అందరికీ న్యాయం కోసమే యూసీసీ : ఎమ్మెల్యే రఘునందన్ రావు

అందరికీ న్యాయం కోసమే యూసీసీ : ఎమ్మెల్యే రఘునందన్ రావు

గజ్వేల్, వెలుగు : దేశంలో అందరికీ ఒకే న్యాయం ఉండాలని కేంద్రం యూనిఫాం సివిల్​ కోడ్​(యూసీసీ)ను తెస్తోందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్​ పట్టణంలో ఇటీవల రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో అరెస్ట్ అయిన వారి కుటుంబాలను బుధవారం ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ  దేశంలో చాలా సమస్యల పరిష్కారానికి యూసీసీ ఉపయోగపడుతుందని తెలిపారు. గజ్వేల్ లో జరిగిన సంఘర్షణలో ఓ వర్గానికి ఒక న్యాయం, మెజారిటీ వర్గ ప్రజలకు మరో న్యాయం జరిగిందని ఆరోపించారు. 

సీఎం సొంత నియోజకవర్గంలో మెజార్టీ ప్రజలను అణచివేయాలని చూడటం దురదృష్టకరమన్నారు. కులం, మతం, ప్రాంతాల ఆధారంగా చట్టం మారకుడదని చెప్పారు. అందుకే యూనిఫామ్​ సివిల్ కోడ్ తెచ్చే దిశగా కేంద్రం ప్రయత్నం చేస్తుందని తెలిపారు. వచ్చే ఎన్నికలు భారతీయులకు, ఇండియా అని పేరు పెట్టుకున్న యూపీఏ ప్రజావ్యతిరేక కూటమికి మధ్య జరిగే యుద్ధం అన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్​రెడ్డి, రాష్ట్ర నాయకుడు కప్పర ప్రసాద్ రావు పాల్గొన్నారు.