పంట నష్టపరిహారం చెల్లించాలంటున్న రైతులు

పంట నష్టపరిహారం చెల్లించాలంటున్న రైతులు

ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి మెదక్ జిల్లాలోని కూరగాయల పంటలకు తీవ్ర నష్టం జరిగింది. టమాట, బీర, దోస, కాకర, పొట్లకాయ తోటలతోపాటు కొత్తిమీర, పాలకూర, తోటకూర పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. లక్షల రూపాయలు వర్షార్పణం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. 

సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లోని రైతులు సీజన్ తో సంబంధం లేకుండా ఆకుకూరలు, కూరగాయలు సాగు చేస్తారు. వీటిని హైదరాబాద్ కు తరలిస్తుంటారు. అయితే వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి మెదక్ జిల్లాలో వేల ఎకరాల్లోని కూరగాయల తోటలు నాశనమయ్యాయి. టమాట పంట నీట మునిగి కుళ్లిపోయింది. వానలకు పచ్చికాయకు కూడా పగుళ్లు రావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కొత్తిమీర, పాలకూర, తోటకూర పొలాల్లోనే మురిగిపోయాయి. 

ఎడతెరపి లేకుండా వర్షాలకు పడడంతో మడుల్లో నీళ్లు నిలిచాయి. దీంతో కూరగాయల మొక్కలు నేలకొరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం కూరగాయలు సాగుకు ప్రోత్సాహం ఇవ్వకపోగా, పంట నష్టం జరిగితే కనీసం పరిహారం కూడా ఇవ్వడం లేదన్నారు రైతులు. పొలం దున్నడం, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులకు లక్షలాది రూపాయలు ఖర్చు అయ్యాయని చెప్పారు. వర్షాలకు పంట నష్టపోయిన తమను ఆదుకోవాలని ఉమ్మడి మెదక్ జిల్లాలోని కూరగాయల రైతులు వేడుకుంటున్నారు. అధికారులు పంట నష్టంపై క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహించి నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నారు.