డిసెంబర్​లో డీఎస్సీ!.. సెప్టెంబర్ నెలాఖరులో నోటిఫికేషన్

డిసెంబర్​లో డీఎస్సీ!.. సెప్టెంబర్ నెలాఖరులో నోటిఫికేషన్

హైదరాబాద్, వెలుగు: ఎట్టకేలకు ఆరేండ్ల తర్వాత టీచర్ పోస్టుల భర్తీకి సర్కార్ చర్యలు చేపట్టింది. 6,612 పోస్టులు భర్తీ చేసేందుకు డీఎస్సీ నిర్వహిస్తామని ప్రకటించింది. 2017లో టీఎస్​పీఎస్సీ ద్వారా టీచర్ పోస్టులను భర్తీ చేయగా, ఈసారి స్కూల్ ఎడ్యుకేషన్ ​డైరెక్టరేట్​కే రిక్రూట్ మెంట్ బాధ్యతలు అప్పగించింది. దీంతో విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రెండ్రోజుల్లో షెడ్యూల్ రిలీజ్ చేయనున్నారు. 

వచ్చే నెల 15న టెట్ ఎగ్జామ్ నిర్వహించి, 27న రిజల్ట్ విడుదల చేసి.. ఆ తర్వాత ఒకట్రెండు రోజుల్లోనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. డిసెంబర్ ఫస్ట్ వీక్​లో ఎగ్జామ్ నిర్వహించాలని అధికారులు యోచిస్తున్నారు. అప్పుడు ఎన్నికలు ఉండే అవకాశం ఉండడంతో, పరిస్థితులను బట్టి డేట్లు మార్చాలనే భావనలో ఉన్నారు. ఇక గతంలో ఎస్జీటీ, దాని సమానస్థాయి పోస్టులకు ఒకరోజు ఒక సెషన్​లో పరీక్ష నిర్వహించి.. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు మరుసటి రోజు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించారు. ఈసారి కూడా అదే విధానాన్ని అమలు చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. 

7 జిల్లాల్లో రెండొందలకు పైగా పోస్టులు.. 

మొత్తం 5,089 రెగ్యులర్ టీచర్ పోస్టులు ఖాళీగా ఉండగా.. అందులో కేవలం ఏడు జిల్లాల్లోనే రెండొందలకు పైగా పోస్టులు ఉన్నట్టు తెలిసింది. అత్యధికంగా హైదరాబాద్,  అత్యల్పంగా పెద్దపల్లిలో ఉన్నట్టు సమాచారం. హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో మూడొందలకు పైగా, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కామారెడ్డి, నల్గొండ, సంగారెడ్డి జిల్లాల్లో రెండొందలకు పైగా ఖాళీలు ఉన్నట్లు తెలిసింది. 

యాదాద్రి, కరీంనగర్, వనపర్తి, పెద్దపల్లి, ములుగు, మేడ్చల్, మహబూబ్ నగర్, భూపాలపల్లి, జనగామ, హనుమకొండ జిల్లాల్లో వంద లోపే ఉన్నట్టు సమాచారం. ఆదిలాబాద్, ఆసిఫాబాద్​లో రెండొందలకు పైగా ఎస్జీటీ పోస్టులు.. వికారాబాద్, హైదరాబాద్​లో వందకు పైగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు.. హైదరాబాద్​లో 50కి పైగా లాంగ్వేజ్​ పండిట్ పోస్టులు ఉన్నట్టు తెలిసింది.

మళ్లీ పాత విధానంలో.. 

2017లో 8,972 టీచర్ పోస్టుల భర్తీకి టీఎస్ పీఎస్సీ ద్వారా టీఆర్టీ నిర్వహించారు. ఇప్పటికీ వాటిలో కొన్ని పోస్టులు భర్తీ కాలేదు. అభ్యర్థులు కోర్టులో కేసులు వేశారు. ఈ క్రమంలో టీఆర్టీ నిర్వహణకు టీఎస్ పీఎస్సీ విముఖత చూపినట్టు తెలిసింది. మరోవైపు టీఎస్ పీఎస్సీ ద్వారా రిక్రూట్ మెంట్ ప్రక్రియ చేపడితే, ఆలస్యమవుతుందనే భావన కూడా విద్యాశాఖ అధికారుల్లో ఉంది. దీంతో మళ్లీ పాత విధానంలోనే స్కూల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో డీఎస్సీ ద్వారా పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 

కొత్త జిల్లాల ప్రకారం డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ)లను ఏర్పాటు చేస్తారు. డీఎస్సీ చైర్మన్​గా జిల్లా కలెక్టర్, వైస్ చైర్మన్​గా అడిషనల్ కలెక్టర్, సెక్రటరీగా డీఈఓ, మెంబర్​గా జిల్లా పరిషత్ సీఈఓ ఉంటారు. దీనికి సంబంధించిన విధివిధానాలను సర్కారు ప్రకటించనుంది.