డ్రగ్స్‌‌ తయారీ, సప్లయ్ గ్యాంగ్ అరెస్ట్.. రూ.50లక్షల విలువైన మెథాంఫెటమైన్‌‌ సీజ్

డ్రగ్స్‌‌ తయారీ, సప్లయ్ గ్యాంగ్ అరెస్ట్.. రూ.50లక్షల విలువైన మెథాంఫెటమైన్‌‌ సీజ్
  • సూరారంలో ముగ్గురిని పట్టుకున్న టీ న్యాబ్ పోలీసులు
  • రూ.50లక్షల విలువైన మెథాంఫెటమైన్‌‌ సీజ్

హైదరాబాద్‌‌,వెలుగు :  డ్రగ్స్‌‌ తయారీ, సప్లయ్ ముఠా గుట్టురట్టైంది. సూరారం ఇండస్ట్రియల్‌‌ ఏరియాలో ముగ్గురిని టీఎస్ యాంటీ నార్కొటిక్స్‌‌ బ్యూరో(టీ న్యాబ్‌‌) పోలీసులు అరెస్ట్‌‌ చేశారు. 60 గ్రాముల క్రిస్టల్‌‌ మెథాంఫెటమైన్‌‌ 70 ఎంఎల్‌‌ మెథాంఫెటమైన్‌‌ లిక్విడ్‌‌ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. డ్రగ్స్ విలువ రూ.50 లక్షలు ఉంటుంది.  శనివారం మీడియాకు టీఎస్ న్యాబ్‌‌ ఎస్‌‌పీ చక్రవర్తి వివరాలు వెల్లడించారు.  ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కమ్మ శ్రీనివాస్‌‌(40), సిటీకి వచ్చి మేడ్చల్ జిల్లా గాజుల రామారంలో నివసిస్తున్నాడు. ఫార్మా డ్రగ్స్‌‌ తయారు చేస్తుండేవాడు. మత్తును కలిగించే మెథాంఫెటమైన్‌‌ డ్రగ్‌‌ను ఇల్లీగల్‌‌ గా సేల్‌‌ చేసేందుకు ప్లాన్ చేశాడు.

జీడిమెట్ల ఇండస్ట్రియల్‌‌ఏరియాలో మెథాంఫెటమైన్‌‌ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ 2013లో 10.9 కిలోల డ్రగ్‌‌తో నార్కొటిక్స్‌‌ కంట్రోల్‌‌ బ్యూరోకు దొరికాడు. 2017లో జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. ఆ తర్వాత కాకినాడకు చెందిన రొయ్యల వ్యాపారి జి. నరసింహ రాజు(42), దాట్ల మణికంఠ వీర వెంకట నాగరాజు(32)తో కలిసి మెథాంఫెటమైన్‌‌ డ్రగ్‌‌ తయారీ, సప్లయ్ చేస్తున్నాడు.  రెండేండ్లుగా సూరారం, జీడిమెట్ల పరిసర ప్రాంతాల్లో అమ్ముతున్నారు. శుక్రవారం సూరారంలో సేల్‌‌ చేసేందుకు యత్నించారు. సమాచారం అందడంతో టీ న్యాబ్‌‌ పోలీసులు నిఘా పెట్టి నిందితులను అరెస్ట్ చేశారు.