
న్యూఢిల్లీ: మన దేశ విదేశాంగ విధానాన్ని కేంద్రం నాశనం చేస్తున్నదని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. భారత్, చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతిపై చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు విదేశాంగ మంత్రి జైశంకర్ వివరించడంపై ఆయన ఫైర్ అయ్యారు.
‘‘చైనా విదేశాంగ మంత్రినే వచ్చి భారత్, చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతిపై ప్రధాని మోదీకి వివరిస్తారని నేను ఊహించాను. కానీ అలా జరగలేదు. మన దేశ విదేశాంగ విధానాన్ని నాశనం చేసేందుకు విదేశాంగ శాఖ సర్కస్ నడుపుతున్నది” అని రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ మేరకు ‘ఎక్స్’లో మంగళవారం పోస్టు పెట్టారు. కాగా, కేంద్రం ఇప్పటికైనా బార్డర్ ఇష్యూపై పార్లమెంట్‌లో చర్చిస్తుందా? అని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ ప్రశ్నించారు.