ఫోన్​​ యాప్​లో ఒక్క క్లిక్​తో కావాల్సింది తెచ్చిస్తారు డెలివరీ బాయ్స్

ఫోన్​​ యాప్​లో ఒక్క క్లిక్​తో కావాల్సింది తెచ్చిస్తారు డెలివరీ బాయ్స్

కుండపోత వాన కొడుతున్నా వేడి వేడి బిర్యానీ ఇంటికి తెచ్చిస్తారు.
మండుటెండలో ఐస్‌‌ క్రీమ్‌‌ తినాలనిపించినా నిమిషాల్లో తీసుకొస్తారు.
ఎండ, వాన, చలి... వాతావరణం ఎలా ఉన్నా .. ఆర్డర్‌‌‌‌ పెట్టిన కొద్దిసేపట్లోనే తిండి దగ్గర్నించి.. సరుకుల వరకు కావాల్సిన ప్రతి ఒక్కటీ ఇంటి గుమ్మం ముందుకు చేరుస్తారు. చిన్నప్పుడు కథల్లో అల్లావుద్దీన్​ అద్భుతదీపాన్ని రుద్దితే జీనీ ప్రత్యక్షమై కోరుకున్నది ఇచ్చాడని చదువుకున్నాం కదా! అలానే మొబైల్​ ఫోన్​​ యాప్​లో ఒక్క క్లిక్​తో మనకు కావాల్సింది తెచ్చిస్తారు డెలివరీ బాయ్స్​. వాళ్ల​ లైఫ్​ గురించి ఈ వారం కవర్​ స్టోరీ.

గత పదేండ్లలో మన దేశంలో జరిగిన అతిపెద్ద డెవలప్‌‌‌‌మెంట్స్‌‌‌‌లో ఇ–-కామర్స్ బిజినెస్‌‌‌‌ ఒకటి. ఇ– కామర్స్‌‌‌‌ కంపెనీలు ఈ పదేండ్లలో చాలా డెవలప్‌‌‌‌ అయ్యాయి. అమెజాన్, ఫ్లిప్‌‌‌‌కార్ట్, బిగ్ బాస్కెట్, జియో మార్ట్, జొమాటో, స్విగ్గీ లాంటి కంపెనీలు ఇండియాలో వ్యాపారం చేసే విధానాలను, వస్తువులను కొనే పద్ధతులను మార్చేశాయి. అందుకే ఈ కంపెనీల ఫౌండర్స్‌‌‌‌ కోట్లకు కోట్లు సంపాదించారు. వాటిలో పెట్టుబడి పెట్టిన కంపెనీలకు కూడా చాలానే  లాభాలొచ్చాయి.  అయితే, కంపెనీల సక్సెస్‌‌‌‌కు రెండు కారణాలున్నాయి. ఒకటి వాళ్ల ఐడియా కాగా రెండోది ‘డెలివరీ బాయ్స్‌‌‌‌’. ఈ కంపెనీల్లో పనిచేస్తున్నవాళ్లలో దాదాపు 95 శాతం మంది డెలివరీ బాయ్స్‌‌‌‌ ఉన్నారు. అంతెందుకు కేవలం ఫుడ్‌‌‌‌ డెలివరీ ఫ్లాట్‌‌‌‌ఫామ్స్‌‌‌‌లోనే దేశ వ్యాప్తంగా కొన్ని లక్షల మంది పనిచేస్తున్నారు. 

కొవిడ్‌‌‌‌ తర్వాత ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో షాపింగ్‌‌‌‌ చేయడం విపరీతంగా పెరిగింది. ఇది కూడా ఇ–కామర్స్ రంగం డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌కి కారణమైంది. ఈ పరిస్థితుల్ని అవకాశాలుగా మార్చుకుని ఎంతోమంది ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రెనూర్స్‌‌‌‌ పుట్టుకొచ్చారు. దాంతో ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ డెలివరీ సిస్టమ్‌‌‌‌ అంచెలంచెలుగా డెవలప్‌‌‌‌ అవుతూ వచ్చింది. కొంతమంది ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రెనూర్స్‌‌‌‌ కోట్లకు కోట్లు సంపాదించి మార్కెట్‌‌‌‌లో సత్తా చాటారు. అయితే.... వాళ్ల సక్సెస్‌‌‌‌ ప్రయాణంలో భాగంగా చాలామందికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించారు. అలా క్రియేట్‌‌‌‌ అయిన జాబ్స్‌‌‌‌ కూడా ఎక్కువగా డెలివరీ రంగంలోనే ఉన్నాయి. పదో తరగతి కూడా చదవని వాళ్ల నుంచి నుంచి పోస్ట్‌‌‌‌ గ్రాడ్యుయేషన్​ చేసివాళ్ల వరకు ఎంతోమంది డెలివరీ రంగంపై ఆధారపడి బతుకుతున్నారు. వాళ్లలో కొందరికి మంచి జీతం ఉన్నా సొసైటీలో పెద్దగా రెస్పెక్ట్‌‌‌‌ ఉండడంలేదు. ఇంకొందరికి అయితే.. రెస్పెక్ట్‌‌‌‌తోపాటు సరైన జీతం కూడా దొరకడంలేదు. ‘మరి అలాంటప్పుడు ఈ ఫీల్డ్‌‌‌‌కి ఎందుకొచ్చార’ని అడిగితే.. తప్పని పరిస్థితుల్లో అనే సమాధానమే ఎక్కువమందిది. 

