ఇప్పుడు మోడీనే మా డాడీ: తమిళనాడు మంత్రి

ఇప్పుడు మోడీనే మా డాడీ: తమిళనాడు మంత్రి

చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత (అమ్మ) మరణం తర్వాత తమ పార్టీనే ప్రధాని మోడీనే నడిపిస్తున్నారని తమిళనాడు మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ చెప్పకనే చెప్పారు. అమ్మ ఉన్నంత వరకు ఆమె స్వతంత్రంగా అన్ని నిర్ణయాలు తీసుకునేవారని, పార్టీని సమర్థంగా నడిపించారని అన్నారు. ప్రస్తుతం ఆమె లేరని, మోడీనే తమకు డాడీ (పెద్ద దిక్కు) అని తెలిపారు. శుక్రవారం విరుత్తునగర్ లో జరిగిన పార్టీ సమావేశం తర్వాత మంత్రి బాలాజీ మీడియాతో మాట్లాడారు. బీజేపీతో అన్నాడీఎంకే పొత్తును గతంలో జయ వ్యతిరేకించారు.. మరి ఇప్పుడు ఆ పార్టీతో పొత్తుకు కారణమేంటని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు.

అమ్మ మరణం తర్వాత మోడీ తమకు డాడీలా వచ్చారని, పార్టీని గైడ్ చేశారని బాలాజీ తెలిపారు. మోడీ ఒక్క అన్నాడీఎంకే పార్టీకి మాత్రమే డాడీ కాదని, మొత్తం దేశానికే డాడీ అని చెప్పారాయన. అందువల్లే బీజేపీతో పొత్తుకు తాము సిద్ధపడ్డామని వివరించారు.

అయితే జయ బతికి ఉండగా.. 2014 ఎన్నికల్లో గుజరాత్ లో ఉన్న మోడీ కంటే తమిళనాడులో ఉన్న లేడీ (జయ) చాలా బెటర్ అని వ్యాఖ్యానించారు. దీన్ని మీడియా బాలాజీ వద్ద ప్రస్తావించగా.. ‘‘తమిళనాడు నాయకత్వ సత్తాని ప్రపంచానికి తెలియజేయడానికి ఆమె అలా అన్నారు. అంతే తప్ప మోడీపై అమ్మకు చెప్పలేనంత గౌరవం ఉంది. అటల్ బిహారీ వాజపేయి ప్రధానిగా ఉన్న సమయం నుంచే మోడీ, జయ మంచి స్నేహితులు’’ అని చెప్పారాయన.