీల్లోని తమ నెట్‌‌వర్క్ ద్వారా రిసీవర్లు, సప్లయర్లకు కమీషన్‌‌తో డ్రగ్స్ సప్లయ్ చేస్తున్నాయి. ఈ  క్రమంలోనే సిటీలోని పబ్​లు, రిసార్టుల్లో నిర్వహించే పార్టీలు, వీకెండ్‌‌ పార్టీల్లోనూ డ్రగ్స్ దందా జోరుగా సాగుతోంది. లిక్కర్‌‌‌‌ కిక్కుకు బదులు డ్రగ్స్‌‌ మత్తు పెరిగిపోతోంది. ఇలాంటి 
పార్టీలకు డ్రగ్స్ సప్లయ్‌‌ చేసేందుకు మత్తు మాఫియా కొత్త ఎత్తులు వేస్తోంది. యువత ఎక్కువగా వాడే ఇన్‌‌ స్టాగ్రామ్‌‌,ఫేస్‌‌బుక్‌‌,వాట్సాప్‌‌ సహా సోషల్‌‌ మీడియా అకౌంట్ల నుంచి ఈవెంట్ల పేరుతో ఆర్డర్లు తీసుకుంటోంది. కమీషన్స్‌‌ ఇస్తూ తిరిగి కస్టమర్లనే సప్లయర్లుగా మార్చేస్తోంది. ఇందులో ఎల్ఎస్ఎడీ, చరాస్,హెరాయిన్, కొకైన్‌‌ లాంటి డ్రగ్స్‌‌ సప్లయ్ పెరిగిపోయింది.

కొకైన్‌‌ కేరాఫ్‌‌ నైజీరియన్స్

కొకైన్‌‌,హెరాయిన్‌‌కు నైజీరియన్లు కేరాఫ్ అడ్రస్‌‌గా మారారు. ఈ డ్రగ్స్ సప్లయ్ చేస్తూ గతేడాది 20 మందికిపైగా అరెస్టయ్యారు. వీరిలో రిపీటెడ్‌‌గా పట్టుబడ్డ వారిని వాళ్ల దేశాలకు తిరిగి పంపించారు. ఇందులో వీసా గడువు ముగిసినప్పటికీ ఇల్లీగల్‌‌గా షెల్టర్‌‌‌‌ తీసుకుంటున్న నైజీరియన్స్‌‌ ఎక్కువగా ఉన్నారు. వీరంతా పాత కస్టమర్లతో చైన్ సిస్టమ్‌‌ దందా చేస్తున్నారు. అయితే, ఎక్సైజ్‌‌ అధికారుల నిఘా లోపంతో పబ్స్‌‌లో డ్రగ్స్‌‌ సప్లయ్ జోరుగా జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌‌ టైమ్‌‌లో మినహా ఇతర సమయాల్లో ఎక్సైజ్‌‌ అధికారులు నిఘా పెట్టడం లేదనే విమర్శలు వస్తున్నాయి.  టాస్క్‌‌ఫోర్స్‌‌ పోలీసులు,హైదరాబాద్ నార్కొటిక్స్ ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌ వింగ్‌‌ అంతరాష్ట్ర ముఠాలను కట్టడి చేస్తోంది.

300 మంది సిబ్బందితో టీఎస్ఏఎన్​బీ

డ్రగ్స్ సప్లయర్స్, కస్టమర్ల డేటా, ఫోన్‌‌ నంబర్ల ఆధారంగా 3 కమిషనరేట్ల పోలీసులు ఈ ఏడాది 889 డ్రగ్స్ కేసులు నమోదు చేశారు.2,495 మందిని అరెస్ట్ చేశారు.  డ్రగ్స్ నియంత్రణ కోసం300కు పైగా సిబ్బందితో టీఎస్‌‌ యాంటీ నార్కొటిక్స్‌‌ బ్యూరో (టీఎస్‌‌ఏఎన్‌‌బి)కు ప్రభుత్వం ఇటీవల ఆమోదం తెలిపింది. సిటీ సీపీ ఆనంద్‌‌ను టీఎస్ఏఎన్​బీకు చీఫ్‌‌గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ బ్యూరో ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్న డ్రగ్స్, గంజాయి సహా ఇతర మత్తు పదార్ధాల కేసుల డేటాను రూపొందించనున్నారు.  ఇప్పటికే యాక్షన్ ప్లాన్ ప్రారంభించారు.