ఆపరేషన్ సిందూర్పై చర్చ సమయంలోనే.. పహల్గాం ఉగ్రదాడి మాస్టర్ మైండ్ హతం.. పూర్తి డీటైల్స్

ఆపరేషన్ సిందూర్పై చర్చ సమయంలోనే.. పహల్గాం ఉగ్రదాడి మాస్టర్ మైండ్ హతం.. పూర్తి డీటైల్స్

ఒకవైపు పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ పై చర్చ జరుగుతుండగా.. పహల్గాం దాడికి పాల్పడిన మాస్టర్ మైండ్ ను భారత బలగాలు మట్టుబెట్టడం చర్చనీయాంశంగా మారింది. పహల్గాం దాడికి పాల్పడిన టెర్రస్టులను మట్టుబెట్టేందుకు ఆపరేషన్ మహదేవ్ చేపట్టిన బలగాలు.. సోమవారం (జులై 28) ముగ్గురు ఉగ్రవాదులను అంతం చేసింది. 

పహల్గాం దాడికి మాస్టర్ మైండ్ తో పాటు మరో ఇద్దరినీ కలిపి మొత్తం ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి కేంద్ర బలగాలు. లష్కర్ కమాండర్ సులేమాన్ షా అలియాస్ ముసా ఫౌజీ పహల్గాం దాడుల వెనుకు కీలక సూత్రదారి అని సైన్యం తెలిపింది. పహల్గాం దాడిలో 26 మంది భారత పౌరులు చనిపోయిన విషయం తెలిసిందే. 

ముసా గతంలో కూడా పలు ఉగ్ర కార్యకలాపాలలో నిందితుడు. గత సంవత్సరం శ్రీనగర్-సోన్మార్గ్ Z-మోర్త్ సొరంగం నిర్మాణ సమయంలో ఏడుగురు కార్మికులను చంపిన కేసులో నిందితుడు. ఆర్మీ, జమ్మూ కశ్మీర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ లో ఈ ముగ్గురు హతమయ్యారు. ఆపరేషన్ మహదేవ్ సందర్భంగా.. ఉగ్రవాదుల నుంచి 17 గ్రెనేడ్ బాంబులు, AK-47 రైఫిల్స్ స్వాధీనం చేసుకున్నారు. 

►ALSO READ | మోదీ పాలనలో ఉగ్రదాడులు పెరిగాయి.. కశ్మీర్ నాశనమయ్యింది.. పహల్గాం దాడి ప్రభుత్వ వైఫల్యమే

ఆపరేషన్ మహదేవ్ లో భాగంగా సోమవారం (జూలై 28) శ్రీనగర్‌లోని దచిగామ్ నేషనల్ పార్క్ దగ్గర హర్వాన్-లిద్వాస్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారం మేరకు ఆర్మీ, సీఆర్‎పీఎఫ్, స్థానిక పోలీసులు కలిసి జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. భద్రతా దళాలు కార్డెన్ సెర్చ్ చేస్తుండగా ఉగ్రవాదులు కంటబడ్డారు. వెంటనే ముగ్గురు ఉగ్రవాదులను భారత సైన్యం చుట్టుముట్టింది. దీంతో భారత బలగాలపై కాల్పులు జరిపారు ఉగ్రమూకలు. ఇండియన్ ఆర్మీ కూడా కౌంటర్ ఫైరింగ్ జరిపింది.


ఇరువర్గాల మధ్య భీకరంగా కాల్పులు జరిగాయి. భద్రతా దళాల కాల్పుల్లో ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారు. ఎన్ కౌంటర్లో చనిపోయిన ఉగ్రవాదులు పహల్గామ్ ఉగ్రవాద దాడితో సంబంధం ఉన్నవారని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.  పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్‎పై సోమవారం (జూలై 28) పార్లమెంట్లో చర్చ జరగబోతున్న తరుణంలో పహల్గాం టెర్రర్ ఎటాక్ నిందితులను భద్రతా దళాలు మట్టుబెట్టడం గమనార్హం.