అంతా ఆన్‌‌‌‌లైన్‌‌‌‌

ఇప్పుడు ఏది కొనాలన్నా ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లోనే సెర్చ్‌‌‌‌ చేస్తున్నారు. ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌‌‌‌ నుంచి గ్రాసరీస్‌‌‌‌, మాంసం లాంటివన్నీ ఆర్డర్‌‌‌‌‌‌‌‌ చేసిన క్షణాల్లో ఇంటికొస్తున్నాయి. పెద్ద పెద్ద సిటీలతోపాటు టౌన్‌‌‌‌లలో కూడా ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ మార్కెట్లు వెలిశాయి. వాటిలో కొన్ని వేలమంది పనిచేస్తున్నారు. వాళ్లలో చాలామంది డ్యూటీలో భాగంగా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఎన్నో ప్రయాసలకు ఓర్చి మనకు కావాల్సింది ఇంటికి తీసుకొచ్చి ఇచ్చినా.. సొసైటీలో కొందరు వాళ్లను కనీసం మనుషులుగా కూడా గుర్తించడంలేదు. ఎక్కువ పని గంటలు, జాబ్‌‌‌‌ సెక్యూరిటీ లేకపోవడం, తక్కువ జీతం.. ఇలాంటి ఎన్నో సమస్యలు వాళ్లను వెంటాడుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌‌‌‌ లాంటి మెట్రో సిటీల్లో టైంకి ఆర్డర్లు డెలివరీ చేయడమంటే పెద్ద టాస్క్ అనే చెప్పాలి. ట్రాఫిక్‌‌‌‌ జామ్‌‌‌‌లో ఇరుక్కుపోయి ఉంటే.. కస్టమర్లు తమ ఆర్డర్‌‌‌‌ల స్టేటస్ తెలుసుకోవడానికి అదే పనిగా కాల్స్‌‌‌‌ చేస్తూనే ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా కొందరు దాదాపు 12 గంటల కంటే ఎక్కువ టైం డ్యూటీ చేస్తున్నారు. 

ఇదే ఎందుకు? 

ఎన్నో సమస్యలు ఉంటాయని తెలిసినా ఈ ఉద్యోగాల్లో చేరడానికి కారణం ఏంటంటే.. ఈ ఉద్యోగానికి పెద్ద చదువు అక్కర్లేదు. పైగా కాస్త ఎక్కువ కష్టపడితే బతకడానికి సరిపోయేంత జీతం వస్తుంది. బయట చూస్తే ఎంత చదువుకున్నా ఉద్యోగ అవకాశాలు దొరకట్లేదు. ఈ పరిస్థితుల్లో డెలివరీ బాయ్స్‌‌‌‌గా చేరుతున్నారు. పైగా ఈ జాబ్ చేయడానికి పెద్దగా స్కిల్స్‌‌‌‌ కూడా అవసరం లేదు. డ్రైవింగ్‌‌‌‌ లైసెన్స్ ఉండి, బైక్ నడపడం వస్తే సరిపోతుంది. కొన్నేండ్ల నుంచి ఇండియాలో నిరుద్యోగం బాగా పెరిగిపోయింది. దాంతో ఎక్కువమంది షార్ట్ టర్మ్‌‌‌‌ కాంట్రాక్ట్స్‌‌‌‌, ఫ్రీలాన్స్ పనులు వెతుక్కుంటున్నారు. ప్రస్తుతం ఇండియాలో కొన్ని మిలియన్ల మంది ఇలాంటి ఉద్యోగాల్లోనే చేరారు. ఈ కేటగిరీలో ముందువరుసలో ఉంటుంది డెలివరీ బాయ్‌‌‌‌ జాబ్‌‌‌‌. 

గంటలు.. ఆర్డర్లు.. 

