కలెక్టర్ ఆట కోసం 29 మంది ప్రభుత్వ ఉద్యోగుల డ్యూటీ

కలెక్టర్ ఆట కోసం 29 మంది ప్రభుత్వ ఉద్యోగుల డ్యూటీ

నిర్మల్: జిల్లా కలెక్టర్ అంటే జిల్లా మొత్తానికి పాలనాధికారి. ప్రభుత్వ పథకాలను పకడ్బందీగా అమలు చేసే ఉన్నతాధికారి. జిల్లాలోని అధికార యంత్రాంగం మొత్తాన్నీ ప్రజా సేవ కోసం సమాయత్తం చేస్తూ క్షణం కూడా తీరిక లేకుండా గడిపే పబ్లిక్ సర్వెంట్. కానీ నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషార్రఫ్ ఫారూకీ మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధం. ప్రజల అవసరాల కంటే తన అవసరాలకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాడు. ప్రభుత్వ ఉద్యోగులను ప్రజల కోసం కాకుండా... తన టెన్నిస్ ఆట కోసం వినియోగించుకుంటూ తన రూటే సెపరేట్ అని నిరూపిస్తున్నాడు. ఇక వివరాల్లోకి వెళ్తే...

కలెక్టర్ ముషార్రఫ్ ప్రతి రోజు సాయంత్రం నిర్మల్ జిల్లా అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో సహచరులు, ప్రముఖులతో కలిసి టెన్నిస్ ఆడుంతుంటారు. ఇక కలెక్టర్ ఆట కోసం రోజుకు ముగ్గురు చొప్పున మొత్తం 21 మంది వీఆర్ఏలకు డ్యూటీలు వేశారు. అంతే కాకుండా కలెక్టర్ ఆట కోసం వీఆర్ఏలు సరిగా పని చేస్తున్నారా లేదా అని తెలుసుకోవడానికి మరో 7మంది వీఆర్వోలను నియమించారు. వీళ్లందరి  పని తీరును పరిశీలించడానికి ఓ వర్క్ ఇన్స్పెక్టర్ కు ప్రత్యేక బాధ్యతలు అప్పజెప్పారు. ప్రతి రోజు సాయంత్రం ఐదున్నరకు వీరందరూ కచ్చితంగా టెన్నిస్ గ్రౌండ్ లో ఉండాల్సిందే. లేకుంటే కఠిన చర్యలు ఉంటాయి. ఇలా మొత్తం 29 మంది ప్రభుత్వ ఉద్యోగులు కలెక్టర్ ఆట కోసం విధులు నిర్వహిస్తున్నారు.

ఇదంతా ఏదో అనధికారికంగా జరుగుతందనుకుంటే పొరబాటే. సాక్షాత్తు స్థానిక  తహశీల్దార్  శివప్రసాద్ స్వయంగా వీళ్లందరికీ కలెక్టర్ ఆట కోసం విధులు నిర్వహించాలని ఆర్డర్ పాస్ చేశాడు. ఇక కలెక్టర్ వ్యవహార తీరును ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు. తన ఆట కోసం ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించుకోవడం సరికాదని హితవు పలుకుతున్నారు. ఇక కలెక్టర్ ముషార్రఫ్ ఫారూకీ వ్యవహార శైలి మొదటి నుంచి వివాదాస్పదమే. కరోనా సమయంలో మాస్క్ లేకుండా తిరగడం, హెల్మెట్ లేకుండా బైక్ నడపడం, రైతులపై ఆగ్రహం వ్యక్తం చేయడం వంటి విమర్శలున్నాయి. ఇప్పుడు తన ఆట కోసం ఏకంగా 29మంది ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా ప్రోటోకాల్ ప్రకారమే వీఆర్ఏ, వీఆర్వో, ఆర్ఐలకు డ్యూటీలు వేశామని తహశీల్దార్ శివప్రసాద్ చెబుతుండటం కొసమెరుపు.

ఇవి కూడా చదవండి...

ఎల్లుండి నుంచి వడ్ల కొనుగోళ్లు ప్రారంభం

అక్బరుద్దీన్పై నమోదైన కేసుల కొట్టివేత