రాష్ట్రంలో మహిళా రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయట్లే?

రాష్ట్రంలో మహిళా రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయట్లే?

అరెస్టు భయంతోనే ఢిల్లీలో కవిత దీక్ష : షర్మిల

హైదరాబాద్, వెలుగు : లిక్కర్ స్కామ్​లో అరెస్ట్ అవుతారనే భయంతోనే ఢిల్లీలో మహిళా రిజర్వేషన్లపై ఎమ్మెల్సీ కవిత దీక్షకు దిగారని వైఎస్సార్​టీపీ చీఫ్  షర్మిల విమర్శించారు. తాజా పరిణామాలను చూస్తుంటే ఈ కుంభకోణంలో కవిత పాత్ర కూడా ఉన్నట్లు అర్థమవుతోందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్  స్కామ్​ జరిగిన తీరుపై ఏనాడూ చెప్పలేదన్నారు.

బీఆర్ఎస్ లో  2014, 2018 అసెంబ్లీ ఎన్నికలు, 2019 లోక్ సభ ఎన్నికల్లో ఎంత మంది మహిళలకు టికెట్లు ఇచ్చారని ఆమె ప్రశ్నించారు. క్యాబినెట్ లో 33 శాతం రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. శుక్రవారం లోటస్ పాండ్ లో మీడియాతో  షర్మిల మాట్లాడారు. కవిత లిక్కర్ స్కాంకు తెలంగాణకు అసలు సంబంధమే లేదన్నారు. ‘‘2014 ఎన్నికల్లో మహిళలకు 6 సీట్లు ఇచ్చారు. 2018 లో 4 సీట్లు ఇచ్చారు. కోర్టు చెప్పే దాకా మహిళా కమిషన్​ను ఏర్పాటు చేయలేదు. 2014  ప్రభుత్వంలో క్యాబినెట్ లో మహిళకు చోటు లేదు.

ఇక మహిళ అని చూడకుండా గవర్నర్  తమిళిసైను ఎంతో అవమానిస్తున్నారు. గవర్నర్ ను అవమానించిన వారికి పదవులు ఇస్తున్నారు. రాష్ట్రంలో కవితకు తప్ప మరే మహిళకు గౌరవం లేదు”  అని షర్మిల వ్యాఖ్యానించారు. బతుకమ్మ ముసుగులో మహిళలను కవిత  మోసం చేశారని, బతుకమ్మను తానే కనిపెట్టినట్లు వ్యవహరిస్తున్నారని షర్మిల ఫైర్​ అయ్యారు.