ప్రాంతాన్ని బట్టి డెలివరీ బాయ్స్ జీతాలు, ఇన్‌‌‌‌సెంటివ్స్‌‌‌‌ ఉంటాయి. పెద్ద పెద్ద సిటీల్లో ఒకలా, చిన్న సిటీల్లో ఒకలా ఉంటాయి. కంపెనీలను బట్టి కూడా జీతం మారుతుంటుంది. ఒక కంపెనీ గంటల లెక్కన జీతం ఇస్తే, మరో కంపెనీ ఆర్డర్‌‌‌‌‌‌‌‌ లెక్కన ఇస్తుంది. కొన్ని కంపెనీలు ప్రతి నెలా కొంత శాలరీ ఇస్తుంటాయి. కొన్ని పెద్ద కంపెనీలు ఒక ఆర్డర్‌‌‌‌ డెలివరీ చేసినందుకు 40 రూపాయలు ఇస్తాయి. కిలోమీటర్లు పెరిగిన కొద్దీ ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొన్ని కంపెనీలు 15 రూపాయలకు ఒక డెలివరీ లెక్కన ఇస్తాయి. కాకపోతే వీళ్లకు ఒకే ఏరియా కేటాయిస్తారు. కొన్ని కంపెనీలు డెలివరీకి 20 రూపాయలు, రెస్టారెంట్‌‌‌‌లో వెయిటింగ్‌‌‌‌కు మరో ఇరవై రూపాయలు మినిమం ఇస్తుంటాయి. మరికొన్ని కంపెనీల్లో టార్గెట్లు ఇస్తారు. అవి పూర్తి చేస్తే ఎక్స్‌‌‌‌ట్రాగా ఇన్‌‌‌‌సెంటివ్స్‌‌‌‌ ఇస్తారు. కొన్ని పెద్ద కంపెనీల లాజిస్టిక్ విభాగాల్లో పనిచేసే డెలివరీ బాయ్స్‌‌‌‌కు ఫీఎఫ్‌‌‌‌, ఈఎస్‌‌‌‌ఐ సౌకర్యం కూడా కల్పిస్తున్నాయి. వీళ్లకు ప్రతి నెలా ఫిక్స్‌‌‌‌డ్‌‌‌‌ శాలరీతో పాటు పెట్రోల్‌‌‌‌, మొబైల్ బిల్‌‌‌‌ అలవెన్స్‌‌‌‌లు ఉంటాయి. వారంలో ఒక రోజు మాత్రమే వీక్లీఆఫ్‌‌‌‌ తీసుకుని, లీవ్‌‌‌‌లు పెట్టకుండా నెలంతా పనిచేస్తే అదనంగా కొంత మొత్తాన్ని జీతంతో కలిపి ఇస్తారు. కాకపోతే ప్రతిరోజు ఇన్ని డెలివరీలు చేయాలనే మినిమం టార్గెట్లు ఉంటాయి. ఇలా ఒక్కో కంపెనీకి ఒక్కో రకమైన విధానాలు, శ్లాబులు ఉంటాయి. కొన్ని కంపెనీలు బాగానే జీతాలు ఇస్తున్నా.. మరికొన్ని మాత్రం పనిగంటలకు సరిపడా డబ్బులు ఇవ్వడం లేదు. అయితే.. ఇప్పుడు చాలామంది ఈ జాబ్స్ చేయడానికి ముందుకు వస్తుండడంతో కొన్ని కంపెనీలు తక్కువ ఇన్‌‌‌‌సెంటివ్స్‌‌‌‌ ఇస్తున్నాయి. 

రకాలున్నాయి

కొన్ని ఫుడ్ డెలివరీ కంపెనీలు మాత్రం మూడు రకాలుగా ఇన్‌‌‌‌సెంటివ్స్‌‌‌‌ ఇస్తున్నాయి.  పీక్‌‌‌‌ అవర్స్‌‌‌‌లో, రాత్రి 11 గంటలు దాటిన తర్వాత, వర్షం కురిసేటప్పుడు, వీకెండ్స్‌‌‌‌లో పనిచేస్తే కొంత మొత్తాన్ని ఇన్‌‌‌‌సెంటివ్స్‌‌‌‌ రూపంలో ఇస్తున్నాయి. కానీ.. ఇలా ఇన్‌‌‌‌సెంటివ్స్‌‌‌‌కి అర్హత పొందాలంటే రోజుకు 12 గంటలకుపైగా రోడ్డుపైనే ఉండాలి. అంటే బతకడానికి సరిపోయేంత డబ్బు వస్తున్నా.. పని మాత్రం చాలా ఎక్కువ టైం చేయాల్సి వస్తుంది. ‘‘ఇన్‌‌‌‌సెంటివ్స్‌‌‌‌ వస్తే బాగానే డబ్బు వస్తుంది. కానీ.. అలా రావాలంటే రోజులో ఎక్కువసేపు డ్యూటీలోనే ఉండాలి. అందువల్ల ఫ్యామిలీతో గడపడానికి టైం ఇవ్వలేకపోతున్నా. పిల్లలతో కాసేపు సరదాగా కబుర్లు చెప్పడానికి కూడా టైం దొరకట్లేదు. ఇన్‌‌‌‌సెంటివ్స్‌‌‌‌ రాకపోయినా పర్వాలేదు అనుకుంటే.. వచ్చే జీతం సరిపోవడంలేదు” అని ఢిల్లీకి చెందిన ఫుడ్‌‌‌‌ డెలివరీ బాయ్‌‌‌‌ రోహిత్‌‌‌‌ అన్నాడు. 

