హైదరాబాద్ లో ఇష్టం వచ్చినట్లు తవ్వకాలు.. కుంగిన కాలనీ మెయిన్ రోడ్డు

హైదరాబాద్ లో ఇష్టం వచ్చినట్లు తవ్వకాలు.. కుంగిన కాలనీ మెయిన్ రోడ్డు

మూసాపేట్/కూకట్​పల్లి, వెలుగు: ఓ రియల్​ఎస్టేట్ నిర్మాణ సంస్థ చేపడుతున్న సెల్లార్​తవ్వకాలతో ప్రధాన రహదారి కుంగి, కూలి ఓ కాలనీకి రాకపోకలు బంద్​అయ్యాయి. కూకట్​పల్లి సర్కిల్​పరిధి హైదర్​నగర్ ​డివిజన్ ​గౌతమినగర్ ​కాలనీకి ఆనుకుని ఉన్న 9.4 ఎకరాల స్థలంలో ప్రణీత్​ ప్రణవ్ ​ఇక్సోరా అనే నిర్మాణ సంస్థ  భారీ అపార్ట్ మెంట్ల నిర్మాణం  చేపడుతోంది. కనీస జాగ్రత్తలు పాటించకపోవడంతో గౌతమినగర్​కాలనీకి వెళ్లే మెయిన్ రోడ్  సుమారు15 ఫీట్ల వరకు కుంగిపోయి దెబ్బతింది.  దీంతో ఆ రోడ్డు కింద ఉన్న డ్రైనేజీ, మంచి నీటి వ్యవస్థ పూర్తిగా ధ్వంసమయ్యాయి. రోడ్డు కుంగిపోవడంతో  పక్కనే ఉన్న 5 అపార్టుమెంట్లు, 10 ఇండ్లలో ఉంటున్న సుమారు వంద కుంటుంబాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

రోడ్డు కుంగి ఓ అపార్టుమెంట్ ఏకంగా కూలిపోయే ప్రమాదం ఏర్పడింది. దీంతో ఆ అపార్ట్​మెంట్​లోని 25 కుటుంబాలు ఖాళీ చేయాలని డీఆర్​ఎఫ్​అధికారులు హెచ్చరించారు. రోడ్డుకు అతి సమీపంలో నుంచి పనులు చేస్తుండటంతో అక్కడి పరిస్థితులపై కాలనీవాసులు గతంలో జీహెచ్ఎంసీ హెడ్డాఫీసు, రెరా, హెచ్ఎండీఏ అధికారులకు కంప్లయింట్ చేశారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. కుంగిన రోడ్డును పూర్తిగా పునరుద్ధరించి, ధ్వంసమైన డ్రైనేజీ, తాగునీటి వ్యవస్థను సరిచేయాలని కోరుతున్నారు.  కనీస జాగ్రత్తలు పాటించకుండా తవ్వకాలు చేపట్టిన నిర్మాణ సంస్థపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్​ చేస్తున్నారు.