రాజకీయ లబ్ధి కోసమే డీఎస్సీ నోటిఫికేషన్ : ఆర్.కృష్ణయ్య

రాజకీయ లబ్ధి కోసమే డీఎస్సీ నోటిఫికేషన్ :   ఆర్.కృష్ణయ్య

బషీర్​బాగ్, వెలుగు: లోక్​సభ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమే రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్  వేసిందని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్ ఆధ్వర్యంలో డీఈడీ స్టూడెంట్లు, నిరుద్యోగులు సోమవారం లక్డీకాపూల్​లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆఫీసును ముట్టడించారు. ఆర్.కృష్ణయ్య పాల్గొని వారికి మద్దతు తెలిపారు. ఆఫీస్​గేటు ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టెట్ నోటిఫికేషన్​లేకుండా హడావుడిగా11వేల పోస్టులతో డీఎస్సీని ఎలా ప్రకటిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. 24 వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేస్తామని ఎన్నికలకు ముందు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. తక్షణమే డీఎస్సీ నోటిఫికేషన్​ను రద్దు చేసి టెట్ నిర్వహించాలని, తర్వాత మెగా డీఎస్సీ వేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నిరుద్యోగులతో కలిసి పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. ఆందోళనలో నిరుద్యోగులతోపాటు జాతీయ బీసీ ఐక్య వేదిక అధ్యక్షుడు జి.అనంతయ్య, బీసీ విద్యార్థిసేన అధ్యక్షుడు వేముల రామకృష్ణ, బీసీ  సంక్షేమ సంఘం రాష్ట్ర నేతలు ఉదయ్ నేత, మట్ట జయంతి గౌడ్, కోతులారం కృష్ణ, నిరుద్యోగ జేఏసీ నేతలు చందు, సందేశ్, శివ, హరిణి, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.