‘సీతారామం’ స్టోరీలో ఒరిజినాలిటీ ఉంది

‘సీతారామం’ స్టోరీలో ఒరిజినాలిటీ ఉంది

‘మహానటి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింతగా చేరువైన దుల్కర్ సల్మాన్.. ఆ సినిమాని నిర్మించిన ‘వైజయంతి మూవీస్‌‌’ బ్యానర్‌‌‌‌లోనే ‘సీతారామం’ సినిమా చేశాడు. హను రాఘవపూడి డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఆగస్టు 5న విడుదలవుతున్న సందర్భంగా దుల్కర్ ఇలా ముచ్చటించాడు. ‘‘ప్రేక్షకులు ప్రతిదీ కొత్తగా, ఫ్రెష్‌‌గా కోరుకుంటున్నారు. అందుకే నేను ఇతర చిత్రాలతో పోలికలు లేని ఒరిజినల్‌‌ స్టోరీస్‌‌ని ఎంచు కుంటాను. ఈ స్టోరీలో ఆ ఒరిజినాలిటీ కనిపించింది. స్క్రీన్‌‌ప్లే కూడా నచ్చింది. క్లాసిక్ అవుతుందనే నమ్మకంతో సైన్ చేశాను. ఆర్మీ ఆఫీసర్‌‌‌‌ పాత్ర. అనాథ అయినప్పటికీ హ్యాపీగా లైఫ్‌‌ను లీడ్ చేసే పాజిటివ్ పర్సన్. సీతామహలక్ష్మి పాత్రలో మృణాల్  అద్భుతంగా నటించింది. తను చాలా ఎక్స్‌‌ప్రెసివ్‌‌. ఈ మూవీలో మ్యూజిక్‌‌ నాస్టాలజిక్‌‌గా ఉంటుంది. పాటలు, బ్యాగ్రౌండ్‌‌ స్కోర్ కూడా బాగా కుదిరాయి.

నా ఫేవరేట్ సాంగ్ ‘కానున్న కళ్యాణం’. షూటింగ్‌‌ మొదలైన మూడో రోజే కశ్మీర్‌‌‌‌లో ఈ పాట తీశారు. చాలా అందంగా వచ్చింది. నేను జీవితంలో చూసిన వారిలో అత్యంత పాజిటివ్ పర్సన్ అశ్వనీదత్ గారు. ఆయన బ్యానర్‌‌‌‌లో మరోసారి నటించడం హ్యాపీ. మలయాళ సినిమాలు  రియలిస్టిక్‌‌గా ఉంటాయి. కానీ నా సినిమాల్లో దాంతో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్​ని కూడా బ్యాలెన్స్ చేస్తుంటా. కెరీర్‌‌‌‌ ప్రారంభంలో నా సినిమా బాగుంటే మమ్ముట్టి గారి సెలెక్షన్, బాగోలేకుంటే దుల్కర్ సెలెక్షన్ అనేవాళ్లు. నా ప్రతి సినిమా స్టోరీనీ నాన్న (మమ్ముట్టి) విని ఓకే చేయాలంటే సాధ్యం కాదు. ఒక్కో స్టోరీ నేరేషన్‌‌కీ రెండున్నర గంటలు పడుతుంది. ఆయనుండే బిజీకి వినడం వీలుపడదు. అందుకే నాకు నచ్చిన స్టోరీని సింగిల్‌ లైన్‌లో నాన్నకి చెబుతుంటా. ఇక ప్యాన్‌‌ ఇండియా అనే పదాన్ని కొత్తగా వింటున్నాం. నిజానికి నా చిన్నప్పుడే నాన్న, అమితాబ్ గారి సినిమాల్ని ఇతర భాషల్లోనూ చూశారు.

రజినీకాంత్ గారి సినిమాలైతే జపాన్‌‌లోనూ చూశారు. నాకిదేమీ కొత్త కాన్సెప్ట్‌‌ అనిపించడం లేదు. మరి ఎందుకు అందరూ దీన్ని కొత్తగా చూస్తున్నారు! ఏ సినిమానైనా ఆ సినిమా టైటిల్‌‌తో పిలిస్తే చాలు. మరి ఈ ట్యాగ్‌‌లైన్స్ ఎందుకు? తెలుగు ప్రేక్షకులైతే నన్నెప్పుడూ సర్‌‌ప్రైజ్ చేస్తుంటారు. నా ఫస్ట్ మూవీకి ఫిల్మ్​ఫేర్ అవార్డ్‌‌ తీసుకోడానికి హైదరాబాద్‌‌ వచ్చా. ముగ్గురబ్బాయిలు వచ్చి, నా రెండో సినిమా ‘ఉస్తాద్‌‌ హోటల్’ నచ్చిందని చెప్పారు. అదెలాగంటే, గూగుల్‌‌లో బెస్ట్‌‌ ఫిల్మ్స్‌‌ ఆఫ్ ద ఇయర్ అని సెర్చ్ చేసి ఆ సినిమా చూశామన్నారు. అప్పటికి ఇంకా ఓటీటీలు కూడా రాలేదు. సినిమాలపై జెన్యూన్ ప్యాషన్ ఇలా ఉంటుందా అనిపించింది. అప్పటి నుంచి లాంగ్వేజ్‌‌ బ్యారియర్స్‌‌ లేకుండా నా సినిమాల్ని తెలుగు ప్రేక్షకులు లవ్ చేయడం చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది.