డ్రగ్స్ పై ఈగల్ టీం ఉక్కుపాదం.. హైదరాబాద్ లో రూ. 4 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం..

డ్రగ్స్ పై ఈగల్ టీం ఉక్కుపాదం.. హైదరాబాద్ లో  రూ. 4 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం..

మాదకద్రవ్యాల నిర్ములనే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ టీం డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతోంది. ఎక్కడికక్కడ తనిఖీలు, మెరుపు దాడులతో డ్రగ్స్ మహమ్మారిని కట్టడి చేస్తోంది ఈగల్ టీం. ఈ క్రమంలో  మంగళవారం ( ఆగస్టు 5 ) హైదరాబాద్ లో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకుంది ఈగల్ టీం. ఒరిస్సా నుండి హైదరాబాద్ మీదుగా ఉత్తరప్రదేశ్ కు తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పక్కా సమాచారంతో తనిఖీలు నిర్వహించి రూ. 4.2 కోట్ల విలువజేసే 847 కిలోల గంజాయిని చేసుకున్నట్లు తెలిపారు పోలీసులు.  నిందితుల దగ్గర నుంచి బొలెరో వాహనం, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని సీజ్ చేసినట్లు తెలిపారు పోలీసులు.

ఆర్‌ఎన్‌సిసి ఖమ్మం, ఈగల్, సైబరాబాద్ నార్కోటిక్ పోలీస్  సిబ్బంది సంయుక్త నిర్వహించిన ఈ ఆపరేషన్ లో తొండుపల్లి దగ్గర బెంగళూరు హైవేపై వాహన తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు పోలీసులు. ఈ తనిఖీల్లో ఒక ట్రక్కును పట్టుకున్నామని.. ట్రక్కులో 847 కిలోల గంజాయి పట్టుబడిందని.. గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. 847 కిలోల గంజాయి కొనడానికి యూపీ కి చెందిన షఫీ ఒరిస్సా కు చెందిన రమేష్ సుక్రి అనే వ్యక్తికి ఆర్డర్ ఇచ్చినట్లు గుర్తించామని తెలిపారు పోలీసులు. 

గంజాయి ఆర్డర్ ఇవ్వడానికి షఫీ పది రోజుల క్రితం రాజమండ్రి వచ్చాడని.. రమేష్ సుక్రీ గంజాయి సేకరించి ఖిల్లా ధన, రాజేందర్ బాజింగ్ తో గంజాయి ట్రాన్స్పోర్ట్ చేయించాడని తెలిపారు. బెంగళూరు జాతీయ రహదారిపై షఫీ గంజాయి రిసీవ్ చేసుకోవాల్సి ఉండగా.. షఫీ చేతికి గంజాయి అందడానికి ముందే గంజాయి నీ పట్టుకున్నామని తెలిపారు పోలీసులు. గంజాయి తరలిస్తున్న ట్రక్కులో కత్తులు లాంటి మారణాయుధాలు కూడా  లభ్యమయ్యాయని తెలిపారు. 

నిందితుడు ఖిల్లా ధనపై 2019లో ఏపీ లో గంజాయి కేసు నమోదయ్యిందని.. ఖిల్లా ధన రాజమండ్రి సెంట్రల్ జైలులో 4 నెలలు శిక్ష అనుభవించారని తెలిపారు. 2025లో ఉత్తరప్రదేశ్‌కు మూడు సార్లు గంజాయి డెలివరీ చేశాడని.. 350, 500, 600 కిలోల చొప్పున మూడుసార్లు గంజాయి సప్లై చేశాడని గుర్తించామని అన్నారు పోలీసులు.  రాజేందర్ బాజింగ్ 2023లో గంజాయి కేసులో అరెస్ట్ అయ్యాడని.. విశాఖపట్నం సెంట్రల్ జైలులో 10 నెలలు గడిపాడని తెలిపారు పోలీసులు.