టిప్‌‌‌‌లు తక్కువే

హోటల్‌‌‌‌లో తింటే అయ్యే ఖర్చుతో పోలిస్తే.. ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో ఆర్డర్ పెట్టుకుని తింటే అయ్యే ఖర్చు చాలా ఎక్కువ. ముంబైకి చెందిన రాహుల్‌‌‌‌ ‘ది మోమో ఫ్యాక్టరీ’ అనే రెస్టారెంట్‌‌‌‌ నుంచి జొమాటోలో ఫుడ్ ఆర్డర్ పెట్టాడు. డిస్కౌంట్ పోనూ అతనికి 690 రూపాయలు బిల్‌‌‌‌ అయింది. అదే ఫుడ్‌‌‌‌ రెస్టారెంట్‌‌‌‌కి వెళ్లి తెచ్చుకున్నాడు. అతనికి 512 రూపాయలు అయింది. అంటే దాదాపు 178 రూపాయలు ఎక్కువైంది. దాంతో ఆఫ్‌‌‌‌లైన్‌‌‌‌, ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ బిల్స్‌‌‌‌ పక్క పక్కన పెట్టి ఫొటో తీసి సోషల్‌‌‌‌ మీడియాలో పోస్ట్ చేశాడు. అది బాగా వైరల్‌‌‌‌ అయింది. ఆఫ్‌‌‌‌లైన్‌‌‌‌తో పోలిస్తే ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. అందువల్ల కస్టమర్‌‌‌‌‌‌‌‌కి అప్పటికే ఎక్కువ ఖర్చు చేశాననే ఫీలింగ్‌‌‌‌ ఉంటుంది. టిప్‌‌‌‌ ఇంకేం ఇస్తారు. “డెలివరీ యాప్‌‌‌‌ వాళ్ల ప్యాకేజింగ్, డెలివరీకి ఎక్కువగా ఛార్జ్‌‌‌‌ చేస్తున్నారు. కాబట్టి, నేను సాధారణంగా డెలివరీ చేసేవాళ్లకు టిప్ ఇవ్వను. కానీ అనుకున్న టైం కంటే ముందే ఫుడ్‌‌‌‌ డెలివరీ చేస్తే మాత్రం 20 రూపాయలు టిప్ ఇస్తా”  అని రెగ్యులర్‌‌‌‌‌‌‌‌గా యాప్స్‌‌‌‌లో ఫుడ్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌‌‌‌ పెట్టే ఒక సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌ ఇంజినీర్ చెప్పాడు. ఈ లెక్కన డెలివరీ బాయ్స్‌‌‌‌కి టిప్‌‌‌‌లపైన వచ్చే ఆదాయం కూడా తక్కువే. 

..వాళ్లే సమస్య!

కస్టమర్ల వల్లే వీళ్లకు జీతాలు వస్తున్నా.. వాళ్లే డెలివరీ బాయ్స్‌‌‌‌కు పెద్ద సమస్యలా ఉంది. చాలామంది డెలివరీ బాయ్స్‌‌‌‌ని ఇబ్బందులకు గురి చేస్తుంటారు. ప్రామిస్‌‌‌‌ చేసిన టైంకి డెలివరీ ఇవ్వకపోతే డెలివరీ పర్సన్స్‌‌‌‌ని తిడుతుంటారు. కనీసం ఆ ఆలస్యానికి కారణం కూడా తెలుసుకోకుండా విసుక్కుంటారు. తక్కువ రేటింగ్‌‌‌‌ ఇస్తుంటారు. చాలా తక్కువమంది మాత్రమే ఆలస్యానికి కారణం తెలుసుకుని, అర్థం చేసుకుంటారు. ఐదేళ్ల నుంచి ఫుడ్‌‌‌‌ డెలివరీ బాయ్‌‌‌‌గా పార్ట్‌‌‌‌టైమ్‌‌‌‌ వర్క్‌‌‌‌ చేస్తున్న విశాల్ మాట్లాడుతూ.. “చాలామంది కస్టమర్లు టైంకి ఇంటికి చేరుకోకపోతే అసభ్యంగా ప్రవర్తిస్తారు. కొందరు లొకేషన్‌‌‌‌ కోసం కాల్‌‌‌‌ చేసినా విసుక్కుంటారు. ఇంకొందరైతే ‘మేము మీకు ఎలాంటి సాయం చేయలేం. యాప్‌‌‌‌లో పెట్టిన లొకేషన్‌‌‌‌లోకి ఫుడ్‌‌‌‌ తీసుకురండి. లేదంటే వెళ్లిపోండి’ అంటారు. అలాంటప్పుడు రోడ్డు వెంట వెళ్లేవాళ్లను డైరెక్షన్స్‌‌‌‌ అడిగి లొకేషన్‌‌‌‌కు వెళ్తాం. ఇలాంటప్పుడు కాస్త లేట్‌‌‌‌ అవుతుంది. ఆ ఆలస్యం మా ఆదాయాన్ని తగ్గిస్తుంది” అని చెప్పాడు. 

