23 ఏళ్లయినా పూర్తికాని మహబూబ్‌నగర్ రైలు ప్రాజెక్టు

23 ఏళ్లయినా పూర్తికాని మహబూబ్‌నగర్ రైలు ప్రాజెక్టు

న్యూఢిల్లీ: ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ (మౌలిక సదుపాయాలు) ప్రాజెక్టులు విపరీతంగా ఆలస్యమవుతున్నాయని, నిర్మాణంలో జాప్యం పెరిగిపోతోందని కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన రిపోర్టు తెలిపింది. దీని ప్రకారం.. కేంద్ర రోడ్డు రవాణా  హైవేల విభాగంలో గరిష్టంగా 262 ఆలస్యమైన ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ తర్వాత రైల్వేలవి 115,  పెట్రోలియం రంగంలో 89 ప్రాజెక్టులు ఉన్నాయి. మొత్తం 835 రోడ్డు సంబంధిత ప్రాజెక్టులలో 262 ఆలస్యమవుతున్నాయి. రైల్వేలో 173 ప్రాజెక్టుల్లో 115, పెట్రోలియం 140 ప్రాజెక్టుల్లో 89 లేటవుతున్నాయి.  2022 సెప్టెంబర్  వరకు ఉన్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఈ రిపోర్టులో ఉన్నాయి. రూ.150 కోట్లు,  అంతకంటే ఎక్కువ ఖరీదు చేసే సెంట్రల్ సెక్టార్ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌‌లను పర్యవేక్షించే బాధ్యతను ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్  ప్రాజెక్ట్ మానిటరింగ్ డివిజన్ (ఐపీఎండీ) కు అప్పగించారు. ఇది స్టాటిస్టిక్స్  ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ అధీనంలో ఉంటుంది.

ఇరవై సంవత్సరాలకు పైగా మూడు రైలు ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్నాయి.  వీటిలో మునీరాబాద్–-మహబూబ్‌‌నగర్ రైలు ప్రాజెక్టు అత్యంత ఆలస్యమైన ప్రాజెక్టు. ఇది 276 నెలలు (23 సంవత్సరాలు) ఆలస్యం అయ్యింది. రెండవ అత్యంత ఆలస్యమైన ప్రాజెక్ట్ ఉధంపూర్–-శ్రీనగర్-–బారాముల్లా రైలు ప్రాజెక్ట్. ఇది 247 నెలలు ఆలస్యమైంది. మూడవ అత్యంత ఆలస్యమైన ప్రాజెక్ట్ బేలాపూర్–-సీవుడ్- అర్బన్ ఎలక్ట్రిఫైడ్ డబుల్ లైన్. ఇది 228 నెలలు ఆలస్యమైంది. మంజూరు అయినప్పుడు 173 ప్రాజెక్ట్‌‌ల అమలు  మొత్తం అసలు వ్యయం రూ.3,72,761.45 కోట్లు కాగా, ఇది తరువాత రూ.6,23,008.98  కోట్లకు పెరిగింది. ఈ ఏడాది సెప్టెంబర్ వరకు ఈ ప్రాజెక్ట్‌‌లపై చేసిన వ్యయం రూ.3,50,349.9 కోట్లు. ఈ మొత్తం  ప్రాజెక్ట్‌‌ల అంచనా వ్యయంలో 56.2శాతం. రోడ్డు రవాణాకు సంబంధించి, 835 ప్రాజెక్టులు మంజూరైనప్పుడు  అంచనా ఖర్చు రూ.4,94,300.45 కోట్లు కాగా, ఇది తరువాత రూ.5,26,481.88 కోట్లకు పెరిగింది.  సెప్టెంబర్ 2022 వరకు ఈ ప్రాజెక్ట్‌‌లపై చేసిన ఖర్చు రూ.3,21,980.33 కోట్లు. ఇది ప్రాజెక్ట్‌‌ల అంచనా వ్యయంలో 61.2శాతం.