బ్రిడ్జీ నిర్మించలే.. అంతిమ యాత్రకు అవస్థలు తప్పలే

బ్రిడ్జీ నిర్మించలే.. అంతిమ యాత్రకు అవస్థలు తప్పలే

భారీ వర్షాలతో రాష్ట్రంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. జగిత్యాల జిల్లాలో ఓ చోట అంతిమ యాత్రకు వరద నీటిని దాటుతూ తీసుకెళ్లడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. 

కొడిమ్యాల మండలంలోని కోనాపూర్ గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు సెప్టెంబర్ 3న అర్ధరాత్రి అనారోగ్యంతో మృతి చెందింది. అంత్యక్రియల  సమయానికి భారీ వర్షంతో ఊరు వాగు పొంగి పొర్లింది. 

అంత్యక్రియలకు వాగు దాటాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైకుంఠ రథం ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటి ముందుకు సాగింది. బంధువులు సైతం అతి కష్టం మీద వాగు దాటారు. పార్థివ దేహం తీసుకెళ్తున్న సమయంలో ఆటో దాదాపు కొట్టుకుపోయేంత పని అయింది. 

వాహనం పట్టు తప్పకుండా వెనక నుంచి కొందరు నెట్టడంతో తృటిలో ప్రమాదం తప్పింది.ఊరికి వచ్చే దారిలో ఉన్న వాగుపై బ్రిడ్జీ నిర్మించాలని  నాయకుల దగ్గర ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవడంతో ఈ దుస్థితి నెలకొందని గ్రామస్థులు వాపోతున్నారు. బ్రిడ్జీ నిర్మించి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.