అలా కూడా ఆదాయం తగ్గుతుంది

ఇలాంటివే కాదు.. కమ్యూనికేషన్‌‌‌‌ సరిగా లేకపోవడం వల్ల కూడా డెలివరీ బాయ్స్‌‌‌‌ పొరపాట్లు చేసి ఇబ్బంది పడుతుంటారు. ముంబైకి చెందిన ఒక వ్యక్తి యాప్‌‌‌‌లో ఫుడ్‌‌‌‌ ఆర్డర్ పెట్టాడు. అతడు అద్దె ఇంట్లో ఉంటున్నాడు. డెలివరీ బాయ్‌‌‌‌ లొకేషన్‌‌‌‌కి వెళ్లిన తర్వాత కస్టమర్‌‌‌‌‌‌‌‌ ఫోన్‌‌‌‌కి సిగ్నల్‌‌‌‌లేక కాల్‌‌‌‌ కనెక్ట్‌‌‌‌ కాలేదు. దాంతో యాప్‌‌‌‌లో ఇచ్చిన అడ్రస్‌‌‌‌లో ఫుడ్‌‌‌‌ డెలివరీ చేశాడు. ఆ ఆర్డర్‌‌‌‌‌‌‌‌ని ఇంటి ఓనర్‌‌‌‌‌‌‌‌ తీసుకున్నాడు. వెంటనే కస్టమర్‌‌‌‌‌‌‌‌కి ఆర్డర్ డెలివరీ అయిందని మెసేజ్ వచ్చింది.  దాంతో కస్టమర్ కేర్‌‌‌‌కు కాల్ చేసి కంప్లైంట్‌‌‌‌ చేశాడు అతను. వాళ్లు డెలివరీ బాయ్‌‌‌‌కి ఫోన్‌‌‌‌ కనెక్ట్‌‌‌‌ చేశారు. అతనేమో సరైన అడ్రస్‌‌‌‌లోనే డెలివరీ చేశానన్నాడు. కానీ.. కస్టమర్‌‌‌‌‌‌‌‌ తనకు డెలివరీ చేయలేదని వాదించాడు. చివరికి ఆ ఫుడ్‌‌‌‌ యాప్‌‌‌‌ అతనికి అమౌంట్‌‌‌‌ని రీఫండ్ చేసింది. ఇలాంటి సందర్భాల్లో కూడా డెలివరీ బాయ్స్‌‌‌‌ ఆదాయం తగ్గుతుంది. 

కస్టమర్లకు ఆఫర్‌‌‌‌‌‌‌‌ ఇస్తేనే.. 

కొన్ని స్టార్టప్‌‌‌‌ కంపెనీలకు చాలా తక్కువ ఆర్డర్లు వస్తాయి. అలాంటప్పడు ఆ కంపెనీలు కస్టమర్లకు ఆఫర్లు ఇస్తుంటాయి. అలా ఆఫర్లు ఇచ్చినప్పుడు ఆ యాప్‌‌‌‌కి ఎక్కువ ఆర్డర్లు వస్తుంటాయి. దాంతో డెలివరీ బాయ్స్‌‌‌‌ రిక్రూట్‌‌‌‌మెంట్‌‌‌‌ని పెంచుతుంది. అలాంటప్పుడు డెలివరీ బాయ్స్‌‌‌‌కి కూడా సరిపడా డబ్బులు వస్తాయి. ఎక్కువ ఆర్డర్లు, ఎక్కువ ఇన్‌‌‌‌సెంటివ్స్‌‌‌‌ ఇస్తుంటారు. కానీ.. ఆఫర్‌‌‌‌ టైం అయిపోతే ఆర్డర్ల సంఖ్య తగ్గుతుంది. దాంతో డెలివరీ బాయ్స్‌‌‌‌ ఆదాయం కూడా తగ్గుతుంది. ‘‘ఇ–కామర్స్‌‌‌‌ బిజినెస్‌‌‌‌ చేస్తున్న ఒక పెద్ద కంపెనీ హైదరాబాద్‌‌‌‌లో గ్రాసరీ డెలివరీని మొదలుపెట్టింది. నా ఫ్రెండ్స్‌‌‌‌ కొంతమంది అందులో డెలివరీ బాయ్స్‌‌‌‌గా చేరారు.  
ఆ కంపెనీ మొదట్లో కస్టమర్లకు మంచి ఆఫర్లు ఇచ్చింది. ఆర్డర్లు చాలా వచ్చేవి. డెలివరీ బాయ్స్‌‌‌‌కి నెలకు 30 వేల రూపాయల వరకు వచ్చేవి. అది చూసి ఒక కంపెనీలో క్లర్క్‌‌‌‌గా పనిచేస్తున్న నేను ఆ ఉద్యోగం మానేసి ఇక్కడ చేరా. తీరా నేను వచ్చిన తర్వాత నెలకు కంపెనీ కస్టమర్లకు ఆఫర్లు ఇవ్వడం ఆపేసింది. ఇప్పుడు నాకు 15 వేల రూపాయలు కూడా రావడం లేదు”అని తన సమస్య చెప్పుకున్నాడు వినయ్‌‌‌‌.  

రేటింగ్‌‌‌‌ను బట్టి..

 

కొన్ని డెలివరీ కంపెనీల్లో కస్టమర్‌‌‌‌‌‌‌‌ రేటింగ్స్‌‌‌‌ కూడా డెలివరీ బాయ్‌‌‌‌ సంపాదన మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. కస్టమర్‌‌‌‌‌‌‌‌ ఎలాంటివాడైనా డెలివరీ బాయ్స్‌‌‌‌ మంచిగా నడుచుకోవాలి. వాళ్లు ఇచ్చే రేటింగ్‌‌‌‌ వల్లే డెలివరీ బాయ్స్‌‌‌‌కి ఆర్డర్లు పెరుగుతాయి. రేటింగ్‌‌‌‌ ఎక్కువగా ఉన్న వాళ్లకు ఎక్కువ ఆర్డర్లు ఇస్తారు. నెగెటివ్‌‌‌‌ రివ్యూలు వస్తే కొన్నిసార్లు ఉద్యోగాల నుంచి కూడా తీసేస్తారు. ఒక్కోసారి కస్టమర్ తప్పు చేసినా, డెలివరీ బాయ్‌‌‌‌ బాధ్యత వహించాల్సి ఉంటుంది.  

