పరాకాష్టకు చేరిన  టీఎస్పీఎస్సీ నిర్వాకం

పరాకాష్టకు చేరిన  టీఎస్పీఎస్సీ నిర్వాకం

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి నియామకాలు లేక నిరాశ, నిస్పృహలకు లోనైన లక్షలాది నిరుద్యోగ యువతకు  టీఎస్పీఎస్సీ చేతగానితనం శాపంగా తయారయింది. నోటిఫికేషన్లు ఇవ్వటం మొదలుపెట్టిన నాటి నుంచి దాదాపు 22 నోటిఫికేషన్లు న్యాయస్థానాల మెట్లెక్కినయ్. పేపర్ లీకులు, నోటిఫికేషన్​ల  రద్దు, మళ్ళీ నిర్వహణ, మళ్ళీ తప్పులు చేయటం..పరీక్ష రద్దవడం.. టీఎస్పీఎస్సీకి ఒక తమాషా అయ్యింది. తొమ్మిది లక్షల మందికి పైగా నిరుద్యోగ యువత జీవితాలతో  చెలగాటం ఆడుతున్నామనే  సోయి లేకపోయింది.  టీఎస్పీఎస్సీని గౌరవనీయ హైకోర్టు ఎన్నిసార్లు చివాట్లు పెట్టినా తన తీరు మార్చుకోక నవ్వులపాలైంది. గ్రూప్ -1 ప్రిలిమ్స్ నిర్వహణ వైఫల్యాలతో, పరీక్ష రద్దుతో ఇది పరాకాష్టకు చేరింది. 

విశ్వసనీయత కోల్పోతున్న టీఎస్పీఎస్సీ

పేపర్ లీక్ లో అభాసుపాలైన టీఎస్పీఎస్సీ రెండో సారి పరీక్ష నిర్వహించడంలోనూ అదే నిర్లక్ష్యంతో వ్యవహరించింది. పారదర్శకంగా పరీక్ష నిర్వహించటంలో అతి ముఖ్యమైన బయోమెట్రిక్ తీసుకోకుండా నోటిఫికేషన్​కు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకొంది. ఎంతమంది ప్రిలిమ్స్ రాశారో  వెల్లడించటంలో తడబాటుతో ఉన్నత న్యాయస్థానం ముందు దోషిగా నిలబడింది. ప్రిలిమ్స్ రాసే విద్యార్థులు గత అక్టోబర్ ​కంటే 50 వేల మంది తగ్గటం.. విద్యార్థుల్లో టీఎస్పీఎస్సీ తన విశ్వసనీయత కోల్పోవటం కారణంగానే జరిగింది అని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది.   బయోమెట్రిక్ అమలుకు తగిన నిధులు, సిబ్బంది లేరని న్యాయస్థానం ఎదుట వాపోయే బదులు, నోటిఫికేషన్లు ఇచ్చేముందే ఆర్థిక, మానవ వనరుల గురించి చూసుకోవాల్సిన బాధ్యత కమిషన్ దే.  

దుస్థితిలో ధనిక రాష్ట్రం

గ్రూప్ -1 నిర్వహణకు ధనిక రాష్ర్టం కోటిన్నర రూపాయలు కేటాయించలేని దుస్థితిలో ఉన్నదా? ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకోలేని, పరీక్షలు సక్రమంగా నిర్వహించటం చేతగాని పాలకమండలికి  అధికారంలో కొనసాగే అర్హత లేదని పౌర సమాజం మూకుమ్మడిగా ఆగ్రహం వెళ్ళగక్కుతున్నాయి. కింద పడ్డా పైచేయి తనదే అన్నట్టు టీఎస్పీఎస్సీ సుప్రీంకోర్టుకు వెళదామా,  ముచ్చటగా మూడో సారి ప్రిలిమ్స్ నిర్వహించడానికి ఏర్పాటు చేసుకుందామా అని ఆలోచిస్తున్నది. అంటే టీఎస్పీఎస్సీ   అభ్యర్థులకు జరిగిన అన్యాయం, నష్టం గురించి ఏ మాత్రం ఆలోచించటం లేదని తెలుస్తున్నది. ఇక నవంబర్​లో నిర్వహించాల్సిన గ్రూప్ -2పై అభ్యర్థులకు టీఎస్పీఎస్పీ పట్ల నమ్మకం ఎట్లా ఉంటుంది? 

పేపర్ ​లీకేజీనే ప్రధాన సమస్య

పేపర్ లీక్ అయినప్పుడే టీఎస్పీఎస్పీని మొత్తంగా ప్రక్షాళన చెయ్యాలని, ప్రస్తుత చైర్మన్ సహా అందరినీ తప్పించి నిజాయితీగా నిర్వహించాలనే వాదన మొదలైంది. ఆయా రంగాలలో నిపుణులతో కూడిన సలహా మండలి ఉండాలని ప్రతిపక్షాలు,  ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు ఎంతగా డిమాండ్ చేసినా ప్రభుత్వం ఖాతరు చేయలేదు. చలనం లేని బండరాయి మాదిరి మొండికేసింది. దాని ఫలితం నిరుద్యోగులు అనుభవిస్తున్నారు. పేపర్ లీకేజీనే ఈ సమస్యలన్నిటికి ప్రధాన కారణం. అయినప్పటికీ పరీక్ష పేపర్   కొన్నవాళ్లపైనే దృష్టి పెడుతున్నారే తప్ప అసలు సూత్ర దారులను తేల్చలేదు. ఇంతవరకు కేసు ముగింపునకు రాలేదు. గౌరవనీయ హైకోర్టు అంతగా అభిశంసించిన తర్వాతయినా చైర్మన్, ఇతర సభ్యులు నైతిక బాధ్యతతో రాజీనామా చేస్తారేమో అనుకున్నవాళ్లకు నిరాశ మిగిలింది. అయినా ఆవు చేలో మేస్తే,  దుడ్డె గట్టున మేస్తుందా.. ఎన్నో ఆరోపణలు  ఎదుర్కొంటున్న  ప్రజాప్రతినిధులు  నిస్సిగ్గుగా పదవుల్లో  కొనసాగుతుంటే  టీఎస్పీఎస్సీ పాలకవర్గం తీరు మరో రకంగా ఉండాలనుకోవటం అత్యాశే. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏర్పాటు చేసే నూతన టీఎస్పీఎస్సీ నిర్ణీత జాబ్ క్యాలెండర్ ద్వారా నియామకాలు పక్కాగా జరగాలి. అప్పుడైనా అన్ని పరీక్షలు సక్రమంగా నిర్వహించి, నియామక పత్రాలు అందించగలిగితేనే నిరుద్యోగుల జీవితాల్లో వెలుగు చూడగలుగుతాం. 

- మరింగంటి యాదగిరాచార్యులు 
ఆర్థిక, సామాజిక విశ్లేషకులు.