
హైదరాబాద్ సిటీ, వెలుగు: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో వీకెండ్ ప్రత్యేక డ్రైవ్భాగంగా మద్యం తాగి వాహనాలు నడిపిన 405 మందిని ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. ఇందులో బైకర్లు 292, త్రీవీలర్ డ్రైవర్లు 26, ఫోర్- వీలర్ డ్రైవర్లు 79, హెవీ వెహికల్ డ్రైవర్లు 8 మంది ఉన్నారు. వీరిపై డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిన వారిలో బీఏసీ కౌంట్ 300–500 మధ్య 16 మంది, 200–300 మధ్య 23 మంది, 150–200 మధ్య 43 మంది, 100–150 మధ్య 108 మంది, 50–100 మధ్య 155 మంది ఉన్నారు.
మద్యం తాగి వాహనం నడపడం నేరమని, ప్రమాదానికి కారణమైతే 10 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా విధిస్తామని పోలీసులు హెచ్చరించారు. గత వారం 199 కేసుల్లో 188 మందికి జరిమానా, 11 మందికి జైలు శిక్ష (4 మందికి 1 రోజు, 7 మందికి 2 రోజులు), 18 మందికి సామాజిక సేవ విధించినట్లు వివరించారు.