అనారోగ్యం తప్పదు

ఇండియాలోని చాలా ప్రాంతాల్లో రోడ్లు సరిగా ఉండవు. ఆ గతుకుల రోడ్ల మీద  రోజూ బైక్ నడిపితే ఆరోగ్యం దెబ్బతింటోందని కొందరు డెలివరీ బాయ్స్‌‌‌‌ అంటున్నారు. ఒక పెద్ద ఇ–కామర్స్ కంపెనీలో లాజిస్టిక్‌‌‌‌ విభాగంలో పనిచేస్తున్న డెలివరీ పర్సన్‌‌‌‌ మాట్లాడుతూ.. ‘‘బైక్‌‌‌‌లపై కస్టమర్లకు ప్యాకేజీలు అందించాలంటే.. ప్రతిరోజు బరువులు మోయాల్సి వస్తోంది. రోజూ ఒక పెద్ద క్యారియర్ బ్యాగ్‌‌‌‌ని భుజాన వేసుకుని ఆఫీస్‌‌‌‌ నుంచి వెళ్తాం. గతుకుల రోడ్ల మీద బైక్‌‌‌‌తోపాటు బ్యాగ్‌‌‌‌ని కూడా బ్యాలెన్స్ చేయాలి. మొదట్లో ఎక్కువ డబ్బులు వస్తాయని రోజుకు రెండు మూడు బ్యాగుల ప్యాకేజీలు డెలివరీ చేసేవాడిని. బ్యాగు బరువు సుమారు పాతిక నుంచి ముప్పై కిలోల వరకు ఉంటుంది. దాన్ని భుజాన వేసుకుని రోజుకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్లు తిరిగేవాడిని. దాంతో డబ్బుతోపాటు నడుము నొప్పి కూడా వచ్చింది. ఇప్పుడు ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ కోసం ప్రతి నెలా కొంత ఖర్చు చేయాల్సి వస్తోంది. 

రాత్రుల్లో కష్టమే!

కొందరు రాత్రుల్లో తాగి ఫుడ్ ఆర్డర్‌‌‌‌‌‌‌‌ పెడుతుంటారు. తాగిన మత్తులో లొకేషన్‌‌‌‌ సరిగ్గా పెట్టరు. ఒక అడ్రస్‌‌‌‌లో ఉండి, మరో అడ్రస్‌‌‌‌కు డెలివరీ రిక్వెస్ట్ పెడుతుంటారు. అలాంటప్పుడు డెలివరీ బాయ్స్ లొకేషన్‌‌‌‌కి వెళ్లి కాల్‌‌‌‌ చేస్తే తను చెప్పిన అడ్రస్‌‌‌‌కి రావాలని దబాయిస్తారు. అయినా.. అతను ఉన్న అడ్రస్‌‌‌‌కి ఫుడ్ తీసుకెళ్లి ఇస్తే.. అక్కడ కూడా సతాయిస్తుంటారు. 

పట్టణాల్లో కూడా కాంపిటీషన్‌‌‌‌

పట్టణాల్లోకి ఆన్​లైన్​​ ఫుడ్​ డెలివరీ సర్వీస్‌‌‌‌లు వచ్చిన తర్వాత చాలా హోటళ్లు, షాపులు యాప్స్‌‌‌‌తో టైఅప్‌‌‌‌ అవుతున్నాయి. గ్రాసరీ​, వెజిటబుల్స్​, మాంసం, స్టేషనరీ ఇలా దాదాపు అన్నింటినీ ఇంటికే డెలివరీ చేస్తున్నాయి. అవసరాన్ని బట్టి పని చేసే డెలివరీ బాయ్స్​ని రిక్రూట్‌‌‌‌ చేసుకుంటున్నాయి.  అయితే.. కొన్ని యాప్స్‌‌‌‌లో మాత్రం ప్రత్యేకంగా టార్గెట్స్‌‌‌‌ ఉంటాయి. స్విగ్గీ, జొమాటో లాంటి పెద్ద ఫుడ్ డెలివరీ యాప్స్‌‌‌‌లో మాత్రం ప్రత్యేకంగా టార్గెట్స్​ ఉండవు. వాళ్లకు ఇచ్చే ఆర్డర్స్‌‌‌‌ని బట్టి కమీషన్​ ఇస్తుంటారు. పెద్ద హోటల్‌‌‌‌లో ఫుడ్​ ఆర్డర్​ చేస్తే ఒక రకంగా, చిన్న హోటల్‌‌‌‌లో ఆర్డర్​ చేస్తే ఒక రకంగా కమీషన్​ ఇస్తారు. డెలివరీ బాయ్స్‌‌‌‌కి వీకెండ్స్‌‌‌‌లో పేమెంట్ చేస్తున్నారు. చిన్న సిటీల్లో ఒక్కొక్కరు నెలకు 10 వేల రూపాయల నుంచి 15 వేల రూపాయల వరకు సంపాదిస్తున్నారు. శుక్ర, శని, ఆదివారాల్లో ఎక్కువ ఆర్డర్లు వస్తుంటాయి. అయితే.. ఇదివరకటితో పోలిస్తే ఇప్పుడు డెలివరీ బాయ్స్ సంఖ్య బాగా పెరిగింది. దాంతో ఆర్డర్లు తగ్గిపోతున్నాయి. 

