పేరుకే ఎంసెట్ స్పాట్ కౌన్సెలింగ్.. ఇష్టారాజ్యంగా అడ్మిషన్లు

పేరుకే ఎంసెట్ స్పాట్ కౌన్సెలింగ్.. ఇష్టారాజ్యంగా అడ్మిషన్లు

అంతా.. ‘స్పాట్’ దోపిడీ

ఇంజనీరింగ్ సీట్లకు డొనేషన్ల పేరుతో లక్షల్లో వసూళ్లు

రెండు విడతలతోనే చేతులు దులుపుకొన్న సర్కార్

హైదరాబాద్, వెలుగు:  రాష్ర్టంలో ఇంజనీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్ల తంతు ఇష్టారాజ్యంగా మారింది. కేవలం ఫస్ట్ ఫేజ్, ఫైనల్ ఫేజ్ అని రెండు విడతల్లోనే కౌన్సెలింగ్ నిర్వహించి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. ఇంకో విడత కౌన్సెలింగ్ పెట్టాలని పేరెంట్స్, స్టూడెంట్స్‌ కోరినా పట్టించుకోలేదు. ఇది ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలకు కాసుల పంటగా మారింది. స్పాట్ కౌన్సెలింగ్‌కూ లక్షల్లో డొనేషన్లు వసూలు చేస్తున్నాయి. విషయం తెలిసినా ప్రభుత్వ పెద్దలు గానీ, విద్యాశాఖ అధికారులు గానీ పట్టించుకోవడం లేదు.

24,870 సీట్లు మిగిలినయ్

రాష్ట్రంలో 181 ఇంజనీరింగ్ కాలేజీల్లో ఎంసెట్ ద్వారా అడ్మిషన్లు నిర్వహించారు. కన్వీనర్ కోటాలో 70,120 సీట్లు ఉన్నాయి. ఎంసెట్ లో 89,572 మంది క్వాలిఫై కాగా, 58,142 మంది మాత్రమే సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. దీంట్లోనూ రెండు విడతల్లో కలిపి 50,844 మందికి సీట్లను కేటాయించారు. కానీ 45,250 మందే కాలేజీల్లో చేరారు. ఫైనల్ ఫేజ్లో సీట్లు వచ్చినా 5,444 మంది చేరకపోగా, మరో 2,777 మందికి సీట్లే అలాట్ కాలేదు. వీరితో పాటు మరో 910 మంది వచ్చిన సీట్లను క్యాన్సిల్ చేసుకున్నారు. దీంతో కన్వీనర్ కోటాలో 24,870 సీట్లు మిగిలినయి.

అంతా హడావుడిగానే..

ఎంసెట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ అక్టోబర్ లో నిర్వహించగా, ఫైనల్ ఫేజ్ ఈ నెలలో జరిగింది. ఈ ప్రక్రియ అంతా హడావుడిగానే కొనసాగింది. ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్లు అక్టోబర్ 18 నుంచి 22వరకూ నిర్వహించగా, తొలిరోజు అర్థరాత్రి వరకూ ప్రభుత్వం సీట్లకు పర్మిషన్ ఇవ్వలేదు. ఫైనల్ ఫేజ్లోనూ చివరి నిమిషం వరకూ వెబ్ ఆప్షన్ల గడువు పెంచలేదు. ఈ నెల 12న ఫైనల్ ఫేజ్ సీట్లను కేటాయించగా, 17వరకు గడువు ఇచ్చి, చివర్లో ఒకరోజు   గడువు పెంచారు. అయితే 13, 14, 15 తేదీల్లో దీపావళి, ఆదివారం ఉండటంతో వివిధ కాలేజీల్లోని ఇంటర్ సర్టిఫికెట్లు తెచ్చుకునేందుకు స్టూడెంట్స్ ఇబ్బందులుపడ్డారు. దీనికితోడు కన్వీనర్ కోటా ఫీజునూ రిపోర్టింగ్ సమయంలోనే కట్టాలనే నిబంధన ఉండటంతో, చాలామంది సకాలంలో రిపోర్టు చేయలేకపోయారు. గడువు పెంచాలని స్టూడెంట్స్ యూనియన్లు కోరినా పట్టించుకోలేదు. ఈ నెల 19న ఇంటర్నల్ స్లైడింగ్ పెట్టారు. 23నే స్పాట్ పూర్తి చేయాలని ఆదేశించారు. ఎక్కడా గ్యాప్ లేకుండా అంతా హడావుడిగానే ప్రక్రియ కొనసాగించారు.

స్పాట్ ద్వారా ప్రైవేటు దందా 

సర్కారు ఇంజనీరింగ్ కాలేజీల్లో 3,150 సీట్లు ఉంటే, 3,100లకు పైగా సీట్లు నిండాయి.167 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో 66,969 సీట్లుంటే, 47,734 మందికి సీట్లు అలాట్ అయ్యాయి. వీరిలో చాలామంది కాలేజీల్లో చేరలేదు. దీంతో 23 వేలకు పైగా సీట్లు మిగిలినయి. నిబంధనల ప్రకారం ప్రైవేటు కాలేజీల్లో ఖాళీగా ఉన్న సీట్లను స్పాట్ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేసుకోవచ్చు. అయితే స్పాట్ కౌన్సెలింగ్లో సీట్లకు కన్వీనర్ కోటా ఫీజునే తీసుకోవాలి. స్టూడెంట్స్ నుంచి అప్లికేషన్లు తీసుకుని, సీట్లు కేటాయించాలి. కానీ ఒక్క కాలేజీ కూడా ఈ నిబంధనలు అమలు చేయడం లేదు. పెద్ద కాలేజీల్లో రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. దీంతో అధికారికంగానే వసూళ్లకు చాన్స్ ఇచ్చినట్లు అయింది. చిన్న కాలేజీలకు మాత్రం ఇది ఇబ్బందికరంగా మారిందని చెబుతున్నారు.

కాలేజీలకు అనుకూలంగా.. 

అడ్మిషన్ల ప్రక్రియ అంతా ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల కనుసన్నుల్లోనే జరిగిందనే ఆరోపణలున్నాయి. ఇంటర్నల్ స్లైడింగ్ ఆన్‌లైన్‌లో చేపట్టాలి. కానీ కాలేజీలకు ఈ ప్రక్రియ జరపాలని ఆదేశించడంతో, ఎక్కువ డబ్బులిచ్చిన వాళ్లకే డిమాండ్ ఉన్న కోర్సుల్లో సీట్లు ఇస్తున్నారు. సీట్ల కేటాయింపు వివరాలనూ అధికారులు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ప్రైవేటు కాలేజీల మేనేజ్‌మెంట్లకు అనుకూలంగా విద్యా శాఖలోని ఓ ఆఫీసర్ చక్రం తిప్పారని, మూడో విడత కౌన్సెలింగ్ పక్కన పెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. సరిచే యాల్సిన ఉన్నతాధికారి నాకెందుకులే అనే ధోరణిలో వ్యవహరించారంటున్నారు.

For More News..

ఆ మ్యాచ్ తర్వాత కోహ్లీ మెచ్చుకున్నడు