
- ముదిగొండ పోలీస్ స్టేషన్ దగ్గర్లోనే వినియోగం
- సీక్రెట్ నెట్ వర్క్ మెయింటేన్ చేస్తున్న పెడ్లర్లు
- ఇటీవల ఖమ్మంలో తొలిసారిగా డ్రగ్స్ పట్టివేత
ఖమ్మం, వెలుగు : జిల్లాలో పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా గంజాయి అక్రమ రవాణాకు, గ్రామాల్లో గంజాయి వినియోగానికి పూర్తి స్థాయిలో బ్రేకులు పడడం లేదు. పట్టణాలు, నగరాల్లోనే కాదు, పల్లెటూర్లలో కూడా నిర్మానుష్య ప్రాంతాలు గంజాయి తాగేందుకు అడ్డాలుగా మారుతున్నాయి. దాదాపు అన్ని మండలాల్లో గంజాయి వినియోగానికి సంబంధించిన ఆనవాళ్లు బయటపడుతున్నాయి. ఖమ్మం నగరంతో పాటు అర్బన్, రూరల్ మండలాల్లో ఎక్కువగా యువకులు గంజాయి తాగుతున్నట్లు తెలుస్తోంది. ఖమ్మంలో కేంద్రీయ పాఠశాల నుంచి మారెమ్మగుడికి వెళ్లే రోడ్డు, శివారు ప్రాంతాల్లోని ఖాళీ వెంచర్లలో గంజాయి వాడకం పెరుగుతోంది. జిల్లాలో పోలీసుల ఆపరేషన్స్ లో డ్రై గంజాయి రెగ్యులర్ గా పట్టుబడుతుండగా, గతేడాది హాషిష్ ఆయిల్ (లిక్విడ్ గంజాయి) 2 బాటిళ్లలో వైరా పోలీసులు పట్టుకున్నారు. ఇటీవల డ్రగ్స్ పట్టుబడడం కలకలం రేపింది. దీంతో జిల్లాలో డ్రగ్స్ వాడకం కూడా మొదలైందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గత నెలలో ఖమ్మం రూరల్ మండలానికి చెందిన రోహిత్ రెడ్డి కారులో 10 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్, 60 గ్రాముల హాషిష్ ఆయిల్, 1.6 కిలోల ఎండు గంజాయి దొరికింది. డ్రగ్స్, హాషిష్ ఆయిల్ ను బెంగళూరు నుంచి, ఎండు గంజాయిని అరకు నుంచి తెచ్చినట్లు ఎక్సైజ్ ఆఫీసర్ల ఎంక్వైరీలో తేలింది. వాట్సప్‌లో కోడ్ భాషలో చాటింగ్ చేయడం, కొరియర్ ద్వారా వారికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఒక గ్రాము డ్రగ్స్ రూ.5 వేల నుంచి 7 వేలకు, 6 గ్రాముల హాషిష్ ఆయిల్ రూ.5 వేలకు, వంద గ్రాముల ఎండు గంజాయి రూ.వెయ్యికి అమ్ముతున్నారు. ఇదే తరహాలో పల్లెటూర్లలో కూడా యువకులకు గంజాయి అందుబాటులోకి రావడం పేరెంట్స్‌ను కలవరపెడుతోంది. ఇటీవల ఖమ్మం రూరల్ మండల సర్వసభ్య సమావేశంలో తెల్దారుపల్లి సర్పంచ్ సిద్దినేని కోటయ్య గంజాయి సమస్యను లేవనెత్తారు. పలు గ్రామాల్లో గంజాయి అమ్మకం ఎక్కువైందని పోలీసులు, ఎక్సైజ్ ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలని కోరారు. రాత్రయితే గ్రామాల్లో యువకులతో మాట్లాడే పరిస్థితి కూడా ఉండడం లేదని, ఇబ్బందిగా మారిందని చెప్పారు.