ఎన్నో సమస్యలు

ఫుడ్‌‌‌‌ డెలివరీ వల్ల అప్పుడప్పుడు కొన్ని అనుకోని సమస్యలు కూడా ఎదురవుతుంటాయి. అన్నింటినీ ఫేస్‌‌‌‌ చేయగలగాలి. వీలైనంత తక్కువ టైంలో ఆర్డర్‌‌‌‌‌‌‌‌ డెలివరీ చేస్తే ఎక్కువ ఇన్‌‌‌‌సెంటివ్స్‌‌‌‌ వస్తాయి. అందుకే హైదారాబాద్‌‌‌‌లో ఒక డెలివరీ బాయ్‌‌‌‌ తక్కువ టైంలో డెలివరీ చేయాలి అనుకున్నాడు. అతనికి గచ్చిబౌలిలోని ఒక హోటల్‌‌‌‌ నుంచి ఆర్డర్‌‌‌‌‌‌‌‌ వచ్చింది. దాంతో ఆ హోటల్‌‌‌‌కి వెళ్లి, ఫుడ్‌‌‌‌ ప్యాక్‌‌‌‌ చేసి ఇవ్వాలని సిబ్బందిని అడిగాడు. వాళ్లు కాసేపు వెయిట్‌‌‌‌ చేయాలని అతనికి చెప్పారు. అరగంట తర్వాత కూడా వాళ్లు ఫుడ్ ఇవ్వకపోవడంతో.. ఆలస్యం అవుతోందని, దాని వల్ల అతని రేటింగ్‌‌‌‌ తగ్గుతుందని.. హోటల్ యజమానిని కాస్త గట్టిగా అడిగాడు. దాంతో హోటల్ యజమాని, సిబ్బంది కలిసి డెలివరీ బాయ్‌‌‌‌ని కొట్టారు. అతనికి అండగా వచ్చిన కొంతమంది డెలివరీ బాయ్స్‌‌‌‌పై కూడా దాడి చేశారట. 

నష్టం వస్తే భరించాలి

ఐదేండ్ల నుంచి డెలివరీ బాయ్‌‌‌‌గా  పనిచేస్తున్నా. మొదట్లో 12వేల రూపాయల వరకు జీతం ఇచ్చేవాళ్లు. ఇప్పుడు 15వేల రూపాయలు ఇస్తున్నారు. అందులో నుంచే పిఎఫ్ కట్‌‌‌‌ అవుతుంది. బీటెక్‌‌‌‌లో కొన్ని సబ్జెక్టులు ఫెయిల్ కావడం వల్ల డెలివరీ బాయ్‌‌‌‌గా చేరా. వేరే జాబ్స్ కంటే  బాగానే ఉంది. కాకపోతే, వస్తువులు తీసుకువెళ్లేటప్పుడు కింద పడిపోతే.. ఆ నష్టాన్ని నేనే భరించాల్సి వస్తుంది.
– సాయి కిరణ్, బోధన్

నైట్ ఆర్డర్లు వస్తేనే పరేషాన్

మాకు నెలనెలా జీతాలుండవు. ఆర్డర్స్‌‌‌‌ని బట్టి వారానికోసారి డబ్బులు ఇస్తారు. కరోనా టైంలో చాలా డెలివరీలు చేసేవాళ్లం. ఇప్పుడు చాలా తగ్గిపోయాయి. ఇప్పుడు డైలీ 550 రూపాయల నుంచి 600 వరకు వస్తున్నాయి. వీకెండ్స్‌‌‌‌లో  900 రూపాయలవరకు వస్తాయి. పనిలో ఎవరి ప్రెజర్ ఉండదు. ప్రైవేట్‌‌‌‌ సెక్టార్‌‌‌‌‌‌‌‌లో జాబ్‌‌‌‌ చేయడం కంటే ఈ జాబ్స్ చాలా బెటర్. కాకపోతే.. నైట్ టైం వచ్చే ఆర్డర్లను డెలివరీ చేయడమే కొంచెం ప్రాబ్లం. డ్రింకర్స్ ఎక్కువగా సతాయిస్తుంటారు. 
– పట్టి రమేశ్, పాలమూరు

అమ్మకు ఆసరా 

నేను డిగ్రీ ఫస్టియర్ చదువుతున్నా. నాన్న చనిపోయారు. అమ్మ హాస్పిటల్‌‌‌‌లో పనిచేస్తోంది. అమ్మకు నా చదువు భారం కాకూడదనే ఫుడ్ డెలివరీ బాయ్‌‌‌‌గా పనిచేస్తున్నా. నెలకు ఎంత లేదన్నా.. నా ఖర్చులు పోను 15వేల  వరకు ఇంట్లో ఇస్తున్నా. డెలివరీ కోసం వెళ్లినపుడు చాలామంది  బాగానే రిసీవ్ చేసుకుంటున్నారు. కానీ, కొందరు మాత్రం  నైట్ టైమ్‌‌‌‌లో తాగి టైమ్ పాస్‌‌‌‌కు ఆర్డర్లు పెట్టి క్యాన్సిల్ చేస్తుంటారు. అలాంటపుడు చాలా బాధనిపిస్తుంది. ఇంకొందరైతే కాస్త లేట్ అయినా ర్యాష్‌‌‌‌గా మాట్లాడతారు. ‘‘టైమ్ సెన్స్ లేదా?” అంటూ ఎంత మాట పడితే అంత మాట అంటారు. ఆ టైమ్‌‌‌‌లో కోపం వచ్చినా.. ఏం చేయలేం. ఇల్లు.. చదువు అన్నీ గుర్తొస్తాయి. కొందరు రూపాయి, రెండు రూపాయల చిల్లర కోసం లొల్లి చేస్తుంటారు. ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. అయినా అలాంటివన్నీ చూసీ చూడనట్లు పోతేనే మా పని నడుస్తుంది.
– బరిగె భాను ప్రసాద్, కరీంనగర్

