
న్యూఢిల్లీ: క్విక్ కామర్స్ స్టార్టప్ డంజో తన ఉద్యోగుల ఖాతాలన్నింటినీ గూగుల్ సూట్(బిజినెస్ ప్రొఫెషనల్ సాఫ్ట్‌వేర్) నుంచి జోహో వర్క్‌స్పేస్‌కి మార్చింది. ఫలితంగా ఖర్చులను మూడో వంతు తగ్గించుకుంది. ఎంటర్‌ప్రైజ్ ప్లాన్ కింద గూగుల్ వర్క్స్పేస్కు ప్రతి నెలా ఒక ఉద్యోగి కోసం దాదాపు రూ. 1,600 చెల్లించాలి. ఇవే రకమైన సేవల కోసం జోహో రూ. 489 మాత్రమే వసూలు చేస్తుంది. డంజో ప్రతినిధి ఈ విషయంపై మాట్లాడుతూ ఇది సాధారణ వ్యాపార నిర్ణయం మాత్రమే అని అన్నారు.
మొదటి రెండు రోజులలో కొన్ని సమస్యలు వచ్చినా ఇప్పుడు అవన్నీ పరిష్కారమయ్యాయని వివరించారు. 2023 ఆర్థిక సంవత్సరంలో నికర నష్టం రూ. 1,802 కోట్లకు చేరిన తర్వాత కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. నష్టం గత సంవత్సరంతో పోలిస్తే 288 శాతం పెరిగింది. దీంతో సంస్థ పొదుపు చర్యలను పెంచింది. బెంగళూరు ఆఫీసును ఖాళీ చేసింది. ఉద్యోగుల సంఖ్యను సగానికి తగ్గించింది. జీతాలను ఆలస్యం చేయడంతో చాలా మంది ఉద్యోగులు మానేశారు.