రావణ వాహనంపై ఆది దంపతులు

రావణ వాహనంపై ఆది దంపతులు
  • చంద్రఘంట రూపంలో దర్శనం ఇచ్చిన అమ్మవారు 
  • శ్రీశైలంలో ఘనంగా దసరా ఉత్సవాలు

శ్రీశైలం, వెలుగు : శ్రీశైలం మహాక్షేత్రంలో దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మంగళవారం మూడో రోజు శ్రీశైలాంబ  అమ్మవారు చంద్రఘంట రూపంలో దశభుజాలతో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ రూపంలో యుద్ధానికి సిద్ధపడినట్లు అమ్మవారు కనిపించడంతో భక్తులు చంద్రఘంటా పాహిమాం అని ప్రార్థించారు. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో ఆదిదంపతులైన భ్రమరాంబమల్లికార్జున స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను రావణ వాహనంపై కూర్చోబెట్టి వేదపండితులు, అర్చకులు, వాహన అలంకర పూజలు చేశారు. అనంతరం అమ్మవారి అలంకార రూపాన్ని, రావణ వాహనాధీశులైన స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయ ప్రదక్షిణ చేయించి ప్రధానాలయ గోపురం నుంచి రథశాలకు తీసుకొచ్చారు. అక్కడ ప్రత్యేక పూజలు చేసి గ్రామోత్సవం నిర్వహించారు. రాత్రి 9 గంటల వరకు కనుల పండువగా సాగిన ఈ కార్యక్రమాన్ని భక్తులు తిలకించి పరవశించిపోయారు. ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్ రె డ్డివారి చక్రపాణిరెడ్డి, ఈఓ ఎస్.లవన్న, ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు. తదితరులు పాల్గొన్నారు.