డెలివరీ బాయ్స్​ ఎక్కువైతున్నరు

కస్టమర్లు కొన్నిసార్లు తప్పుడు అడ్రస్‌‌‌‌ ఇచ్చి, ఇబ్బంది పెడుతుంటారు. బైక్ ప్రాబ్లమ్స్​, ట్రాఫిక్​ ప్రాబ్లమ్స్​ వల్ల ఆర్డర్​ లేటయినా ఇబ్బందే. కొన్ని సందర్భాల్లో ఆర్డర్స్ క్యాన్సిల్ అయినా పెట్రోల్​, టైమ్​ లాస్ కావాల్సి వస్తుంది. వీకెండ్స్‌‌‌‌లో ఆర్డర్స్​ ఎక్కువగా వస్తే రోజుకు వెయ్యి రూపాయల వరకు  సంపాదించవచ్చు. కానీ ఆర్డర్స్‌‌‌‌ పెరిగిన కొద్దీ అంతకంటే ఎక్కువగా డెలివరీ బాయ్స్ జాయిన్ అవుతున్నారు. దాంతో అందరికీ సరిపడా ఆర్డర్స్ రావడం లేదు. దాంతో ఇదివరకటితో పోలిస్తే ఆదాయం చాలా తగ్గింది. వచ్చే ఆదాయం బ్యాచిలర్స్‌‌‌‌కు సరిపోతుంది. కానీ, పెళ్లయిన వాళ్లకు ఇల్లు గడవడం ఇబ్బందే. 
– మర్రిపెల్లి లక్ష్మణ్​, హనుమకొండ

కాస్త కష్టపడితే పర్లేదు

ఇదివరకు ఓ ఫుడ్​ డెలివరీ యాప్‌‌‌‌లో పని చేసి.. కొద్దిరోజుల కిందటే మానేశా. డెలివరీ బాయ్స్​ తక్కువ ఉన్న ఏరియా అయితే ఎక్కువ ఆర్డర్స్​ వచ్చే అవకాశం ఉంటుంది. ఎన్ని ఎక్కువ ఆర్డర్స్​ డెలివరీ చేస్తే.. అంత ఎక్కువ కమీషన్​ వస్తుంది. ఓపిక, కష్టపడే తత్వం ఉంటే డెలివరీ బాయ్స్‌‌‌‌ లైఫ్​ బాగానే ఉంటుంది. పార్ట్​ టైమ్​ చేద్దామని అనుకునేవాళ్లకు కూడా బాగానే ఉంటుంది. కానీ.. డెలివరీ చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు మాత్రం తప్పవు. 
– సాడ రాజేందర్​, హనుమకొండ

లాభాలున్నాయా? 

ఎన్నో సమస్యలున్న ఈ జాబ్‌‌‌‌లో కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. కొన్ని కంపెనీలు డెలివరీ బాయ్స్‌‌‌‌కి ప్రత్యేకంగా ఏరియాలు కేటాయించవు. సిటీలో ఎక్కడికైనా వెళ్లి డెలివరీ చేయాల్సి ఉంటుంది. ట్రావెలింగ్ ఇష్టమైన వాళ్లకు అది మంచి ఎక్స్‌‌‌‌పీరియెన్స్‌‌‌‌. అన్ని రకాల రోడ్లపై డ్రైవింగ్ చేయడం థ్రిల్లింగ్‌‌‌‌గా ఉంటుంది. కొన్ని కంపెనీలు ఎప్పుడు కావాలంటే అప్పుడు పనిచేసుకునే అవకాశం ఇస్తున్నాయి. అంటే రోజులో ఎప్పుడైనా పనిచేసుకోవచ్చు. చేయాలని లేకపోతే ఇంటికెళ్లి రెస్ట్‌‌‌‌ తీసుకోవచ్చు. 9–5 జాబ్స్‌‌‌‌లో ఈ సౌకర్యం ఉండదు. కొందరు స్టూడెంట్స్‌‌‌‌ కూడా డెలివరీ బాయ్స్‌‌‌‌గా పనిచేసి, చదువుకోవడానికి కావాల్సిన డబ్బుని సంపాదిస్తున్నారు. ఇంకొందరు పెద్ద ఉద్యోగాల కోసం ట్రై చేస్తూ.. స్టాప్​ గ్యాప్​ కింద ఇలాంటి ఉద్యోగాలు చేస్తున్నారు. 

-కరుణాకర్​ మానెగాళ్ల