అప్పుల బాధతో రైతు దంపతుల.. ఆత్మహత్యాయత్నం

అప్పుల బాధతో రైతు దంపతుల.. ఆత్మహత్యాయత్నం
  • భర్త మృతి.. భార్య పరిస్థితి సీరియస్
  • మహబూబాబాద్ జిల్లాలో ఘటన

నెల్లికుదురు (కేసముద్రం), వెలుగు: మహబూబాబాద్ జిల్లాలో అప్పుల బాధతో రైతు దంపతులు పురుగుల మందు తాగారు. భర్త చనిపోగా, భార్య హెల్త్ కండీషన్ సీరి యస్​గా ఉందని పోలీసులు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా నారాయణపురం అనుబంధ గ్రామమైన క్యాంప్ తండాకు చెందిన ధరావత్ వీరన్న (40), లలిత (38) భార్యాభర్తలు. వీరికి తొమ్మిది, ఆరో తరగతి చదువుకునే ఇద్దరు కొడుకులు ఉన్నారు. వీరన్నకు మూడు ఎకరాల భూమి ఉంది. ఒక్కో ఎకరంలో మిర్చి, పత్తి, వరి సాగు చేశాడు. తెగుళ్ల కారణంగా మిర్చి పంట దెబ్బతిన్నది. పత్తి దిగుబడి తగ్గిపోయింది. చేతికందిన వడ్లు తుఫాన్ కారణంగా పొలంలోనే మొలకెత్తాయి.

రూ.8లక్షల అప్పు ఎలా తీర్చాలో తెలియక వీరన్న, లలిత బాధపడ్డారు. ఈనెల 8న పురుగుల మందు తాగారు. చుట్టుపక్క రైతులు గుర్తించి వారిని మహబూబాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్​కు తరలించారు. వీరన్న పరిస్థితి సీరియస్​గా ఉండటంతో అతన్ని వరంగల్ ఎంజీఎం హాస్పిటల్​కు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ బుధవారం వీరన్న చనిపోయాడు. లలిత ప్రస్తుతం మహబూబాబాద్​లో చికిత్స పొందుతున్నది. వీరన్న తండ్రి ధరావత్ లచ్చ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కేసముద్రం ఎస్​ఐ కోకిల తిరుపతి తెలిపారు.