డ్రైవర్ యముడు.. ఆడుకుంటున్న చిన్నారిపైకి లారీ ఎక్కించాడు

డ్రైవర్ యముడు.. ఆడుకుంటున్న చిన్నారిపైకి లారీ ఎక్కించాడు

ఇంటిముందు ఆడుకుంటున్న ఓ చిన్నారి పాప ప్రాణం తీసింది టిప్పర్ లారీ. సికింద్రాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధి.. బోయిన్ పల్లి హస్మత్ పేట్.. అంజయ్య నగర్ లో టిప్పర్ అదుపు తప్పి.. ఆరు ఏళ్ళ పసి పాపపైకి దూసుకెళ్లింది. AP09 Y 3186 నంబర్ ఉన్న టిప్పర్ డ్రైవర్ ను పట్టుకునేలోపే పరారయ్యాడని స్థానికులు చెప్పారు.

కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ బ్రేకులు ఫెయిలై వెనక్కి వచ్చిందని స్థానికులు చెప్పారు. అక్కడే ఆడుకుంటున్న ఆరేళ్ల చిన్నారి పైకి దూసుకొచ్చిందన్నారు. టిప్పర్ వెనకకు వస్తున్న విషయాన్ని గమనించని ఆ చిన్నారి… డ్రైవర్ నిర్లక్ష్యానికి బలైపోయిందని సాక్షులు చెప్పారు. అలాగే ఓ టాటాఏస్ బండిని.. కరెంట్ పోల్ ను ఢీకొట్టి టిప్పర్ ఆగిపోయింది. లేకపోతే మరింత నష్టం జరిగి ఉండేదన్నారు.

డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ దారుణానికి కారణమని అక్కడున్నవారు పోలీసులకు చెప్పారు. బేబీ బాడీని గాంధీ ఆస్పత్రికి పంపించారు డాక్టర్లు. చిన్నారి చనిపోవడంతో స్థానికంగా విషాదం అలుముకుంది.