
- సరైన ధర రాక నష్టపోతున్న రైతులు
వనపర్తి మండలం కాశీంనగర్‌కు చెందిన రైతు రాములు వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డుకు 130 సంచుల వేరుశనగ తెచ్చాడు. యార్డులోకి సరుకు తెచ్చేటప్పుడు ఎలాంటి ఎంట్రీ చేయలేదు. వ్యాపారులు పల్లీ కుప్ప దగ్గరికి వచ్చి క్వింటాలుకు రూ.5600 ధర వేసి వెళ్లారు. ఏజెంట్ లెక్క రాసుకున్నాడు. పెట్టుబడి పెరిగి గిట్టుబాటు ధర రాక రాములు లబోదిబోమంటున్నాడు. ఇలా ఆ ఒక్క రైతుకే కాదు.. చాలా మంది రైతులు కమీషన్ ఏజెంట్లు మోసం చేయడంతో ధర రాక నష్టపోతున్నారు.
వనపర్తి, వెలుగు : రైతులు పండించిన పంటలకు మంచి ధర రావాలని కేంద్ర ప్రభుత్వం 2016లో జాతీయ వ్యవసాయ మార్కెట్ (ఈ–నామ్)ను ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా పంటలకు మంచి ధర వచ్చే అవకాశం ఉన్నా.. ఇది అమలు కాకపోవడంతో స్థానిక వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ–నామ్ ద్వారా కొనుగోలు చేయకుండా దృష్టి మళ్లిస్తున్నారు. పంట దిగుబడులు కొనుగోలు చేసే ఇతర ప్రాంతాల వ్యాపారుల నుంచి సమయానికి డబ్బులు అందవని, బ్యాంకు ఖాతాలో వేసినా బాకీ ఏమన్నా ఉంటే పట్టుకుంటారని.. తామైతే వెంటనే చెల్లిస్తామంటూ నమ్మబలికి స్థానిక వ్యాపారులు, కమీషను ఏజెంట్లు రైతులను తప్పుదారి పట్టిస్తున్నారు.
మార్కెట్లలో అరకొరగా అమలు..
ఉమ్మడి పాలమూరు జిల్లాలో 16 వ్యవసాయ మార్కెట్ యార్డులు ఉన్నాయి. 5 ఏండ్ల కిందటే మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల, నారాయణపేట, దేవరకద్ర, బాదేపల్లి, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, మక్తల్, వనపర్తి రోడ్(మదనాపురం), ఆత్మకూరు మార్కెట్ యార్డుల్లో ఈ–నామ్‌ను ప్రవేశపెట్టినా నిర్వహణ అంతంత మాత్రంగానే ఉంది. ప్రస్తుతం మార్కెట్‌కు వేరుశనగతో పాటు వడ్లు వస్తున్నాయి.
ఏజెంట్లు రైతుల వద్దకు వచ్చి ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా ఉందని, బాగా ఆరబెట్టుకుంటే ధర వస్తుందని కాలయాపన చేస్తుండడం, రెండు మూడు రోజులు మార్కెట్లో ఉండలేక రైతులు ఏజెంట్లు చెప్పిన ధరకే అమ్ముకోవాల్సి వస్తోంది. ఇదిలాఉంటే ఇప్పటికీ ఈ–నామ్ గురించి రైతులకు అవగాహన లేదు. మార్కెటింగ్ ఆఫీసర్లు వారికి అవగాహన కల్పించేందుకు సైతం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో రేట్లు ఎక్కువ ఉండగా, ఉమ్మడి జిల్లాలో వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు అగ్గువకు కొనుగోలు చేసి లాభాలు పొందుతున్నారు. మార్కెట్ అధికారులు, వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు కుమ్మక్కై రైతులకు నష్టం కలిగిస్తున్నారు.
ఈ–నామ్ తో లాభాలు ఇవే..
- రైతులు తెచ్చిన పంట ఉత్పత్తుల నాణ్యతను పరీక్షించి గ్రేడింగ్ వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తారు.
- ఆన్లైన్లో సరుకు నాణ్యతను చూసుకున్న దేశంలోని వివిధ ప్రాంతాల్లోని వ్యాపారులు ధరను నిర్ణయిస్తారు.
- ఆన్లైన్లో వచ్చిన ధరలను సరిచూసుకున్న తరువాత రైతు ఏ వ్యాపారి ఎక్కువ ధర కోట్ చేస్తే అతనికే సరకు అమ్ముకోవచ్చు.
- మార్కెట్లో అమలవుతున్న ధరలను డిస్ప్లే బోర్డుల్లో ప్రకటిస్తే రైతుకు ధరపై అవగాహన వస్తుంది. ఇలా చేయకపోవడంతో నష్టం జరుగుతోంది.
- ధరలను ఎప్పటికప్పుడు ప్రకటిస్తే వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు రైతులను తప్పుదారి పట్టించే అవకాశం ఉండదు. ధరలు తెలిస్తే తమ మోసం బయటపడుతుందని భావిస్తున్న వ్యాపారులు ధరలు ప్రకటించకుండా చూస్తున్నారు.