ఖమ్మం రూరల్ మండలంలో గంజాయి వాడకం విచ్చల విడిగా ఉంది. 8వ తరగతి విద్యార్థుల నుంచి ఇంజినీరింగ్ స్టూడెంట్స్ వరకు గంజాయికి బానిసలుగా మారారు. వరంగల్ క్రాస్ రోడ్, ఏదులాపురం, ముత్తగూడెం, సత్యనారాయణపురం, తెల్దారుపల్లి, మద్దులపల్లి, తల్లంపాడు, పొన్నెకల్లు, వెంకటగిరి, గుదిమళ్ల, పెద్దతండా, నాయుడుపేట, జలగం నగర్ గ్రామాల్లో గంజాయి ఎక్కువగా వినియోగిస్తున్నారు. మద్దులపల్లికి చెందిన ఒక వ్యక్తి గంజాయి విక్రయిస్తూ పట్టుబడి ఒకసారి జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. అయినా మళ్లీ గంజాయి అమ్మకం మానడం లేదు. అతని ఇంటి చుట్టూ యువకులు సరుకు కోసం వచ్చిపోతూ ఉంటున్నారని అక్కడి వారు చెబుతున్నారు. మద్దులపల్లి నుంచి తెల్దారుపల్లికి వెళ్లే రహదారిలో చీకటి పడితే పదుల సంఖ్యలో యువత గంజాయి పీలుస్తూ కనిపిస్తున్నారని గ్రామస్తులు అంటున్నారు.
కారేపల్లి మండలంలోని గిద్దెవారిగూడెంలో నాలుగు నెలల కింద నలుగురు యువకులు మిర్చి తోట సమీపంలోని చెట్టు కింద గంజాయి తాగుతున్నారని తోట యజమాని పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ఆ యువకులను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి విచారణ అనంతరం కౌన్సెలింగ్ ఇచ్చి కేసు నమోదు చేయకుండా వదిలేశారు.వైరాలో బ్రాహ్మణపల్లి, లీలా సుందరయ్య నగర్, శాంతినగర్ లకు చెందిన విద్యార్దులు గంజాయి తాగుతున్నారనే సమాచారంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని కౌన్సెలింగ్ ఇచ్చారు. కల్లూరులో గత నెలలో ఎన్ఎస్పీ వద్ద వాహనాల తనిఖీలో బైక్‌పై వెళ్తున్న ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకొని 785 గ్రాముల గంజాయిని పట్టుకున్నారు. పెనుబల్లి మండలానికి చెందిన శివ సాయి కుమార్, ఈశ్వర్, కల్లూరు మండలానికి చెందిన మణికంఠను అరెస్ట్ చేశారు.
పూర్తి స్థాయిలో కట్టడి చేస్తున్నం
ప్రజల ఆరోగ్యం, ప్రాణాలకు హాని కలిగించే ప్రభుత్వ నిషేధిత ఉత్పత్తులు గంజాయి, డ్రగ్స్, గుట్కా వంటి విక్రయాలు, రవాణాను పూర్తిస్థాయిలో అరికట్టడానికి నిఘా వ్యవస్థను పటిష్టం చేశాం. అక్రమ వ్యాపార మూలాలపై దృష్టిపెట్టి ఆకస్మిక తనిఖీలు నిర్వహించి కట్టడి చేస్తున్నాం. మాదకద్రవ్యాల ఉత్పత్తి, సరఫరా, అమ్మకాల హాట్స్పాట్లను గుర్తింపు, ఇతర రాష్ట్రాల డ్రగ్స్, మాదకద్రవ్యాల రాకపోకలపై నిఘాపెట్టి పట్టుకుంటున్నాం. గంజాయి స్మగ్లర్లపై పీడీ యాక్టు కూడా అమలుచేస్తున్నాం. -విష్ణు ఎస్ వారియర్, పోలీస్ కమిషనర్
ముదిగొండ మండల కేంద్రంలో పోలీసు స్టేషన్ కు కూత వేటు దూరంలోని ఈ పాడుబడ్డ ఇల్లు గంజాయి ప్రేమికులకు అడ్డాగా మారింది. పట్టపగలే యువకులు ఒకరి తర్వాత ఒకరు గదిలోకి వెళ్లి గంజాయి తాగుతున్నారు. గదిలో నుంచి పొగలు వస్తున్నా, స్థానికులు సిగరెట్ పొగ అని సర్దుకుంటున్నారు. ముదిగొండలో గ్రానైట్ ఫ్యాక్టరీలు ఎక్కువగా ఉండగా, వీటిలో రాజస్థాన్, ఒడిశా, మహారాష్ట్ర, చత్తీస్ గఢ్, యూపీ రాష్ట్రాలకు చెందిన కూలీలు పని చేస్తున్నారు. వీరి ద్వారా మండలానికి గంజాయి చేరుతుందా..? లేక ఎవరైనా ప్రత్యేక నెట్ వర్క్ ద్వారా గంజాయిని యువకులకు అందజేస్తున్నారా అనే విషయంపై పోలీసులు నజర్పెడితే వివరాలు తెలిసే అవకాశం ఉంది.