డ్రంకన్ డ్రైవ్లను సహించం.. తాగి బండి నడిపేటోళ్లు రోడ్డు టెర్రరిస్టులు: సీపీ సజ్జనార్

డ్రంకన్ డ్రైవ్లను సహించం.. తాగి బండి నడిపేటోళ్లు రోడ్డు టెర్రరిస్టులు: సీపీ సజ్జనార్
  • బెట్టింగ్ ​యాప్లపై సీరియస్​ యాక్షన్​
  • హైదరాబాద్ పోలీస్    కమిషనర్​గా బాధ్యతల స్వీకరణ 

హైదరాబాద్ సిటీ, వెలుగు: మందు తాగి వెహికల్స్ నడిపేవారు రోడ్డు టెర్రరిస్టులు అని హైదరాబాద్ సిటీ కొత్త పోలీస్ కమిషనర్​సజ్జనార్​అభివర్ణించారు. నగరంలో డ్రంకన్ డ్రైవ్ చేసే వారి పట్ల కనికరం చూపబోమని, తాగి బండి నడిపేవారు వారి ప్రాణాలకే కాకుండా, ఇతరుల ప్రాణాలకూ ముప్పు తెస్తున్నారని.. అందుకే వారు సూసైడ్​బాంబర్లతో సమానమన్నారు. 

బెట్టింగ్​యాప్ లను కట్టడి చేసి, వాటి వెనకాల ఉన్న వారిపై కూడా సీరియస్​యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌‌‌‌‌‌‌‌గా సజ్జనార్ మంగళవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కమాండ్ కంట్రోల్ సెంటర్‌‌‌‌‌‌‌‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. 

హైదరాబాద్ పోలీస్ పని చేయబోయే తీరు, ప్రజల సంక్షేమం, శాంతిభద్రతలపై తమ ప్లాన్​ను వివరించారు. ‘హైదరాబాద్ పోలీస్.. మీ పోలీస్, మీ కోసం పనిచేసే పోలీస్’ అని అన్నారు. ప్రతి పౌరుడు ఒక పోలీస్‌‌‌‌‌‌‌‌లా బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ప్రజల సహకారంతో శాంతిభద్రతలను మరింత బలోపేతం చేస్తామన్నారు. 

ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థగా పని చేస్తామని చెప్పారు. డ్రగ్స్ నిర్మూలనపై హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తారని, డ్రగ్ గ్యాంగ్‌‌‌‌‌‌‌‌లను ఎక్కడున్నా పట్టుకుంటామని సజ్జనార్ స్పష్టంచేశారు. ఈ మేరకు ‘హెచ్ న్యూ’ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తామని, అవసరమైతే అదనపు సిబ్బందిని కేటాయిస్తామని తెలిపారు. 

మహిళల భద్రతపై రాజీపడబోం..  

వాహనాల రేట్లు తగ్గితే కొనుగోళ్లు పెరుగుతున్నాయని, దీనివల్ల ట్రాఫిక్ సమస్య కూడా పెరుగుతుందని సజ్జనార్ అన్నారు. ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొంటామని.. ప్రయాణ సమయం తగ్గించి, వాహనాల వేగం పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించేవారిని పట్టుకునేందుకు అదనపు టీమ్‌‌‌‌‌‌‌‌లను నియమిస్తామని తెలిపారు. పోలీసింగ్ వ్యవస్థలో ఏఐతోపాటు, డ్రోన్‌‌‌‌‌‌‌‌ల వినియోగాన్ని పెంచి నిఘాను మరింత బలోపేతం చేస్తామని వెల్లడించారు. 

మహిళల భద్రతలో రాజీపడబోమని, షీ టీమ్ లను మరింత శక్తిమంతం చేస్తామన్నారు. ఆడపిల్లలను టీజ్ చేసేవారు.. తమ ఇంట్లోనూ ఆడవాళ్లు ఉన్నారని గుర్తుంచుకోవాలని సజ్జనార్ హితవు పలికారు. ఎవరైనా మహిళల జోలికి వెళితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డిపార్ట్​మెంట్​లో నిబద్ధతతో పని చేసే సిబ్బంది సేవలను గుర్తిస్తామని, వారికి రివార్డ్ అండ్ రికగ్నిషన్ కొనసాగుతుందని చెప్పారు. శాంతి భద్రతల్లో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు మంచి పేరు తెస్తానని హామీ ఇచ్చారు

సైబర్ నేరాలపై ఉక్కుపాదం 

సైబర్ నేరాలు డైనమిక్‌‌‌‌‌‌‌‌గా మారుతున్నాయని, చాలా మందికి అవగాహన ఉన్నప్పటికీ ఇలాంటి నేరాల బారిన పడుతున్నారని సజ్జనార్ అన్నారు. స్టాక్ అడ్వైజరీ, బెట్టింగ్ యాప్‌‌‌‌‌‌‌‌ల వల్ల నష్టపోతున్నవారి సంఖ్య పెరుగుతోందని, సోషల్ మీడియా ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లూయెన్సర్లు నష్టం కలిగించే ప్రకటనలను చేయవద్దని కోరారు. 

డిజిటల్ అరెస్ట్‌‌‌‌‌‌‌‌పై ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని, వారి పిల్లలు జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. ఆర్థిక నేరాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. 
కల్తీ, ఆర్థిక నేరాల నివారణకు మార్కెట్ ఇంటెలిజెన్స్ యూనిట్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభిస్తామని వెల్లడించారు.