గుజరాత్ లో రూ.600 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్

గుజరాత్ లో రూ.600 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్
  •     14 మంది పాకిస్తానీయులు అదుపులోకి
  •     ప్రత్యేక ఆపరేషన్  చేపట్టి బోటును స్వాధీనం చేసుకున్న 
  •     కోస్ట్  గార్డ్, ఏటీఎస్, ఎన్సీబీ

పోర్ బందర్: పాకిస్తాన్  నుంచి మన దేశంలోకి అక్రమంగా రవాణా చేస్తున్న రూ.600 కోట్ల విలువైన 86 కిలోల డ్రగ్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇండియన్  కోస్ట్  గార్డ్, యాంటీ టెర్రరిజం స్వ్కాడ్  (ఏటీఎస్), నార్కోటిక్స్  కంట్రోల్  బ్యూరో (ఎన్సీబీ) అధికారులు సంయుక్తంగా ఆపరేషన్  చేపట్టి ఆ బోటును సీజ్  చేశారు. సరుకుతో పాటు 14 మంది పాకిస్తానీయులను కూడా అదుపులోకి తీసుకున్నారు. 

శనివారం అర్ధరాత్రి గుజరాత్ లో పోర్ బందర్  వద్ద అరేబియా సముద్రంలో ఈ ఘటన జరిగింది. పాక్  నుంచి ఓ బోటులో మన దేశంలోకి డ్రగ్స్ ను అక్రమంగా తరలిస్తున్నట్లు ఇంటెలిజెన్స్  నుంచి సమాచారం రావడంతో ఏటీఎస్, ఎన్సీబీ, కోస్ట్  గార్డ్  సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యాయి. బోటును స్వాధీనం చేసుకునేందుకు ప్రత్యేక ఆపరేషన్  చేపట్టాయి. 

రాజస్థాన్ కు చెందిన కోస్ట్  గార్డ్  షిప్  కూడా ఈ ఆపరేషన్ లో పాల్గొన్నది. బలగాల ఓడలను చూసి స్మగ్లర్లు తప్పించుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఎట్టకేలకు స్మగ్లర్ల బోటును అడ్డగించి దానిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బోటును తనిఖీ చేయగా 86 కిలోల డ్రగ్స్  దొరికింది. దాని విలువ విలువ రూ.600 కోట్లు అని అధికారులు వెల్లడించారు. పట్టుబడిన 14 మంది పాకిస్తానీయులతోపాటు బోటును కూడా దర్యాప్తు కోసం పోర్ బందర్ కు తీసుకెళ్లారు.