మద్యం మత్తులో మర్లబడితే.. కటకటాలే..! తప్పతాగి న్యూసెన్స్చేస్తే క్రిమినల్ కేసులు

మద్యం మత్తులో మర్లబడితే.. కటకటాలే..! తప్పతాగి న్యూసెన్స్చేస్తే క్రిమినల్ కేసులు
  • వరంగల్ కమిషనరేట్ లో మత్తులో రాద్ధాంతం చేస్తున్న మందుబాబులు
  • డ్రంక్ అండ్ డ్రైవ్ లో చిక్కి ట్రాఫిక్ సిబ్బందితో వాగ్వాదం, దాడులు
  • నిందితులపై నాన్ బెయిలబుల్ కేసులు పెడుతున్న పోలీసులు
  • జైలు శిక్ష పడేలా కఠిన చర్యలు

హనుమకొండ, వెలుగు: గ్రేటర్ వరంగల్ నగరంలో కొందరు మందుబాబులు మద్యం మత్తులో రెచ్చిపోతున్నారు. ప్రమాదాల నివారణకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్న పోలీసులతో వాదనకు దిగడంతోపాటు రోడ్లపై న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. లిక్కర్ కిక్కులో ట్రాఫిక్ పోలీస్ సిబ్బందిని తిట్టడం, దాడులకు కూడా తెగబడుతున్నారు.

ఇటీవల జరిగిన ఘటనల నేపథ్యంలో వరంగల్ కమిషనరేట్ పోలీసులు మందు బాబులపై కఠిన చర్యలకు ఉపక్రమించారు. మద్యం మత్తులో శ్రుతిమించి ప్రవర్తించే వాహనదారులపై క్రిమినల్ కేసులు పెడుతున్నారు. నాన్ బెయిలబుల్ సెక్షన్లు నమోదు చేస్తూ నిందితులను కటకటాల్లోకి నెడుతున్నారు.

డెయిలీ సగటున 70 మంది బుక్..

వరంగల్ కమిషనరేట్ లో ఏటికేడు రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. అందులో మద్యం మత్తులో జరుగుతున్నవే చాలావరకు ఉంటున్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా నగరంలోని హనుమకొండ, కాజీపేట, వరంగల్ ట్రాఫిక్ స్టేషన్ల పరిధిలో ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. నిరుడు 20,338 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసి, 96 మందిని జైలుకు పంపించగా, ఓవరాల్ గా రూ.1.8 కోట్ల వరకు ఫైన్లు విధించారు. ఈ ఏడాది గడిచిన ఏడు నెలల్లో దాదాపు 19 వేలకుపైగా కేసులు నమోదు చేశారు. ప్రతిరోజు సగటున 70 మంది వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో  చిక్కుతుండగా, వారికి కమిషనరేట్ ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్ లో కౌన్సిలింగ్ ఇవ్వడంతోపాటు కోర్టులో హాజరుపర్చి జరిమానాలు, జైలు శిక్షలు అమలు చేస్తున్నారు. 

ఫుల్లుగా తాగి పోలీసులపై దాడి..

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో చిక్కుతున్న వాహనదారుల్లో కొంతమంది పోలీసులపైనే తిరగబడుతున్నారు. ఇటీవల పలివేల్పుల క్రాస్, కేయూ జంక్షన్ వద్ద జరిగిన ఘటనలే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. కొద్దిరోజుల కిందట హనుమకొండ బస్టాండ్ సమీపంలో విద్యారణ్యపురికి చెందిన అర్షద్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడి, ట్రాఫిక్ కానిస్టేబుల్ పై దాడికి దిగాడు. అడ్డుకోబోయిన సీఐతోపాటు మరో కానిస్టేబుల్ రమేశ్ పై దాడికి ప్రయత్నించాడు. అంతకుముందు సుబేదారి పీఎస్ పరిధిలో వడ్డేపల్లి వద్ద సిగ్నల్ జంప్ చేసిన వెహికిల్ ఫొటో తీసినందుకు కారు ఓనర్ కానిస్టేబుల్ పై దాడికి దిగారు.  

క్రిమినల్ కేసులతో క్రైమ్ రికార్డ్స్ లోకి..

మందుబాబులు మితిమీరి ప్రవర్తిస్తున్న నేపథ్యంలో వరంగల్ ట్రాఫిక్ పోలీసులు రూల్స్ మరింత స్ట్రిక్ట్ చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, దుర్భాషలాడటం, దాడులకు దిగుతున్న వారిపై నాన్ బెయిలబుల్ క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో నిందితులకు భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే అవకాశంతోపాటు నాన్ బెయిలబుల్ అఫెన్స్ కింద కోర్టు తీర్పు ప్రకారం ఏడేండ్ల నుంచి పదేండ్ల వరకు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.

అనవసరంగా కేసుల పాలవ్వొద్దు..

డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో పట్టుబడి కొందరు మర్లబడటంతోపాటు భౌతిక దాడుల వరకు వెళ్తున్నారు. ఇలా దాడులకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలి. తాగి బండి నడపడమే తప్పు. మళ్లీ తప్పు మీద తప్పు చేసి, అనవసరంగా కేసుల పాలవ్వొద్దు.- జి.సీతారెడ్డి, ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్, హనుమకొండ