చార్‌ధామ్‌ యాత్ర 2 రోజుల పాటు నిలిపివేత.. 6 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ

చార్‌ధామ్‌ యాత్ర 2 రోజుల పాటు నిలిపివేత.. 6 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ

ఉత్తరాఖండ్‌ను మరోసారి భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. అక్కడ కురుస్తోన్న భారీ వర్షాలకు జన జీవనం అస్తవ్యస్తమైంది. నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చాలా చోట్ల కొండచరియలు విరిగిపడటంతో జాతీయ రహదారులు బ్లాక్‌ అయ్యాయి. ఈ క్రమంలో ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్‌ యాత్రను రెండు రోజుల పాటు నిలిపివేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. 

డెహ్రాడూన్, నైనిటాల్‌ సహా ఆరు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు దాదాపు 60 మంది మరణించగా.. 17మంది గల్లంతయ్యారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి జిల్లా మెజిస్ట్రేట్‌లతో ఫోన్‌లో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

డెహ్రాడూన్, పౌరి, టెహ్రి, నైనిటాల్‌, చంపావత్‌, ఉధం సింగ్‌ నగర్‌ వంటి ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికల జారీ చేసింది.
దీంతో ఆగస్టు 14, 15 తేదీల్లో చార్‌ధామ్‌ యాత్రను నిలిపివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. 

ఎడతెరిపిలేకుండా కురుస్తోన్న భారీ వర్షాలతో బద్రీనాథ్‌, కేదార్‌నాథ్‌, గంగోత్రి వంటి పవిత్ర పుణ్యక్షేత్రాలకు వెళ్లే జాతీయ రహదారులు బ్లాక్‌ అయ్యాయి. రుద్రప్రయాగ్‌, దేవ్‌ప్రయాగ్‌, శ్రీనగర్‌లలో గంగా, మందాకిని, అలక్‌నంద నదులు ప్రమాదకరస్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి.