కోరుట్ల, వెలుగు: ఎయిర్ టెల్ నెట్వర్క్ సిబ్బందిని డమ్మీ తుపాకీ, కత్తులతో సెల్‌ఫోన్ వీడియో కాల్ ద్వారా బెదిరించిన ముగ్గురు సెల్ పాయింట్ షాప్ ఓనర్లను కోరుట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం సీఐ సురేశ్‌బాబు వివరాలు వెల్లడించారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో మార్త శివకుమార్, బోగ శ్రీనివాస్, అడ్డగట్ల సురేశ్ సెల్ పాయింట్ షాపులు నిర్వహిస్తున్నారు.
కోరుట్ల ఏరియాలో ఎయిర్ టెల్ నెట్వర్క్ సర్వీసెస్ నిర్వహించే ఉద్యోగులను వారు కోరుట్ల మొబైల్ షాపు అసోసియేషన్ పేరుతో బెదిరించారు. అసోసియేషన్ కు రూ.10 లక్షలు ఇవ్వాలని, లేదంటే బిజినెస్ చేయకుండా చేస్తామని తుపాకులు, కత్తులతో వీడియో కాల్ చేసి బెదిరించారు. దీంతో ఉద్యోగులు రూ.30 వేలు వారికి ఆన్లైన్లో పంపించారు.
ఈ నెల 6న డివిజనల్ డిస్ట్రిబ్యూటర్ దండబోయిన అరుణ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, ముగ్గురిపై కేసు నమోదు చేశారు. డీఎస్పీ రాములు ఆధ్వర్యంలో సీఐ సురేశ్ బాబు, ఎస్సై చిరంజీవి రెండు టీమ్‌లుగా ఏర్పడి నిందితులు శివకుమార్, శ్రీనివాస్, సురేశ్‌ను అదుపులోకి తీసుకొని, ఎయిర్ గన్ రైఫిల్, ఎయిర్ గన్ పిస్టల్, తల్వార్, 3 చిన్న కత్తులు, 3 సెల్ఫోన్లుస్వాధీనం చేసుకున్నారు.
