ఆరు నెలల్లో రెండున్నర రెట్లు పెరిగిన ట్రాన్స్​ఫార్మర్​ ధర

ఆరు నెలల్లో రెండున్నర రెట్లు పెరిగిన ట్రాన్స్​ఫార్మర్​ ధర

వనపర్తి, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నప్పటికీ కొత్త కనెక్షన్ల విషయంలో సబ్సిడీ పెంచకపోవడంతో రైతులపై ఆర్థిక భారం పడుతోంది. గతంతో పోలిస్తే ట్రాన్స్​ఫార్మర్​ధర రెండున్నర రెట్లు పెరిగింది. కానీ సబ్సిడీ ఒక్కపైసా పెరగలేదు. అలాగే స్తంభాలకు సైతం భారీగా ఖర్చవుతోంది. ఈ భారమంతా రైతులపైనే పడుతుండడంతో నానా అవస్థలు పడుతున్నారు. రైతులు వ్యవసాయ కనెక్షన్​కోసం రూ.5 వేలు డిపాజిట్‌ కట్టి దరఖాస్తు చేసుకుంటే ఒక్కో కనెక్షన్‌ కు సర్కారు రూ.70 వేల వరకు రాయితీ ఇస్తోంది. మిగిలిన మొత్తాన్ని రైతులు డీడీ రూపంలో కట్టాలి. గతంలో ముగ్గురు రైతులు అగ్రికల్చర్ సర్వీస్ కోసం దరఖాస్తు చేసుకుంటే వారికి రూ.2.10 లక్షల సబ్సిడీ వచ్చేది. ఆ డబ్బుతో రైతులకు అవసరమైన ఒక ట్రాన్స్ ఫార్మర్, అవసరమైన కరెంట్ స్తంభాలు, కండెన్సర్, వైర్లు, ఇతర వస్తువులు అందించేవారు.  ఇప్పుడు ట్రాన్స్ ఫార్మర్ల ధరలు అమాంతం పెరిగాయి. ఫిబ్రవరిలో 55 వేలు ఉన్న 25 కేవీ ట్రాన్స్​ఫార్మర్ ధర ఆరు నెలలు తిరక్కుండానే రూ. 1.37 లక్షలకు చేరింది.

ప్రైవేట్ కంపెనీల  నుంచి అవసరమైన ట్రాన్స్​ఫార్మర్లను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ సరిపోక ట్రాన్స్​కో రైతులపై భారం మోపుతోంది.  దీంతోపాటు రైతు పొలం వద్దకు విద్యుత్ కనెక్షన్ తీసుకువెళ్లేందుకు అవసరమైన స్తంభాలు, కండక్టర్ వైరు ఇలా అన్ని ఖర్చులు వారిపైనే వేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 54,099 మంది రైతులు కొత్త వ్యవసాయ కనెక్షన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ట్రాన్స్ ఫార్మర్ కే  సర్కారు ఇస్తున్న సబ్సిడీ సరిపోతుండడంతో రైతులు అదనంగా డబ్బులు చెల్లించి స్తంభాలు, కండెన్సర్ ఇతర వస్తువులు కొనాల్సి వస్తోంది. ఒక స్తంభం ధర రూ.16 వేల వరకు ఉంటుంది. అదేవిధంగా కండక్టర్ వైర్ మీటర్ ధర రూ. 70 చొప్పున రైతులే కొనుగోలు చేసి ఇస్తేగానీ ట్రాన్స్ కో కొత్త కనెక్షన్లు ఇవ్వడం లేదు. రైతులు అంత భారం మోయలేక సతమతమవుతున్నారు. ప్రస్తుతం ఒక కనెక్షన్ కు రూ.70 వేలు ఉన్న సబ్సిడీని రూ. లక్షకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. 

సబ్సిడీ పెంచాలని  ప్రభుత్వాన్ని కోరాం

ప్రభుత్వం ఉచిత వ్యవసాయ కనెక్షన్లకు ఇచ్చే సబ్సిడీని రూ.70 వేల నుంచి లక్ష రూపాయలకు పెంచాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాం. ట్రాన్స్ ఫార్మర్ల ధరలను ప్రైవేట్ కంపెనీలు పెంచడం వల్ల రైతులకు పూర్తి స్థాయిలో మెటీరియల్ అందించలేకపోతున్నాం. రైతులపై భారం పడుతోంది. వనపర్తిలో మాత్రం రైతులపై భారం పడకుండా మంత్రి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. 
– నాగేంద్రకుమార్, ఎస్ఈ, ట్రాన్స్ కో, వనపర్తి